లాక్‌డౌన్‌ తర్వాత సినిమాకు కొత్త ప్రేక్షకులొస్తారట!

“సినీ పరిశ్రమకు కూడా లాక్‌డౌన్‌ వల్ల కూడా లాభమే జరిగింద”ని అంటున్నారు కొంత మంది సినీ మేధావులు. ‘ఏదీ జరిగినా మన మంచికే’ అనేది పెద్దల సిద్ధాంతం. కరోనా వల్ల జనాలు పరిశుభ్రంగా వుండటం..సంప్రదాయంగా చేతులెత్తి నమస్కరించడం..ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మొదలుపెట్టారు. లాక్‌డౌన్‌తో ప్రకృతి కూడా కాస్త ఊపిరి పీల్చుకుంది. రణగొణ ధ్వనుల నుండి వచ్చే కాలుష్యం తగ్గడం, గంగా నది జలం స్వచ్ఛంగా మారటం లాంటి మంచే జరిగింది. అలాగే, లాక్‌డౌన్‌ వల్ల సినీ పరిశ్రమకు కూడా లాభమే జరిగిందని అంటున్నారు కొంత మంది సినీ మేధావులు.
 
నిజానికి మన జనాభాలో సినిమా చూసే వాళ్ల సంఖ్య కేవలం 8 శాతమే అట. మిగతా ప్రజలు ఈ గజిబిజి లైఫ్‌లో సమయం లేక.. సినిమాలను కనీసం టీవీల్లో కూడా చూసేవారు కాదట.అయితే ఈ లాక్‌డౌన్‌ వల్ల ఇతర ప్రత్యామ్నాయ ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకపోవడంతో ఓటీటీలతోపాటు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌ల్లో సినిమాలు చూసే వారి సంఖ్య పెరిగిందట.. కరోనా కథ ముగిసిన తర్వాత వీరంతా సినిమాలను చూడటానికి  థియేటర్‌లకు కూడా వచ్చే అవకాశం వుందని అంటున్నారు. అంటే ప్రేక్షకులు పెరుగుతారన్నమాట. ఈ రకంగా సినీ పరిశ్రమకు లాక్‌డౌన్‌ కొత్తప్రేక్షకులను తీసుకొచ్చే అవకాశముందని ఆశ పడుతున్నారు.
 
తెలుగు సినిమా షూటింగ్స్ ఎప్పుడు?
యాడ్స్ లేక టీవీ ఛానెల్స్ రెవెన్యూ పడిపోతూ .. షూటింగ్ లు లేక బతకడం కష్టమైపోతున్న దశలో టీవీ సీరియల్స్, షోలు.. కొత్త ఎపిసోడ్ల చిత్రీకరణతో పాటు టెలికాస్ట్ కూడా మొదలైంది. అయితే, తెలుగు సినిమా ఇంకా షూటింగ్ స్టేజ్ కి రాలేదు. తెలుగు సినిమా పెద్దోళ్లంతా షూటింగ్ అనుమతులు తెచ్చుకునే వరకూ పరిగెత్తారు. ప్రభుత్వం అనుమతులిచ్చేశాక.. కరోనా కేసులు పెరగడం చూసి భయపడుతున్నారు. సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తూ, తక్కువమంది నటీనటులు, టెక్నీషియన్లతో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ లు చేసుకునే అవకాశం ఉన్నా కూడా ముందుకు రావడంలేదు.
 
మల్టీప్లెక్స్ లే ముందు!
మల్టీప్లెక్సుల్లో సినిమా ప్రదర్శనలకు అవకాశం ఇవ్వాలంటూ కొంతమంది ప్రభుత్వాన్ని కలిసే ఆలోచన చేస్తున్నారు. సింగిల్ థియేటర్ల కంటే మల్టీప్లెక్స్ లు ముందు ప్రారంభమవుతాయని..రిలీజ్ కి రెడీ అవుతున్న హాలీవుడ్ మూవీస్ తో ఇవి రీఓపెన్ అవుతాయని తెలుస్తోంది. రిలీజ్ కి రెడీగా ఉన్న తెలుగు సినిమాల్ని కూడా ఓటీటీల బారిన పడకుండా.. థియేటర్ల కి చేర్చేందుకు నిర్మాతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వడ్డీలు పెరిగిపోతున్నాయని.. నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లిపోతున్నారనే కారణాలు చూపుతూ.. ప్రభుత్వం థియేటర్లు తెరిచేందుకు అనుమతివ్వాలని కోరుతున్నారు.