దక్షిణాది నుండి బాలీవుడ్ కు దారేది ?

“దక్షిణాది చిత్రాలు చాలు, ఉత్తరాదికి దూరం” అని ఇప్పటి వరకూ అంటూ వచ్చిన నటి నయనతార తాజాగా హిందీ చిత్రాలపై మోజు పడుతోంది. దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్‌లో అగ్రనాయకిగా రాణిస్తున్న నయనతార ఇప్పుడు నిజానికి చేతినిండా చిత్రాలున్నాయి. అయినా తన పరిధిని పెంచుకోవడం కోసమో లేక మరింత ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఆశతోనే గానీ బాలీవుడ్‌ రంగప్రవేశానికి పావులు కదుపుతున్నట్లు తాజా సమాచారం.  ఉత్తరాది భామలు దక్షిణాది చిత్రాలవైపు చూస్తుంటే మన వాళ్లకు మాత్రం బాలీవుడ్‌పై మోజు తగ్గడంలేదన్న విషయాన్ని నటి నయనతార మరోసారి నిజమేనని తేల్చింది.

అంతేకాదు,నాకు “సినిమాలే చాలు, వాణిజ్య ప్రకటనల్లో నటించను” అని  స్టేట్‌మెంట్లు ఇచ్చిన నయనతార, చివరికి ఒక శాటిలైట్‌ సంస్థ ఆఫర్‌కు ప్లాట్‌ అయిపోయి, దాని ప్రచార యాడ్‌లో నటించేసింది. నయనతార ఇప్పుడు మరో పనిలో కూడా బిజీగా ఉంది. తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న దర్శకుడు విఘ్నేశ్‌శివతో షికార్లు కొడుతున్న నయనతార …ఇటీవల విఘ్నేశ్‌ పుట్టిన రోజును న్యూయార్క్‌లో జరిపి వార్తల్లోకెక్కింది. అయితే ఇక్కడ ఈ భామ ‘స్వకార్యం, స్వామి కార్యం’ అన్నట్టుగా ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి న్యూయార్క్‌కి వెళ్లిన బాలీవుడ్‌ క్రేజీ నటి ప్రియాంకచోప్రాను కలిసి కాసేపు ముచ్చటించిందట. పనిలో పనిగా తనకు హిందీ చిత్రాలలో నటించాలనే ఆసక్తిని ప్రియాంకచోప్రా ముందు వ్యక్తం చేయడంతో పాటు అక్కడ అవకాశాలను సంపాదించుకోవడానికి దారేంటని  సలహాను కూడా అడిగేసిందట.