మోసం చేసి డబ్బు సంపాదించాలనుకోను !

పాత్ర పరంగా తెర మీద ఎలా కనిపించాలన్నా నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అయినా గ్లామర్‌ ఫీల్డ్‌లోకి వచ్చి మడికట్టుకుని కూర్చుంటానంటే కుదరదు కదా! మితిమీరిన ఎక్స్‌పోజింగ్‌ చేస్తున్నానని నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఈ విషయం మా ఫ్యామిలీ మెంబర్స్‌ కానీ, నా స్నేహితులుకానీ ఎవరూ నా దగ్గర అనలేదు.సినిమా వినోద ప్రధానంగా సాగుతుంది. రెండున్నర గంటల పాటు సినిమా చూసే వాళ్ళు సందేశం కన్నా వినోదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సినిమాల ఎంపికలో వినోదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. సందేశాలు ఇచ్చే స్థాయికి నేను చేరుకోలేదు”…అని అంటోంది నవ నాయిక నిధి అగర్వాల్‌. నాగచైతన్య ‘సవ్య సాచి’, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ లో ఆమె చేసింది.
అలాంటి క్రీమ్‌ల మీద నాకు నమ్మకం లేదు !
హీరోయిన్లు ఓ ఉత్పత్తి గురించి ప్రచారం చేస్తున్నారంటే… ఆ వస్తువు మీద ప్రజలలో మంచి క్రేజ్‌ క్రియేట్‌ అవుతుంది. వినియోగదారుల అంచనాలను ఆ ఉత్పత్తి అందుకోలేకపోతే దాన్ని ప్రచారం చేసే మా మీద కూడా నమ్మకం పోతుంది. ఈ కారణంగానే ఓ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌కి ప్రచారకర్తగా ఉండమంటే ఉండనన్నాను. అయినా అలాంటి క్రీమ్‌ల మీద నాకు నమ్మకం లేదు. సహజసిద్ధంగా లభించే పదార్థాలను వాడితేనే మన సౌందర్యం మరింత పెరుగుతుంది.
డబ్బు సంపాదించాలంటే చాలా మార్గాలుంటాయి. ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించాలనే కోరిక నాకు లేదు. నేను విశ్వసించని దాని గురించి నేనెలా ప్రచారం చేస్తాను? నా నిజాయితీనే నన్ను కాపాడుతుంది.. ఒక్క యాడ్‌ని వద్దన్నానని నాకేం అవకాశాలు తగ్గిపోలేదు. ఆ తరువాత రెండు మూడు ప్రకటనలను ఒప్పుకున్నాను.
అందంగా లేనని అనడం లేదుకదా!
నేను కావాలని సన్నగా ఉండడానికి ప్రయత్నించడం లేదు. నా శరీర స్వభావమే అంత. నేను సన్నగా ఉంటానని అంటారు తప్ప అందంగా లేనని అనడం లేదుకదా! నోరు కట్టేసుకోవడం, కడుపు మాడ్చుకోవడం వంటి పనులు నాకు నచ్చవు. నచ్చినవి తినేస్తుంటాను. రెగ్యులర్‌ వ్యాయామం చేస్తుంటాను. దాంతో నేను ఎంత తిన్నా బరువు పెరిగినట్టు కనిపించదు.
ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమానే అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ చేస్తున్నాను. రెండు మూడు కథలు విన్నాను. ఏవీ ఫైనల్‌ చేయలేదు.. త్వరలోనే వాటి గురించి చెబుతాను.