నయన, దీపిక, సోనమ్‌ పెళ్ళికి సిద్ధమయ్యారు !

తారల ప్రేమకథలు నిత్యం ఉంటూనే ఉన్నాయి. కొందరు అందరికీ చెప్పాక పెళ్లి చేసుకుంటున్నారు. మరికొందరు రహస్యంగా కానిచ్చేస్తున్నారు.అన్నీ ప్రేమ వివాహాలే కావడం విశేషం. మొన్న విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ వివాహం ఆర్భాటంగానే జరిగింది. నిన్న శ్రియ, ఆడ్రూస్‌ వివాహం స్నేహితులు, దగ్గర బంధువుల సమక్షంలో నిర్వహించారు. ఇలియానా అయితే నీబోనేను వివాహం చేసుకున్నాక చేసుకున్నామంటూ చెప్పింది.  దక్షిణాదిలో నయనతార, బాలీవుడ్‌లో దీపిక, రణ్‌వీర్‌ సింగ్… సోనమ్‌ కపూర్‌ వివాహానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరి వివాహం అటుఇటుగా మే, జూన్‌లో ఉండొచ్చు. దానికి వాళ్లు చేసిన ప్రకటనలు, దిగిన ఫొటోలే సాక్ష్యాలు.నయనతార ప్రేమకథలు చాలానే ఉన్నాయి.  ఆ ప్రేమకథలు ముగిశాక చాలా కాలం తర్వాత రెండు మూడేళ్లుగా నయన తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌తో ప్రేమాయణం నడిపుతోంది. ఈ విషయం నయన నేరుగా చెప్పకపోయినా విఘ్నేశ్‌తో విహార యాత్రలు, పుట్టిన రోజు వేడుకులు విదేశాల్లో నిర్వహించినప్పుడు దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నాయి. దీంతో చెప్పకనే చెప్పినట్టు అందరూ అర్ధం చేసుకున్నారు.  ఇప్పుడు ఈ విషయాన్ని పరోక్షంగా తానే స్వయంగా వెల్లడించింది. చెన్నైలో ఓ మీడియా సంస్థ అవార్డుల వేడుకను నిర్వహించింది. ‘ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అవార్డును నయన తార అందుకుంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ…. ‘నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న మా అమ్మ, నాన్న, సోదరుడికి, నాకు కాబోయే భర్తకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు నేను పాల్గొన్న అవార్డుల కార్యక్రమానికి, ఈ కార్యక్రమానికి చాలా తేడా ఉంది. ఇక్కడ నా చుట్టూ ఉన్న మహిళలు సాధించిన విజయం నాలో మరింత స్ఫూర్తిని నింపింది’ అని చెప్పి విఘ్నేశ్‌ తనకు కాబోయే భర్త అని ప్రకటన చేయకనే చేసింది.

నిశ్చితార్థం జరిగినట్టు రూమర్స్‌ !

 ప్రేమపక్షులు దీపికా, రణ్‌వీర్‌లు త్వరలో ఒక్కటి కాబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు.  ప్రస్తుతం ఈ అమ్మడు, తన సన్నిహితులతో కలిసి బెంగళూర్‌లో షాపింగ్‌ చేస్తోందని,  ఇది పెళ్లి కోసమే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. దీపిక పుట్టినరోజైన జనవరి 5న రణ్‌వీర్‌తో నిశ్చితార్థం జరిగినట్టు రూమర్స్‌ వస్తున్నాయి.దీపిక తల్లిదండ్రులు కూడా రణ్‌వీర్‌ కుటుంబ సభ్యులను ముంబైలో కలిసి పెళ్లి తేదీల కోసం చర్చించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా ఈ జోడీ అన్ని పార్టీలకు, ఫంక్షన్‌లకు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండటం అందరికి తెలిసిందే. అయితే ఈ వ్యవహారాలన్నింటిపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు . ప్రస్తుతం దీపిక వెన్నునొప్పి కారణంగా సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చారు. రణ్‌వీర్‌ రోహిత్ శెట్టి దర్శకత‍్వంలో తెరకెక్కుతున్న’సింబా’ (టెంపర్‌ రీమేక్‌) పనుల్లో బిజీగా ఉన్నాడు.

జెనీవాలో పెళ్లి చేసుకోబోతున్నారట ! 

బాలీవుడ్‌ ప్రముఖ కథానాయిక సోనమ్‌ కపూర్‌ కూడా పెళ్లి పీటలెక్కబోతుంది.  మేలో సోనమ్‌కు తన బాయ్ ఫ్రెండ్ వ్యాపారి ఆనంద్‌ అహూజాతో వివాహం జరగనుంది. విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ తరహాలోనే విదేశాల్లో వీరిద్దరూ ఒక్కటయ్యేందుకు వేదికను ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది. జెనీవాలో వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారట. ఈ పనులను ముంబాయికి చెందిన ఓ వెడ్డింగ్‌ ప్లానర్‌ సంస్థ చూస్తోంది. జెనీవాలో వివాహం వేదిక … అక్కడకు విమాన టికెట్‌ ఏర్పాటు వంటి పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. సోనమ్‌ తండ్రి అనిల్‌ కపూర్‌ స్వయంగా ఈ వేడుకకు అతిథులను ఆహ్వానిస్తున్నారు. సంగీత్‌, మెహందీ నిర్వహించనున్నారు. అనంతరం హిందూ పద్ధతుల్లో వీరి వివాహం జరగనుంది. ఈ వివాహానికి ముందు జరిగే నిశ్చితార్థానికి తన కుటుంబానికి బాగా కావాల్సిన వారిని మాత్రమే అనిల్‌ కపూర్‌ ఆహ్వానిస్తున్నారు.