గుడిలో పెళ్లి తో కొత్త జీవితానికి స్వాగతం?

‘లేడీ సూపర్ స్టార్’ నయనతార పెద్ద ఆఫర్ల తో రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటోంది. దాదాపు పన్నెండేళ్లకు పైగానే సినిమాలలో అలరిస్తున్న నయన్.. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యమిచ్చింది. గత కొన్నేళ్లుగా తన పంథా మార్చేసి..గ్లామర్ షో కాస్త తగ్గించి నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఓకే చేస్తోంది. సినిమాల పరంగా టాప్‌లో ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితం విషయంలో మాత్రం ఆమెకు సంతృప్తి లేదనే చెప్పాలి. సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న నయనతార వ్యక్తిగత జీవితంలో రెండుసార్లు విఫలమైంది.
ఈ మధ్య తన ప్రేమ, పెళ్లి విషయాలతో నయనతార తరచు వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు నయన్ జీవితంలోకి ఫిల్మ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రవేశించాడు. ‘నానుమ్ రౌడీ దాన్’ అనే సినిమా షూటింగ్ సమయంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి హాలీడే ట్రిప్‌లకు వెళ్తూ తరచూ.. కెమెరాల కంటికి చిక్కుతూనే ఉన్నారు. ఇంతలో విఘ్నేష్‌తో నయన్ పెళ్లి అని జోరుగా ప్రచారం జరుగుతోంది.ఇక త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కుతుందని సోషల్‌మీడియాలో హల్‌చల్ నడుస్తోంది.
ఇప్పటికే ముహూర్తం ఖరారు?
నయనతార తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుందట. విఘ్నేష్ కుటుంబ సభ్యులు పెళ్లి గురించి ఒత్తిడి పెంచడంతో నయన్ ఓకే అన్నట్లు ఓ వార్త కోలీవుడ్‌లో వినిపిస్తోంది. నయనతార- విఘ్నష్‌ శివన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన ఈ జంట.. గుడిలో పెళ్లి చేసుకుని దాంపత్య జీవితానికి స్వాగతం పలకాలని భావిస్తున్నట్లు వార్తలు షికారు చేస్తున్నారు.
లాక్‌డౌన్‌ నిబంధనలను సవరిస్తూ దేశవ్యాప్తంగా దేవాలయాలు ఈనెల 8 నుంచి తెరుచుకుంటున్నాయి.దీంతో తమిళనాడులోని ఓ ప్రముఖ ఆలయంలో వివాహం చేసుకోవాలని ఈ జంట ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కొంతమంది ముఖ్యమైన అతిథుల సారథ్యంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక పెళ్లి వార్త తెలిసిన నయన్‌-శివన్ అభిమానులు ఈ జంటకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.