ఛాలెంజింగ్‌ పాత్రలో ఆమె.. నిర్మాతగా ఆయన !

‘లేడీ సూపర్‌స్టార్‌’ నయనతార, దర్శకుడు విఘ్నేష్‌శివన్‌ల ప్రేమాయణం అందరికీ తెలిసిందే. తరచుగా ఈ ప్రేమజంట విహార యాత్రల్లో షికారు చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షించాయి. వారి సాన్నిహిత్యాన్ని చూసిన వారంతా త్వరలో నయన, విఘ్నేష్‌ పెళ్లి చేసుకోనున్నట్లు చెబుతున్నారు. వివాదాలు ఎదురైన సమయంలో నయనతారకు విఘ్నేష్‌ బాసటగా నిలుస్తున్నారు. తాజాగా నయనతార కోసం విఘ్నేష్‌శివన్‌ నిర్మాతగా మారారు. ఆమె ప్రధాన పాత్రలో తమిళంలో థ్రిల్లర్‌ చిత్రం రూపొందనున్నది. ఈ చిత్రానికి మిలింద్‌రావ్‌ దర్శకత్వం వహించనున్నారు. మహిళా ప్రధాన ఇతివృత్తంతో ప్రయోగాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రానికి విఘ్నేష్‌శివన్‌ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. కథలోని నవ్యత నచ్చడంతో పాటు నయనతార నటించనున్న సినిమా కావడంతో విఘ్నేష్‌ తొలిసారి నిర్మాణ బాధ్యతల్ని చేపట్టడానికి సిద్ధమైనట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో నయనతార ఢీగ్లామర్‌ లుక్‌తో ఛాలెంజింగ్‌ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నయనతార తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’, తమిళంలో ‘దర్బార్‌’, ‘బిగిల్‌’ సినిమాలు చేస్తోంది.
 
నాలోని నటనకు కూడా…
పెర్ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ క్యారెక్టర్లు ఎంచుకోవాలనే నిర్ణయం నిన్నా మొన్నటిది కాదు…చాలా సంవత్సరాల క్రితమే ఒక ఇంటర్వ్యూలో ‘‘తెర మీద అందంగా కనిపించాలనుకోవడం తప్పేమీ కాదు. అయితే నాలోని నటనకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను’’ అని చెప్పింది నయన్‌.
 
బ్రాండ్‌ ఇమేజ్‌
ఫిల్మ్, ప్రైవేట్‌ ఫంక్షన్‌లకు నయనతార హాజరు కాదనే పేరు ఉంది. తన ‘బ్రాండ్‌ ఇమేజ్‌’ను మెల్లమెల్లగా పెంచుకోవడంలో భాగంగానే అలాంటి నిర్ణయం తీసుకుంది అంటారు సినీ విశ్లేషకులు. ఇక్కడ రెండు సినిమాలు చేయగానే బాలీవుడ్‌ బాట పట్టి అక్కడ ఫ్లాప్‌ ఎదురుకాగానే ‘ఏది ఏమైనా టాలీవుడే బెటర్‌’ అనే కథానాయికలను చూస్తుంటాం. అయితే నయన్‌ మాత్రం మొదటి నుంచి ‘సౌత్‌’నే నమ్ముకుంది. బాలీవుడ్‌ ప్రస్తావన వచ్చినప్పుడు… ‘‘ఇక్కడ పనిచేయడమంటే సొంత ఇంట్లో పనిచేస్తున్నంత సౌఖ్యంగా ఉంటుంది’’ అని సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ గురించి చెబుతుంటుంది నయన్‌.
 
ఒక్క హిట్టు చాలు !
ఎప్పుడూ టాప్‌లో ఉండటం సాధ్యమేనా? సాధ్యమా అసాధ్యమా అనేది వేరే విషయంగానీ… గెలుపు ఓటములను సమానంగా తీసుకుంటుంది నయన్‌.‘‘రెండు మూడు ఫ్లాప్‌లు వచ్చినా…ఒక హిట్‌ వస్తే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు’’ అని చెప్పింది నయన్‌.