రాంగ్ రూట్లో ‘కింగ్’ హంగామా… ‘మన్మధుడు 2’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 1.75/5

మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వయాకామ్ 18 స్టూడియోస్‌ సంస్థలు రాహుల్ ర‌వీంద్ర‌న్‌ దర్శకత్వం లో నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధాంశం… సాంబ‌శివ‌రావు అలియాస్ శామ్ (నాగార్జున అక్కినేని) కుటుంబం పోర్చుగ‌ల్‌లో ఉంటుంది. అప్పుడెప్పుడో మూడు త‌రాల ముందు లేబ‌ర్లుగా వేరే దేశానికి విజ‌య‌న‌గ‌రం నుంచి వెళ్తున్న వారి కుటుంబం మ‌ధ్య‌లో పోర్చుగ‌ల్‌కి చేరుకుంటుంది. అలా ఆ బోటులో వెళ్లిన వాళ్లంద‌రూ కెసాండ్రాలో స్థిర‌ప‌డ‌తారు. దాన్ని కాసాంధ్రా కింద మారుస్తారు. జ‌నాబా క్ర‌మేణ పెరిగి పెద్ద‌ద‌వుతుంది. పొరుగు దేశాన ఉండ‌టం వ‌ల్ల కుటుంబంలో ఆప్యాయ‌త‌లు ఎక్కువ‌గా ఉంటాయి. సాంబ‌శివ‌రావు 12 ఏళ్లున్న‌ప్పుడే తండ్రి చ‌నిపోతాడు. త‌ల్లి (ల‌క్ష్మి) అత‌న్ని పెంచుతుంది. అత‌నికి ఇద్ద‌రు అక్క‌లు (ఝాన్సీ, దివ్య ద‌ర్శిని), ఒక చెల్లెలు(నిశాంతి) ఉంటారు. అంద‌రికీ పెళ్లిళ్ల‌యిపోయి ఉంటాయి. సాంబ‌శివ‌రావుకు అప్పుడెప్పుడో ల‌వ్ ఫెయిల్యూర్ (కీర్తిసురేష్ తో) కావ‌డంతో అత‌ను మ‌ళ్లీ పెళ్లి జోలికి వెళ్ల‌డు. ఇంట్లో వాళ్ల ముందు వర్జిన్‌గా న‌టిస్తూ, బ‌య‌ట‌మాత్రం రాస‌లీల‌లు కొన‌సాగిస్తుంటాడు. అత‌ని వృత్తి పెర్ఫ్యూమ్ త‌యారుచేయ‌డం. ఉన్న‌ట్టుండి సాంబ‌శివ‌రావు త‌ల్లి అత‌న్ని మూడు నెల‌ల్లో పెళ్లి చేసుకోమ‌ని అంటుంది. స‌రిగ్గా ఆ స‌మ‌యంలో త‌న కుటుంబ‌స‌భ్యుల ముందు త‌న ప్రేయ‌సిగా న‌టించ‌డానికి అవంతిక (ర‌కుల్ ప్రీత్‌సింగ్‌)తో బేరం కుదుర్చుకుంటాడు. తీరా పెళ్లి స‌మ‌యానికి ముందే అనుకున్న‌ట్టు అవంతిక అక్క‌డికి రాదు. దీంతో సాంబ‌శివ‌రావు త‌ల్లి స‌గం కోమాలోకి వెళ్తుంది. ఆ త‌ర్వాత ఏమైంది? సాంబ‌శివ‌రావు త‌ల్లి కోసం అవంతిక తిరిగి వ‌చ్చిందా? అత‌ని నిజ స్వ‌రూపం తెలుసుకున్న అక్క‌చెల్లెళ్లు ఏం చేశారు? మ‌ధ్య‌లో కిశోర్ (వెన్నెల కిశోర్‌) ఏం చేశాడు? సాంబ‌శివ‌రావు మావ‌య్య (రావు ర‌మేష్‌)కు ఉన్న అనుమానాలేంటి? అస‌లు కాక‌ర‌కాయ కూర‌కు ఆ ఇంట్లో ఉన్న స్టోరీ ఏంటి? ఇవన్నీ సినిమాలో చూడాలి….

