‘విలేజ్ రాక్ స్టార్స్’ : ఈశాన్య భారతానికి విశిష్ట గుర్తింపు !

ఏదయినా కళారూపానికి అవార్డులు రావడం రాకపోవడం అన్నది అంత ప్రధాన మయింది కాదు. ఉత్తమ కళారూపమేదయినా కేవలం వినోదం కోసం కాదు. మనుషుల సెన్సిబిలిటీని స్పృశించి మానవ విలువల్ని ఉద్దీపన చేసేదిగా వుంటుంది. అర్థవంతమయిన సినిమా కూడా అంతే. ఈశాన్య భారతం నుంచి ఎదిగిన సినిమా స్వల్పమే కానీ, అన్ని విషయాల్లోలాగే అక్కడి సినిమాకు కూడా ప్రోత్సాహం కరువై పరాయివాడిగానే వుండి పోయింది. కానీ అస్సాం నుంచి వెలువడిన ‘విలేజ్ రాక్ స్టార్స్’ ఈ ఏటి జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచి ఆ ప్రాంత విలక్షణతను నిరూపించుకుంది. ఇప్పుడే కాదు ఇటీవల నవంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన ‘అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం’లో ఏసియన్ పనోరమా విభాగంలో ఉత్తమ చిత్రంగానూ, దర్శకురాలు రీమాసేన్‌కు ఏసియన్ ఉత్తమ దర్శకురాలిగానూ, ప్రధాన పాత్ర పోషించిన బన్నూ దాస్ ప్రత్యేక బహుమతిని గెలుచుకొంది. ఆనాడు ఏసియన్ జ్యూరీలో సభ్యుడిగా వుండి ఎంపికలో ప్రధాన పాత్ర పోషించినందుకు, ఇవ్వాళ అదే చిత్రం భారత జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమాగా నిలవడం ఆనందంగా వుంది. అంతే కాదు జాతీయ ఎంపిక కమిటీ ‘బాలల చిత్రం’ అని చూడకుండా ప్రధాన స్రవంతిలో ఎంపిక చేసినందుకు ఛైర్మన్ శేఖర్ కపూర్, ఇతర సభ్యుల్ని అభినందించాల్సిందే. ప్రకృతి సిద్ధమైన నదీ నదాలూ, పర్వతాలతో స్వచ్చమయిన వాతావరణంతో తులతూగే ఈశాన్య భారతంలో ప్రధాన రాష్ట్రం అస్సాం. అక్కడి నుంచి వచ్చిన సాహిత్యం, సంగీతం, సినిమా మొదలు అన్నీ కళలూ అత్యంత ప్రాంతీయమై అసలైన కళారూపాలుగా వుంటాయి.

అస్సామీ సినిమా జాలీవుడ్ (JOLLYWOOD) గా పిలవబడుతున్నది. 1935లో జ్యోతి ప్రసాద్ అగర్వాల్ నిర్మించిన ‘జోయ్మతి’ సినిమాతో అస్సామీ సినిమా ప్రారంభమయింది. కానీ అనేక కారణాల రీత్యా అక్కడ సినిమా విస్తారంగా ఎదగలేదు. చాలా కాలం కలకత్తా కేంద్రంగానే అస్సామీ సినిమాల నిర్మాణం జరిగింది. కానీ వచ్చిన సినిమాలు మాత్రం చాలా వరకు మంచి సినిమాలుగా పేరుతెచ్చుకున్నాయి. అలా ఇటీవల దర్శకురాలు రీమాదాస్ రచించి, దర్శకత్వం వహించిన సినిమా ‘విలేజ్ రాక్ స్టార్స్’. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ఆసియా విభాగంలో దర్శకత్వ అవార్డుతో పాటు మరో రెండు అవార్డులు కూడా గెలుచుకుంది.

