అలాంటి అవకాశవాదుల్ని చాలా మందిని చూసా !

“సినిమా పరిశ్రమలో ఫెయిల్యూర్స్ మొదలవగానే అంతకాలం పక్కనున్న వారంతా తప్పుకునే ప్రయత్నం చేస్తారు. బాగా తెలిసిన వారు కూడా మనమెవరో తెలియనట్టే నటిస్తారు. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూశానని, ఈ ప్రయాణంలో ఎన్నో జీవన సత్యాలను తెలుసుకున్నాన”ని చెప్పింది దక్షిణాది అగ్రనాయిక నయనతార. ప్రస్తుతం స్క్రిప్టులను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని నయనతార చెబుతోంది.ప్రస్తుతం నయనతార పలు భారీ చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది.

నయనతార మాట్లాడుతూ… “మనం సక్సెస్‌లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. మీడియా వారు కూడా పాజిటివ్‌గా వార్తలు రాస్తారు. ఫెయిల్యూర్స్ మొదలవగానే అంతకాలం పక్కనున్న వాళ్లందరూ తప్పుకునే ప్రయత్నం చేస్తారు. బాగా తెలిసిన వారు కూడా మనమెవరో తెలియనట్టే నటిస్తారు. పరిశ్రమలో అలాంటి అవకాశవాదుల్ని చాలా మందిని చూశాను. తమ ప్రయోజనాలకు అనుగుణంగా మనుషులు ఎలా మారిపోతారో స్వయంగా తెలుసుకోగలిగాను. అందుకే గత కొన్నేళ్లుగా మీడియాకు దూరంగా ఉంటున్నాను. నచ్చిన సినిమాలను చేస్తూ కెరీర్‌ను ఆస్వాదిస్తున్నాను. స్వతహాగా నేను గోప్యమైన జీవితాన్ని గడపడానికే ప్రాధాన్యతనిస్తాను. నా వ్యక్తిగత జీవితం అందరికీ తెలియజేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను”అని చెప్పింది.

ప్రమోషన్‌తో చెడ్డ సినిమా ఆడదు !

సినిమాల్లో నటించడం తప్ప ఆయా మూవీస్ ప్రమోషన్స్‌లో నయనతార అస్సలు కనిపించదు. తాను ప్రమోషన్స్‌లో పాల్గొంటే… మూవీ ఫ్లాప్ అవుతుందని నిర్మాతలను బెదరగొడుతుందని టాక్.    “ప్రమోషన్స్‌కు రాకపోవడం నా సొంత నిర్ణయం. నా దగ్గరకు స్క్రిప్ట్‌తో వచ్చినప్పుడే దర్శక నిర్మాతలకు ఈ విషయం చెబుతాను. ఓ వంద ఛానళ్ల ముందు కూర్చొని చెప్పిందే చెప్పి… సినిమాను చూడమని చెప్పాల్సిన పనిలేదు. జనాల్లో ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. ఇదంతా డిజిటల్ యుగం. ప్రమోషన్స్‌లో చాలా కొత్త పద్ధతులు వస్తున్నాయి. ప్రమోషన్‌తో చెడ్డ సినిమా ఆడదు కదా. మూవీలో కంటెంట్ ఉంటే ఆడుతుంది. బాగాలేని సినిమాకు వందరోజులు ప్రమోట్ చేసినా అది ఫ్లాప్ అవుతుంది”అని చెప్పింది నయన్