నాని టాప్ హీరో అయిపోయినట్టే !

ఎదుగుతున్న హీరోలు. అగ్ర హీరోల స్థాయికి ఎదిగేందుకు చాలా కష్టపడుతున్నారు. వారిలో హీరో నాని ఒకడు. రెండేళ్ల నుంచి అనూహ్య విజయాలు సాధిస్తున్న ‘న్యాచురల్’ స్టార్ నాని రేంజ్ ఎంతో పెరిగిపోయింది. నానితో సినిమాలు చేయడానికి పలువురు నిర్మాతలు క్యూలో ఉన్నారు. ఒకప్పుడు సినిమాకు కోటి నుంచి రెండు కోట్లు తీసుకున్న నాని. ఇప్పుడు ఒక్కో సినిమాకు ఆరు కోట్లకుపైనే తీసుకుంటున్నాడని వినికిడి.ఇదిలా ఉంటే నాని తాజా మూవీ ‘ఎం.సి.ఎ’తో నాని టాప్ హీరోల జాబితాలోకి చేరి పోయినట్లే అంటున్నారు.
నాని అంటే అభిమానం ఉన్నా చాలామంది అతడిని టాప్ స్టార్ అనడానికి ఇష్టపడరు. కానీ అతడి కొత్త సినిమా ‘ఎం.సి.ఎ’ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను బట్టి చూస్తే అతడు కచ్చితంగా టాప్ స్టార్ అయిపోయినట్టే.. అని కొందరంటున్నారు. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ ఇలా అన్నీ కలుపుకుని ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 35 కోట్ల వరకు అయినట్లు సమాచారం.టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న కొందరు హీరోల మార్కెట్ ఇంత కంటే తక్కువేనని, అలాంటప్పుడు నానిని ఏ గ్రేడ్ హీరోగా ఎందుకు పరిగణించరాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ‘ఎం.సి.ఎ’ ప్రీరిలీజ్ బిజినెస్‌కు తగ్గట్టుగానే సినిమా వసూళ్లు ఉంటే నాని కచ్చితంగా టాప్ హీరో అయిపోయినట్టే అని ట్రేడ్ వర్గాలు  చెబుతున్నాయి.