నరసింహ నంది ‘డిగ్రీ కాలేజ్’ జనవరి 1న

వరుణ్, దివ్యారావు హీరోహీరోయిన్లుగా శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నిర్మాణమైన ‘డిగ్రీ కాలేజీ’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఆ మధ్య విడుదల చేసిన ఈ చిత్రం రెండు ట్రైలర్స్ కు విశేషమైన స్పందనతో… సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి. ‘1940లో ఒక గ్రామం’, ‘కమలతో నా ప్రయాణం’ తదితర చిత్రాలు అవార్డులు … దర్శకుడిగా నరసింహ నందికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. కాగా ఆయన తన పంధాకు బిన్నంగా రొమాన్స్ మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించారు. శుక్రవారం ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించడంతో పాటు రెండు ట్రైలర్స్ ను, మేకింగ్ వీడియోను విడుదల చేసారు. అతిధిగా పాల్గొన్న టి.ప్రసన్నకుమార్ ఒక ట్రైలర్ ను, ఇంకో ట్రైలర్ ను సీనియర్ ఫోటో జర్నలిస్ట్ సాయి రమేష్ ఆవిష్కరించగా, మేకింగ్ వీడియోను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత బాపిరాజు విడుదల చేసారు.
 
చిత్ర దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ… జనవరి 1న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. వాస్తవికతను ప్రతిబింబించే చిత్రాలను తీసే అలవాటున్న నేను ఈ చిత్రాన్నిఆర్ట్ జోనర్లో కాకుండా ఇద్దరు డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ మధ్య అంకురించిన యదార్ధ ప్రేమ సంఘటనల ఆధారంగా తీసాను. సహజత్వానికి దగ్గరగా ఇందులో చూపించాను. నా గత చిత్రాలకు బిన్నంగా కమర్షియల్ అంశాలను పొందుపరిచాను. ట్రైలర్లో ఒక రకంగా..సినిమాలో ఒకరకంగా చూపించడం నాకు అలవాటు లేదు. ట్రైలర్స్ లో వున్నది సినిమాలోనూ ఉంటుంది. కేవలం రెండు దృశ్యాలను మాత్రమే సెన్సార్ లో కట్ చేసారు అని చెప్పారు.
 
టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, సందేశాత్మక అవార్డు చిత్రాలను తీసే దర్శకుడు ఇలాంటి రొమాంటిక్ చిత్రం ఎందుకు తీశారో చిత్ర పరిశ్రమ, ప్రేక్షకులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడప్పుడైనా ఆయన తన పంధా చిత్రాలను తీయాలి. యూత్ ను ఈ చిత్రం అమితంగా ఆకట్టుకుంటుందని బావిస్తున్నా అని అన్నారు.
డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ..ఈ చిత్రంలో రొమాన్స్ మాత్రమే కాదు అంతకు మించిన భావోద్వేగ సన్నివేశాలు..హృదయాలను స్పృశించే సన్నివేశాలున్నాయి. అని చెప్పారు.
హీరో వరుణ్ హీరోయిన్ దివ్యారావు తో పాటు ఈ కార్యక్రమంలో నటులు రవి రెడ్డి, మదన్, ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.