విశ్లేషిస్తే… ‘చిలసౌ’ తరువాత దర్శకుడు రాహుల్ పెద్ద నిర్మాణ సంస్థలో, మంచి నటులతో ఈ చిత్రాన్ని చేసారు. ‘ఐ డూ’ అనే ఫ్రెంచ్‌ రొమాంటిక్‌ కామెడీని తెలుగులో రీమేక్‌ చేశాడు. అయితే వాటిని ఉపయోగించుకోవడంలో విఫలం చెందాడు. మూవీకి ప్రాణమైన ఎమోషన్స్ లేకపోవడంతో చిత్రం ఫెయిలయ్యింది. దర్శకుడు రాహుల్ రవీంద్ర మొదటి సగం కొంచెం ఆహ్లాదంగా నడిపినా రెండవ భాగంలో కథను తేల్చేశాడు. ఇంట్లో వాళ్ల‌ని న‌మ్మించ‌డం కోసం ప్రేమిస్తున్నానంటూ ఓ వ్య‌క్తిని తీసుకెళ్లి ఇంట్లో వాళ్ల‌ను మోసం చేసే కాన్సెప్ట్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త‌ కాదు. కానీ ఇందులో హీరో మ‌ధ్య వ‌య‌స్కుడు కావడం కాస్త కొత్త‌గా ఉంది. నాగార్జున ను తెరపై చూపించిన విధానం, ఆయన పాత్ర రూపొందించిన తీరు మాత్రం బాగుంది. కొత్తదనం లేకపోవడం, ఇంతకు ముందు అనేక చిత్రాలలో చూసిన భావన కలగడం ఈచిత్రానికి ప్రధాన బలహీనత.దీని హక్కులు ఫ్రాన్స్‌నుంచి ఎందుకు కొనుక్కొచ్చారో మనకి అర్ధం కాదు. సెకండ్ హాఫ్ లో కథకు అవసరం లేని సన్నివేశాలు మూవీ నిస్సారంగా సాగడానికి కారణమయ్యాయి. నాగార్జున,రకుల్ దూరమైన తరువాత కథ ఆసక్తిగా సాగలేదు.అయితే అందాల ఆర‌బోత‌కు కొర‌త‌లేదు.డ‌బుల్ మీనింగ్ డైలాగుల‌కు అస‌లు కొద‌వేలేదు.
 
నటవర్గం… నాగార్జున మన్మధుడు గా తన గ్లామర్ తో ఆకట్టుకున్నాడు. యంగ్ గా నాగార్జున ఈ చిత్రంలో కనిపించారు. జీవితాన్ని నచ్చినట్టుగా ఆస్వాదించే ప్లే బాయ్ పాత్రలో కామెడీ పరంగా ..ఎమోషన్స్ చక్కగా పండించారు.రకుల్ కి అవంతిగా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దొరికింది. ర‌కుల్ వెయిట్రెస్‌గా న‌టించింది.రకుల్ అటు గ్లామర్ పరంగా,నటన పరంగా మంచి మార్కులు సంపాయించింది.ఇక వెన్నెల కిషోర్ కామెడీ ఆహ్లాదంగా సాగింది. కిషోర్ కామెడీ టైమింగ్ తోపాటు, నాగార్జున కు ఆయనకు మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పండిస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తుంది. ఇక రావు రమేష్ ని పూర్తిగా వినియోగించుకోలేదనే భావన కలిగినప్పటికీ, ఆయన తనదైన శైలి, డైలాగ్ డెలివరీ తో ఆకట్టుకున్నాడు. ఓబేబీలో బాధ్య‌త‌గ‌ల బామ్మ‌గా న‌టించిన ల‌క్ష్మికి ఈ సినిమాలో పూర్తిగా డిఫ‌రెంట్ పాత్ర ఇచ్చారు.ఆమె పాత్ర,నటన మెప్పిస్తుంది. హీరో అక్క‌లుగా ఝాన్సీ , దేవ‌ద‌ర్శిని, చెల్లెలుగా నిశాంతి బాగా చేశారు. కీర్తి సురేష్‌, స‌మంత మెరుపులా కాసేపు కనిపిస్తారు.
 
సాంకేతికంగా… దాదాపు విదేశాల్లోనే చిత్రీకరించిన ఈ చిత్రంలో ఎం.సుకుమార్‌ కెమెరా వర్క్ బాగుంది. పోర్చుగల్‌ లో ఛాయాగ్రహణం కంటికి ఇంపుగా వుంది. లొకేష‌న్లు కూడా కొత్త‌గా ఉన్నాయి.చైతన్ భరద్వాజ్ అందించిన పాట‌లు పెద్ద‌గా మ‌నసుకు ఎక్క‌వు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ ఆహ్లాదకరంగా సాగింది.పాటల సాహిత్యం చక్కగా కుదిరింది. చోటా కె. ప్రసాద్‌, బి. నాగేశ్వరరెడ్డి ఎడిటింగ్ నిరుత్సాహపరుస్తుంది. మూవీలో చాలా అనవసర సన్నివేశాలున్నాయి. నాగ్,రకుల్ ల కాస్ట్యూమ్ వర్క్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి -రాజేష్