గ్రిప్పింగ్‌గా లేని.. ‘వైల్డ్ డాగ్’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2.5/5

మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై అహిషోర్ సాల్మ‌న్‌ దర్శకత్వంలో  నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధ… విజ‌య్ వ‌ర్మ (అక్కినేని నాగార్జున‌) ఎన్ఐఏ ఆఫీస‌ర్‌. తీవ్ర‌వాదులు, నేర‌స్థుల పాలిట విజ‌య్ చాలా నిర్ద‌య‌గా ఉండడంతో.. అత‌న్ని వైల్డ్ డాగ్ అని అంటుంటారు. గోకుల్ చాట్‌లో జ‌రిగిన బాంబ్ బ్లాస్ట్ కార‌ణంగా విజ‌య్ వ‌ర్మ త‌న‌ కుమార్తె న‌వ్య‌ను కోల్పోతాడు. దాంతో ఎన్ఐఏకు దూరంగా ఉంటాడు. అయితే మ‌ళ్లీ దేశంలో వ‌రుస బాంబ్ బ్లాస్ట్‌లు జ‌రుగుతాయి. ఎలాంటి క్లూ కూడా దొర‌క‌దు. దాంతో ఉన్న‌తాధికారులు కేసును విజ‌య్ వ‌ర్మ నేతృత్వంలోని ఎన్ఐఏ(నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ) టీమ్‌కి అప్ప‌గిస్తారు. ఇండియ‌న్ మొజాహిద్దీన్‌కి చెందిన ఖ‌లీద్ ప్లానింగ్‌తోనే ఇండియాలో బ్లాస్టులు జ‌రుగుతున్నాయ‌ని విజ‌య్ వ‌ర్మ అండ్ టీమ్ క‌నిపెడుతుంది. ఖ‌లీద్‌ను ట్రాప్ చేసి ప‌ట్టుకోవ‌డానికి ఓ ప్లాన్ చేస్తారు.ఆ ప్లానింగ్ ప్ర‌కారం ఖ‌లీద్‌ను ప‌ట్టుకునే స‌మ‌యంలో చిన్న పొర‌పాటు జ‌రుగుతుంది. ఖ‌లీద్ దొర‌క్కుండా త‌ప్పించుకుంటాడు. ఆ తర్వాత ప‌రిస్థితుల కార‌ణంగా విజ‌య్ వ‌ర్మ‌ను సస్పెండ్ చేస్తారు. స‌స్పెండ్ అయినా కూడా విజ‌య్ వ‌ర్మ త‌న టీమ్ స‌హాయంతో ఖ‌లీద్ అచూకీ క‌నుగొంటాడు. అత‌న్ని ప‌ట్టుకోవ‌డానికి విజ‌య్ వ‌ర్మ అండ్ టీమ్ ఎలాంటి ప్లాన్ చేస్తుంది? అనే విష‌యాలు తెలియాలంటే సినిమాలో చూడాలి…

విశ్లేషణ… గోకుల్ చాట్, లుంబినీపార్క్, దిల్ సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్టుల గురించి తెలియని  ఉండరు. ఆ బ్లాస్టుల సూత్రధారి అయిన ఖాలిద్ అనే టెర్రరిస్టుని పట్టుకోవడమే ఈ ఆపరేషన్ వైల్డ్ డాగ్. సినిమా అంతా ఓ ప్యాట్ర‌న్‌లో సాగుతుంది. నాగ్‌, అహిషోర్ చేసిన‌ ప్ర‌య‌త్నం బాగానే ఉంది కానీ.. గ్రిప్పింగ్‌గా లేదు. మొదటి భాగంలో పెద్దగా ఆకట్టుకునే అంశాలు లేవు. తర్వాత నెమ్మదిగా కథనంలో కొంత స్పీడ్ వచ్చింది. అయితే ఎక్క‌డా ప్రేక్ష‌కుడు ఎగ్జ‌యిట్ అయ్యే స‌న్నివేశాలు క‌నిపించ‌వు. కొన్నిచోట్ల‌… బాగుందనిపించినా, మొత్తంగా చూస్తే అంతంత మాత్రంగానే  అనిపిస్తుంది. ఇలాంటి హాలీవుడ్ చిత్రాలు, బాలీవుడ్ చిత్రాలు చాలా వచ్చేసాయి. అయితే ఎక్కడా నస లేకుండా ముక్కుసూటిగా కథ చెప్పి రెండు గంటల్లో ముగించిన తీరు బాగుంది. ఖాలిద్ పాత్ర ముఖం చూపించకుండా చాలా సేపు ఇచ్చిన బిల్డప్ బాగుంది. కానీ అతని ఫేస్ రివీల్ అయిన తర్వాత బిల్డప్ డైల్యూట్ అయిపోయింది.

డైరెక్ట్ గా యాక్షన్ లోకి దిగిపోయే ఎన్ఐఏ ఆఫీస‌ర్ పాత్రకి నాగార్జున న్యాయం చేసాడు.ఈ పాత్ర‌కి  నాగార్జున చ‌క్క‌గా సూట్ అయ్యాడు. నాగార్జున కూడా బ్లాస్టుల్లో త‌న కుమార్తెను కోల్పోయాడు.. అనే ఎమోష‌న‌ల్ యాంగిల్‌ను కూడా చూపించారు. ఇత‌ని భార్య గా కాసేపు అతిధి పాత్రలో దియా మిర్జా కనిపించింది. బిగ్ బాస్ ఫేం ఆలి రజాకి మంచి పాత్ర దొరికింది. మిగిలిన ముగ్గురు కాప్స్ కూడా సరిపోయారు. ఖాలిద్ పాత్రధారి కూడా సరైన ఛాయిస్. రా ఏజెంట్ గా స‌యామీఖేర్ బాగా చేసింది. ఆమెది చాలా సీరియస్ క్యారక్టరైజేషన్. అతుల్ కులకర్ణి కూడా సీనియర్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు.

త‌మ‌న్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ని  మెచ్చుకోవాలి .టెక్నికల్ గా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. కానీ కీలక సన్నివేశాల్లో ఇంకాస్త మూడ్ ని ఎలివేట్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. షానియ‌ల్ డియో సినిమాటోగ్ర‌ఫీ కూడా బాగుంది. సినిమా మూడ్ కి అనుగుణంగా కెమెరా కదిలింది. శ్ర‌వ‌ణ్‌ ఎడిటింగ్ బాగానే షార్ప్ గా చేసారు.శ్యామ్ కౌశ‌ల్‌, డేవిడ్‌ యాక్షన్ కొరియోగ్రఫీ రోటీన్ గా ఉంది.కిర‌ణ్ కుమార్ డైలాగులు సీన్స్ కు తగ్గట్లే సాగాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి -రాజేష్