అనుచిత వ్యాఖ్యలపై నయనతార ఆగ్రహం !

నయనతారపై ప్రముఖ సీనియర్ నటుడు రాధారవి చేసిన అనుచిత వ్యాఖ్యలు కోలివుడ్‌లో కాక పుట్టిస్తున్నాయి. డీఎంకే నుంచి నటుడు రాధారవి సస్పెన్షన్‌ కు గురయ్యాడు. సినీనటి నయనతారపై రాధారవి అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయన వ్యాఖ్యలపై ‘నడిగర్‌సంఘం’ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై వివరణ ఇచ్చిన రాధారవి ఆమెపై తప్పుగా మాట్లాడలేదని చెప్పారు.
నయనతార నటించిన తాజా చిత్రం ‘కొలైయుధీర్‌ కాలం’ ఆడియో ఆవిష్కరణలో నటుడు రాధారవి నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌లాంటి గొప్ప నటుల సరసన నయనతార పేరు పలకడం బాధగా ఉంది. ఆమెను ఇన్నేళ్లు భరించడమే గొప్ప విషయం. ఆమె గురించి రాని వార్తల్లేవు. అయినా వాటన్నిటినీ దాటుకుని నిలబడటం మామూలు విషయం కాదు. నయన్‌ దెయ్యంగా నటిస్తుంది. సీతగానూ నటిస్తుంది. ఈ మధ్య హారర్‌ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు నయనతార. తనని మామూలుగా చూస్తే దెయ్యాలే పారిపోతాయి’’ అని నయనతారపై కామెంట్‌ చేశారు. ఒకప్పుడు దేవత వేషం వేయించాలంటే అందరూ కె.ఆర్‌.విజయ వైపు చూసేవాళ్లు. కానీ ఇప్పుడు ఎవరైనా వేయొచ్చు. చూడగానే చేతులెత్తి దణ్ణం పెట్టాలనిపించేవాళ్లూ వేయొచ్చు. చెయ్యెత్తి పిలవాలనిపించేవాళ్లూ వేయొచ్చు. భావితరాల వారిని తలచుకుంటేనే బాధేస్తోంది’’ అని తమిళ నటుడు రాధారవి అన్నారు.
అలాగే ‘మీటూ’ ఉద్యమం మీద కూడా కామెంట్‌ చేశారు రాధారవి… ‘‘సినిమా ప్రమోషన్లలో పాల్గొనమని నటీనటుల మధ్య అగ్రిమెంట్‌ కుదుర్చుకోమని మది (‘కొలైయుదిర్‌ కాలమ్‌’ చిత్రనిర్మాత, రాధారవి అల్లుడు) కి చెప్పాను. అలాగే షూటింగ్‌లో భాగంగా హీరోయిన్‌ను హీరో ఎక్కడైనా తాకుతాడు. ఆ విషయంలో మళ్లీ సినిమా తర్వాత గొడవ చేయకూడదు అనే అగ్రిమెంట్‌ కూడా ఉండాలి’’ అని పేర్కొన్నారు.
నయనతార నటించిన ‘కొలైయుదిర్‌ కాలం’ ప్రెస్‌మీట్‌లో ఆయన ఇలా వ్యాఖ్యలు చేశారు. రాధారవి మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన నేపథ్యంలో నయన్‌ ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ఘాటుగా స్పందించారు. రాధా రవి మాట్లాడిన తీరు బాగోలేదన్నారు. ‘కొలైయుదిర్‌ కాలం’ చిత్రం ఎప్పుడో ఆగిపోయిందని, ఆ చిత్ర వేడుకలో ఇలా మాట్లాడటం సబబు కాదని అన్నారు. నటి రాధిక, శరత్‌కుమార్‌ తనయ వరలక్ష్మి కూడా నయనతారకు మద్దతుగా మాట్లాడారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు తగవని తెలిపారు.
రాధారవి తనపై చేసిన వ్యాఖ్యలకు నయనతార స్పందన….
‘‘మన పని మాత్రమే మాట్లాడాలనే పాలసీని నమ్మే వ్యక్తిని నేను. కానీ ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితుల వల్ల ఈ ప్రెస్‌ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేయాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో నా స్టాండ్‌ గురించి, అసభ్యకర కామెంట్స్‌ పాస్‌ చేసేవాళ్ల ప్రవర్తనతో బాధపడుతున్న స్త్రీల తరఫున మాట్లాడుతున్నాను. ముందుగా రాధారవి స్పీచ్‌పై వెంటనే చర్య తీసుకున్న ‘డీఎంకే పార్టీ అధినేత’ ఎం.కే స్టాలిన్‌గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రాధారవికి, ఆయనలా ఆలోచించే అందరికీ నేను గుర్తు చేయాలనుకుంటున్నది ఒక్కటే.
 
