‘రెచ్చిపోతోంది’ అని రాసిన చేతులే, అవకాశాల్లేవనీ రాస్తాయి !

‘‘నేను పరిశ్రమలోకి నటించడానికి వచ్చాను. ‘మంచి’ కథ వస్తేనే నటిస్తాను అని మడిగట్టుకుని కూర్చుంటే అవకాశాలు సన్నగిల్లుతాయి. ‘గ్లామరస్‌ పాత్రల్లో నటిస్తూ రెచ్చిపోతోంది నయనతార’ అని రాసిన చేతులే… ‘నయనతారకు అవకాశాలు రావడం లేదు’ అని రాస్తాయి. అలాంటి వార్తలు నాకిష్టం లేదు. నాకు ఇష్టం లేని వార్తలు ఇప్పటికే ఎన్నెన్నో వస్తున్నాయి….అంటూ గాసిప్స్‌ గురించి ఓ మలయాళ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పింది నయనతార.

‘‘నేను చాలా అరుదుగా మాట్లాడుతుంటాను. ఎదుటి వాళ్లు ఏవేవో వ్యర్థ ప్రేలాపనలు చేస్తున్నారని గ్రహించి, వాటి కోసం  నేను నోరు విప్పను. నేను మాట్లాడాలనుకుంటే తప్ప, నా మనసులోని మాటలను ఎవరూ వినలేరు’’ అని అంటున్నారు నయనతార. ” నా పెళ్లి గురించి రకరకాల వదంతులు వినిపిస్తూనే ఉన్నాయి. వాటిలో నిజం ఎంత ఉందో నాకు, నా కుటుంబ సభ్యులకు తెలుసు. నా కుటుంబ సభ్యులకు తెలియకుండా నేను పెళ్లిచేసుకోను. నాకు వాళ్లు ఎంతో స్వేచ్ఛనిచ్చారు. అలాంటిది పెళ్లి విషయం కన్నవారికి తెలియకుండా ఎందుకు దాస్తాను? వివాహ వ్యవస్థపై నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. అలాంటప్పుడు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకోను కదా!. నా గురించి చిలవలు పలవలు రాసేవారు వీటన్నిటినీ గుర్తుంచుకోవాలి. రేపు నాకు పెళ్లి జరిగితే, అత్తింటివారు ఈ పుకార్లను నమ్మితే నా పరిస్థితి ఏంటి? నా గురించి ఉన్నవీలేనివీ రాసేవారు ఇంత చిన్న లాజిక్‌ను ఎందుకు మర్చిపోతారు?’’ అని ఆమె ప్రశ్నించారు.ఆమె ప్రస్తుతం తెలుగులో రెండు భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.