కష్టించి పనిచేస్తా, మిగిలినవన్నీ దేవుడికే వదిలేస్తా !

స్టార్‌ హీరోలకు దీటుగా రాణిస్తున్న కథానాయికల్లో నయనతార ఒకరు. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళంలో అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. స్టార్‌ హీరోలకున్నంతగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌నూ సొంతం చేసుకున్నారు.  నటిగా కమర్షియల్‌ సినిమాల్లో చేస్తూనే, మహిళా ప్రాధాన్య చిత్రాల్లో మెప్పిస్తోంది. ఈ ఏడాది ఆమె చేసిన ‘ఆరమ్‌’ బాక్సాఫీస్‌ వద్ద కాసులు కురిపించింది. ఇటువంటి సందేశాత్మక చిత్రాలు చేస్తే నష్టపోతామని సినిమా తీసేందుకు ముందుకు రాని నిర్మాతలు ఎంతోమంది. కానీ ఆ పరిస్థితులను అధిగమించి నయన చేశారు. తన అంచనాలకు తగ్గట్టే మంచి విజయం సాధించింది. ఈ ఏడాది ఈమెకొచ్చిన  గొప్ప హిట్‌చిత్రమిది. న్యూ ఇయర్‌ సందర్భంగా అభిమానులకు నయనతార ఓ లేఖ రాశారు…

”నా జీవితానికి అర్థాన్నిచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు. మీ ప్రేమానురాగాలతో నా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దారు. కష్టించి పనిచేయడం ఒక్కటే చేసి, మిగిలినవన్నీ దేవుడికే వదిలయాలన్నది నేర్చుకున్నా. నేను ఎంటర్‌టైనింగ్‌గా ఉన్న చిత్రాలనే కాదు..’అరమ్‌’ వంటి సందేశాత్మక చిత్రాల్లోనూ చేశాను.  నాకు సపోర్ట్‌ చేసిన మీడియా, పాత్రికేయులు, సోషల్‌ మీడియా, క్రిటిక్స్‌, సినీ పెద్దలకు థ్యాంక్స్‌. ప్రజలు తమ హృదయాల్లో నాకు చోటు కల్పించినందుకు హ్యాపీగా ఉంది. 2018 అందరికీ మరింత ఆనందాన్ని చేకూర్చే విధంగా ఉంటుందని నమ్ముతున్నా. ఎప్పుడూ నిజాయితీగా ఆలోచించండి” అని పేర్కొంది. నయనతార ప్రస్తుతం ‘జై సింహా’, ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఇమైక్కా నోడిగల్‌’, ‘కోలైయుథిర్‌ కాలమ్‌’, ‘కోలమవు కోకిలా’ చిత్రాల్లో నటిస్తోంది.

సీక్వెల్‌ చేయడానికి డైరెక్టర్‌ రెడీ !

నయనతార  డేట్స్‌ కోసం దర్శకుడు గోపీ నాయర్‌ వెయిటింగ్‌. ఈ గోపీ నాయర్‌ ఎవరో తమిళ సినిమాలు ఫాలో అయ్యేవారికి తెలిసే ఉంటుంది. రీసెంట్‌గా రిలీజైన్‌ ‘ఆరమ్‌’ సినిమా దర్శకుడు ఈయనే. నయనతార లీడ్‌ రోల్‌ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇంత హిట్టయిన సినిమాని అలా వదిలేస్తే ఎలా? పైగా కథను కొనసాగించే వెసులుబాటు కూడా ఉంది.

అందుకే సీక్వెల్‌ ప్లాన్‌ చేశారు గోపీ నాయర్‌. ఇందులోనూ నయనతారనే కథానాయికగా అనుకున్నారు. ఆమెకు కూడా సినిమా చేయడం ఇష్టమే. కానీ డేట్స్‌ ఎక్కడ? డైరీ ఫుల్‌.  సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు నయనతార. ఇప్పట్లో మరో సినిమాకి డేట్స్‌ అంటే కష్టమే. మేడమ్‌ డైరీ చెక్‌ చేసుకుని, ‘సై’ అంటే సీక్వెల్‌ స్టార్ట్‌ చేయడానికి డైరెక్టర్‌ రెడీ.