పెద్ద మనస్సు వల్లే ‘లేడీ సూపర్‌స్టార్‌’ అయ్యింది !

పెద్ద మనస్సు వల్లే నయనతార లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్నారని అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అగ్రనటి నయనతార మరోసారి కోలీవుడ్‌ హెడ్‌లైన్స్‌లో మారుమోగిపోతున్నారు. ఈ మధ్య విడుదలైన ‘కోలమావు కోకిల’  సక్సెస్‌ బాటలో పయనిస్తోంది. ఈ చిత్రాన్ని నయన్‌ ఒంటి చేత్తో విజయ పథంలోకి తీసుకెళ్లారు. ఇక, తాజాగా విడుదలైన ‘ఇమైకా నొడిగళ్‌’ చిత్రం కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇందులో హీరోగా అధర్వ, విలన్‌గా బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, అతిథి పాత్రలో విజయ్‌సేతుపతి నటించినా, నయనతార ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు.ఇప్పుడు ఆమె పాత్రే ‘ఇమైకా నొడిగళ్‌’ చిత్రానికి  కాసులవర్షం కురిపిస్తోంది. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం డిమాండ్‌ చేస్తున్న హీరోయిన్‌గా నయన్‌ పేరు వినిపిస్తోంది.
నయనతార పారితోషికం తారాస్థాయికి చేరుకుందనే వార్తలు హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఇమైకా నొడిగళ్‌’ చిత్రానికి భారీ పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం విడుదల సమయంలో ఆర్థికంగానూ పలు సమస్యలను ఎదుర్కొంది. చివరినిమిషంలో చిత్ర విడుదల ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.అభిరామి రామనాథన్‌ లాంటి వారు చివరిసమయంలో చిత్రానికి మద్దతిచ్చి.. విడుదలయ్యేలా చూశారు.
అయినా నయనతార పారితోషికంలో ఇంకా రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంది. సాధారణంగా అన్ని శాఖల వారికి ఫుల్‌ పేమెంట్‌ చేసిన తర్వాతే చిత్రం విడుదల అవుతుంది. తన సినిమా ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్ని అర్థం చేసుకొని.. నయనతార తనకు రావలసిన మొత్తాన్ని వదులుకుందట. ఈ విషయం తెలియడంతో నయన్‌ కోలీవుడ్‌లో, సామాజిక మాధ్యమాల్లో హాట్‌టాపిక్‌గా మారారు.  పెద్ద మనస్సు వల్లే నయనతార లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్నారని అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార పాత్రకు మొదట మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టిని తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ పాత్రను ఫీమేల్‌గా మార్చి నయనతారను ఎన్నుకున్నారు.