కెసిఆర్‌గా నటించే నటుడు ఎవరు ?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందనే విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్, ‘పెళ్లిచూపులు’ మూవీ నిర్మాత రాజ్ కందుకూరితో కలిసి నిర్మించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ కావటంతో ప్రస్తుతం చిత్రబృందం నటీనటుల ఎంపిక మీద దృష్టిసారించినట్లు తెలుస్తోంది. దాంతో అందరి దృష్టీ కెసిఆర్‌గా నటించే నటుడు ఎవరనేదానిపై పడింది.

గతంలో కెసిఆర్‌ పాత్రకు బాలీవుడ్ న‌టుడు రాజ్‌కుమార్ రావు పేరు వినిపించింది. అయితే తాజాగా మరో బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్ధీఖీ పేరు తెరమీదకు వచ్చింది. ఇప్పటికే బాలీవుడ్ లో పలు విలక్షణమైన పాత్రల్లో నటించి మంచి పేరు పొందారు సిద్దిఖీ. దీంతో చిత్రయూనిట్ నవాజుద్ధీన్ అయితే కెసిఆర్ పాత్రకు సరిగ్గా సరిపోతాడనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  కెసిఆర్ బయోపిక్ కి అంతా సిద్ధం కావడంతో త్వరలోనే మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.