నా ప్రియుడు హీరోగా చేస్తేనే ఆ సినిమా చేస్తా !

దర్శకుడు విఘ్నేష్‌తో నయనతార ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరి పెళ్ళయిపోయిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో నయనతార విఘ్నేష్‌ని హీరో చేద్దామని అనుకుంది. తనతో సినిమా చేద్దామనుకున్న నిర్మాతలతో ‘విఘ్నేష్‌ హీరోగా చేస్తేనే ఆ సినిమా చేస్తా’నని కండిషన్‌ పెట్టిందట. ప్రస్తుతం కోలీవుడ్‌లో నయనతారకున్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని, తప్పనిసరి పరిస్థితుల్లో విఘ్నేష్‌ని హీరోగా పరిచయం చేయబోతున్నాడట ఆ నిర్మాత. ఇప్పటి వరకూ హీరో హీరోయిన్లకు యాక్షన్‌ చెప్పిన విఘ్నేష్‌ ఇప్పుడు యాక్షన్‌ నేర్చుకునే పనిలో బిజీగా ఉన్నాడట. నయనతారా… మజాకా అంటున్నారు.

‘కోకో’ లో మూగ అమ్మాయిగా …

నయనతార ఇప్పుడు అభినయంతో కూడిన పాత్రలకే ఆమోదముద్ర వేస్తున్నారు.  అగ్రతార ఇమేజ్‌ను కాపాడుకునే విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్‌ కావడం లేదు. ప్రస్తుతం నయనతార చేతిలో ఉన్న చిత్రాలన్నీ ఆ తరహావే అని చెప్పవచ్చు. త్వరలో విశ్వనటుడు కమలహాసన్‌కు జంటగా ఇండియన్‌–2 చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న తొలి చిత్రం ఇదే .

నయనతార నటిస్తున్న చిత్రాల్లో ‘కోకో’ ( కోలమావు కోకిల) ఒకటి. నయనతార నటనకు ప్రేక్షకులు నీరాజనం పలికిన చిత్రాల్లో ‘నానూ రౌడీదాన్‌’ ఒకటి. అందులో నయనతార చెవిటి యువతి పాత్రలో అద్భుతంగా అభినయించి ప్రశంసలు పొందారు. ఈ పాత్రకుగానూ సైమా అవార్డును కూడా అందుకున్నారు. తాజాగా నటిస్తున్న ‘కోకో’ చిత్రంలో మూగ అమ్మాయిగా నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

కొత్త దర్శకుడు నెల్సన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర కథ నయనతార చుట్టూనే తిరుగుతుందట. ఇందులో ఆమె పాత్ర స్వరూపం, హావభావాలు, ధరించే దుస్తుల వరకూ చాలా వైవిధ్యంగా ఉంటాయట. ‘అరమ్‌’ చిత్రంలో పూర్తిగా విభిన్నంగా కనిపించిన నయనతార ‘కోకో’ చిత్రంలో మరోసారి తనను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు.

నా స్టార్‌ తో చిన్న మ్యూజికల్‌ జర్నీ…. 

సమ్మర్‌ హాలిడేస్‌ సెల బ్రేట్ చేసుకుంటున్నారు కోలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌. ఈ లవ్‌ కపుల్‌ వీలు దొరికినప్పుడల్లా హాలీడేకు వెళ్తుంటారన్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడెక్కడకు వెళ్లారు అంటే.. మ్యూజిక్‌ ఫెస్టివల్‌కు. అమెరికాలోని కొచెల్లా మ్యూజిక్‌ ఫెస్టివల్‌కు. రాక్, పాప్, ఎలక్ట్రానిక్‌ ఇలా రకరకాల మ్యూజిక్, చాలా మంది ఆర్టిస్ట్స్‌ అందరూ కలిసి మ్యూజిక్‌ సంబరంగా జరుపుకుంటారు.

ఆ సంగీతాన్ని ఎంజాయ్‌ చేయడానికి వారం రోజుల వెకేషన్‌కు వెళ్లారు విఘ్నేశ్, నయన్‌. ఈ ట్రిప్‌లోని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు విఘ్నేశ్‌. ఈ ట్రిప్‌ విశేషాలని వివరిస్తూ–‘ ‘కొచెల్లాలో అమేజింగ్‌ టైమ్‌ స్పెండ్‌ చేశాం. నా స్టార్‌ (నయనతార)తో చిన్న మ్యూజికల్‌ జర్నీ. గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌. స్టార్‌ సింగర్‌ బియాన్స్‌ పర్ఫార్మెన్స్‌ బెస్ట్‌ మూమెంట్స్‌ మాకు. చిన్న ట్రిప్‌తో సమ్మర్‌ వెకేషన్‌ ముగిసింది. ఇక బ్యాక్‌ టు వర్క్‌’’ అని పేర్కొన్నారు.