నాని ‘ఎం.సి.ఎ’ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ విడుద‌ల

“సమస్య వచ్చినప్పుడు మేల్కోవడం కాదు. రాకముందే అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే.. మేం మిడిల్‌క్లాస్‌” అంటున్నాడు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఎం.సి.ఎ’. మిడిల్‌క్లాస్‌ అబ్బాయి… అనేది ఉపశీర్షిక. సాయిపల్లవి కథానాయిక. శ్రీరామ్‌ వేణు దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌ నిర్మాతలు. మంగళవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. ‘‘మాది మిడిల్‌క్లాస్‌ అన్నా! అర్ధ రూపాయి పెట్రోల్‌ ధర పెరిగిందంటే… అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర అర కిలోమీటరు క్యూలో నిలబడతాం. అలాంటిది మా ఫ్యామిలీ జోలికి వస్తే…’’ అంటూ సాగే ట్రైలర్‌ని కథానాయకుడు నాని ఆవిష్కరించారు.

అనంతరం నాని మాట్లాడుతూ ‘‘మాది కూడా మిడిల్‌క్లాసే. క్రిస్‌మస్‌, సంక్రాంతి… ఈ పండగ సీజన్‌ అంతా మిడిల్‌క్లాస్‌కి సంబరాలే. విజయవంతమైన ఈ సీజన్‌ మా సినిమాతోనే ఆరంభమవుతుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘సినిమా ఈనెల 21న విడుదలవుతోంది. నాని పాల ప్యాకెట్టు పట్టుకొన్న తొలి పోస్టర్‌ మొదలుకొని… ఈ టైటిలు, టీజర్‌కి మంచి ఆదరణ లభించింది. నాని విజయాలమీదున్నాడు. మా సంస్థ నుంచి వచ్చిన చిత్రాల్లో మాకు ఇది ఆరో విజయవుతుంది. ట్రైలర్‌ విడుదలైన 30 నిమిషాలకే ఆన్‌లైన్‌లో లక్ష్య వ్యూస్‌ వచ్చాయి. చాలా రోజుల తర్వాత భూమిక ఓ కీలక పాత్ర పోషించింది’’ అన్నారు.

రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ ‘‘నానితో నేను చేసిన తొలి సినిమా ఇది. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటుంది’’ అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘మిడిల్‌క్లాస్‌ మైండ్‌ సెట్‌ అందరిలోనూ ఉంటుంది. ఈ సినిమా అందరికీ చేరువవుతుంది. పాటలకి మంచి ఆదరణ లభించింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియదర్శి, రచ్చ రవి తదితరులు పాల్గొన్నారు.