విలేజ్ రాక్ స్టార్స్ సహజంగానూ, గ్రామీణ వాతావరణ నేపథ్యం లోనూ చిత్రించబడి… అస్సాం జనజీవన సజీవ దృశ్యంలా సాగుతుంది. ఈ సినిమాను దర్శకురాలు తమ గ్రామం చాహాయిగాంవ్‌కు అంకితం చేస్తుంది. మహిళల్లో ముఖ్యంగా అమ్మాయిల్లో సొంత కాళ్ళపై నిలబడడం, వ్యక్తిత్వ నిర్మాణం రూపొందించుకోవడం, తన కలల్ని సాకారం చేసుకోవడం అనే అంశాలపై ఈ సినిమా సాగుతుంది. విజువల్‌గా చాలా అద్భుతంగా వుండి అబ్బురపరుస్తుంది. సినిమా కథా కథనానికి వస్తే ఓ మారు మూల గ్రామంలో ధును అనే ఓ పదేళ్ళ అమ్మాయి విధవరాలయిన తన తల్లి, బద్దకస్తుడు అయిన అన్న తో కలిసి జీవిస్తుంటుంది. తల్లి చేసిన తినుబండారాల్ని అమ్ముకు రావడానికి జాతరకు వెళ్ళిన ధును అక్కడ ఒక బాండ్ ప్రదర్శన చూసి అబ్బుర పడుతుంది. అంతే కాదు ఒక కార్టూన్ పుస్తకం చూసి ప్రభావితమయి తానూ ఒక గిటారిస్ట్ కావాలని, తానూ ఒక బాండ్‌ను రూపొందించుకోవాలని కలలుకంటుంది. ఒక పాత పేపర్లో ‘పాజిటివ్‌గా వుండడం వల్ల కలలు సాకార మవుతాయని, దాంతో దేన్నయినా సాధించుకోవచ్చున’ని అర్థం చేసుకుంటుంది. కానీ తమ పేదరికం అసహాయత అడ్డుపడుతుండగా మొక్కవోని దీక్షతో ఒక్కోరూపాయి కూడ బెట్టడం ఆరంభిస్తుంది. అప్పుడే ధును రజస్వల అవుతుంది. మొత్తం ఆచారాల ప్రకారం తంతు నిర్వహిస్తారు. అప్పటినుంచి ఆమెపైన ఆంక్షలు ఆరంభమవుతాయి. చీరె కట్టాలని, మగ పిల్లలతో కలిసి తిరగొద్దని కట్టుబాట్లు చెబుతారు. కానీ ధును తల్లి అందుకు భిన్నంగా తన బిడ్డకు పూర్తి స్వాతంత్రాన్ని ఇస్తుంది. వరదలు ప్రకృతి బీభత్సాలకు వాళ్ళకున్న కొద్ది భూమిలో పంట కూడా కొట్టుకు పోతుంది. ప్రతి ఏటా వరదలకు కొట్టుకుపోయే ఈ వ్యవసాయం ఎందుకు చేయాలని ధును తల్లిని అడుగుతుంది. తమకు తెలిసిన వృత్తీ, యాగం ఇదే అని తల్లి బదులిస్తుంది. మునిగిపోతుందని ఏమీ చేయకుండా వుండలేము కదా అంటుంది. రూపాయి రూపాయి కూడబెట్టి ధును తన గిటార్ కలను నెరవేర్చుకుంటుంది.

ఇక్కడ గిటార్ సాధించడం కేవలం ఒక సింబాలిక్ మాత్రమే, మొత్తం సినిమాలో ధును తన ఉత్సాహం, సొంతంగా సాధించాలనే తత్వం చాలా సహజంగా చూపిస్తుంది దర్శకురాలు. వర్తమాన కాలంలో ఆడపిల్లలకు మగపిల్లలకు నడుమ వుండే ఒక ప్రధానమయిన తేడాను విలేజ్ రాక్ స్టార్స్ వివరిస్తుంది. ధును అత్యంత ఉత్సాహవంతురాలిగా బాధ్యత కలిగిన అమ్మాయిలా వుంటే, ఆమె అన్న బద్దకంగానూ చిన్న అవకాశం దొరికితే చాలు బడి ఎగ్గొట్టే రకంగానూ వుంటాడు. ఇక ధును తండ్రి ఈత నేర్చుకోవానికి భయపడి నీటిలో మునిగి చనిపోతాడు. ఇలా ఆడపిల్లల స్వావలంభనను ఆవిష్కరిస్తూ విలేజ్ రాక్ స్టార్స్ కొనసాగుతుంది. ఇందులో నీలోత్పల్ బోరా సంగీతం అదనపు మూడ్‌ను కలిగిస్తుంది. కెమెరా బాధ్యతల్ని కూడా రీమాదాస్ నిర్వహించారు.

పిల్లల్ని చైతన్యవంతులను చేసే దిశలో సాగే ఈ సినిమాకు ధును పాత్ర ధారి భనితా దాస్ సహజ నటన ప్రధాన ఆకర్షణ. పేదరికానికి, ప్రకృతి వైపరీతలకూ ఎదురొడ్డి తన కలల్ని సాకారం చేసుకునే పాత్రలో భనిత, ఆమె తల్లి పాత్రలో బసన్తీ దాస్‌తో పాటు ఎవరు కూడా వృత్తి కళాకారులు కాదు. అందరూ గ్రామంలోంచి ఎన్నుకోబడ్డవారే కావడం గమనార్హం. విలేజ్ రాక్ స్టార్స్ ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో బహుమతులు గెలుచుకుంటూనే వుంది. పిల్లలు ప్రధానంగా చూడాల్సిన అసలయిన ప్రకృతి సిద్ధమయిన మంచి సినిమా విలేజ్ రాక్ స్టార్స్.
 -వారాల ఆనంద్