మీ అందరికీ జన్మనిచ్చింది ఓ స్త్రీ అనే సంగతి మరువకండి. స్త్రీలను కించపరచడం, కామెంట్స్‌ చేయడం, అగౌరవపరచడాన్ని ఇలాంటి మతిస్థిమితం సరిగ్గా లేని మగవాళ్లు మగతనంగా భావిస్తున్నారు. వారి ప్రవర్తన నాకు చాలా బాధ కలిగిస్తోంది. అలాగే ఇలా కామెంట్‌ చేయడం గొప్ప అని భావించే మగవాళ్ల కుటుంబంలో ఉంటున్న స్త్రీలందరి పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. ఒక సీనియర్‌ నటుడైన రాధారవి తర్వాతి జనరేషన్‌కు రోల్‌ మోడల్‌గా ఉండాలనుకోకుండా స్త్రీ విద్వేషకుడిగా మిగిలిపోవాలనుకున్నారు.
 
అన్ని రంగాల్లో స్త్రీలు తమ ప్రతిభను చాటుతూ, ప్రస్తుతం ఉన్న పోటీలో తమ స్థానాన్ని నిరూపించుకుంటున్నారు. బిజినెస్‌లో వెనకబడిపోయిన రాధారవి లాంటి వాళ్లు ఇలాంటి తక్కువ స్థాయి మాటలు మాట్లాడి వార్తల్లో నిలవాలనుకుంటున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. స్త్రీలను తక్కువ చేసే వ్యాఖ్యలకు కొందరు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడం. ప్రేక్షకులు ఇలాంటి కామెంట్స్‌ను ప్రోత్సహించినంత వరకూ రాధారవి లాంటి వాళ్లు స్త్రీలను తక్కువ చేయడం, చీప్‌ జోక్స్‌ వేయడం చేస్తూనే ఉంటారు.
 
నా అభిమానులు, సక్రమంగా నడుచుకునే సిటిజెన్స్‌ అందరూ ఇలాంటి చర్యలను దయచేసి ప్రోత్సహించవద్దు. ఈ లేఖ ద్వారా రాధారవి చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నాను. అదృష్టవశాత్తు దేవుడు నాకు అద్భుతమైన అవకాశాలు, ప్రేమను పంచే ప్రేక్షకులను ఇచ్చాడు. ఈ నెగటివ్‌ కామెంట్స్‌ని పట్టించుకోకుండా ఎప్పటిలా సీతలా, దెయ్యంలా, గాళ్‌ఫ్రెండ్‌లా, లవర్‌లా, భార్యలా.. ఇలా అన్ని పాత్రల్లో మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడానికి నిరంతరం కృషిచేస్తాను. చివరిగా నడిగర్‌ సంఘా (నటీనటుల సంఘం)నికి నాదో ప్రశ్న…
సుప్రీమ్‌ కోర్ట్‌ ఆదేశించినట్టు ‘ఇంటర్నల్‌ కంప్లయింట్స్‌ కమిటీ’ ని ఎప్పుడు నియమిస్తారు? విశాఖ గైడ్‌లెన్స్‌ను అనుసరిస్తూ ఇంటర్నల్‌ ఎంక్వైరీ ఎప్పుడు చేస్తారు? ఈ సమయంలో నాతో నిలబడిన అందరికీ ధన్యవాదాలు”