సహనాన్ని పరీక్షించిన…. ‘కిరాక్ పార్టీ’ చిత్ర సమీక్ష

                                                 సినీవినోదం రేటింగ్ : 2/5 
                                     
ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ బ్యానర్ పై శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు
 
కృష్ణ(నిఖిల్‌) ఉషా రామా ఇంజ‌నీరింగ్ కాలేజీలో మెకానిక‌ల్ గ్రూపులో ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో జాయిన్ అవుతాడు. ఇత‌ని గ్యాంగ్‌లో రాకేందుమౌళి స‌హా స్నేహితుల‌తో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. త‌న సీనియ‌ర్ మీరా(సిమ్రాన్ ప‌రింజ‌)తో ప్రేమ‌లో పడ‌తాడుకృష్ణ. అందువ‌ల్ల సీనియ‌ర్స్‌తో గొడ‌వ అవుతుంది. కృష్ణ‌, అత‌ని స్నేహితులంతా క‌లిసి ఓ సెకండ్ హ్యాండ్ కారును కూడా కొని దానితో మీరాను ఇంప్రెస్ చేయాల‌నుకుంటారు. ఎదుటివారిని న‌వ్వించాల‌నే కృష్ణ మ‌న‌సు న‌చ్చడంతో అత‌నంటే ఇష్ట‌పడుతుంది. అనుకోకుండా ప్ర‌మాద‌వ‌శాతు మీరా చ‌నిపోతుంది. దాంతో కృష్ణ రఫ్ గా మారుతాడు. ఎవ‌రైనా అమ్మాయిల‌ను కామెంట్ చేస్తే వారిని చావ‌గొడుతుంటాడు. నెమ్మ‌దిగా కృష్ణ నాలుగో సంవత్స‌రంలోకి ఎంట్రీ ఇస్తాడు. అదే స‌మ‌యంలో కృష్ణ స్నేహితుడు అర్జున్ కృష్ణ‌తో గొడ‌వ‌ప‌డి మ‌రో వ‌ర్గంగా విడిపోతాడు. రెండు వ‌ర్గాలు కాలేజ్‌లో అధిప‌త్యం కోసం గొడ‌వ‌ ప‌డుతుంటారు. అదే స‌మ‌యంలో స‌త్య‌(సంయుక్తా హెగ్డే) కృష్ణ‌ను ఇష్ట‌ప‌డుతుంటుంది. న‌వ్వ‌డ‌మే మ‌ర‌చిపోయిన కృష్ణ‌ను మామూలు మ‌నిషిగా మార్చే ప్ర‌య‌త్నం చేస్తుంది. మ‌రి కృష్ణ లైఫ్ ఎలాంటి ట‌ర్న్ తీసుకుంటుంది? త‌ను స‌త్య‌కు ద‌గ్గ‌రైయ్యాడా? విడిపోయిన స్నేహితులందరూ క‌లుసుకుంటారా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
 
తెలుగులో ఈ తరహా కథలు… ‘హ్యాపిడేస్‌’ లాంటి సినిమాలు సంచలనాలు సృష్టించాయి. మరోసారి అదే తరహా కాలేజ్‌ డేస్‌ను గుర్తు చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు శరన్‌. అయితే ఎక్కడా కొత్తదనం కనిపించకపోవటం నిరాశపరుస్తుంది. అక్కడక్కడ కథనంలో మెరుపులు కనిపించినా.. గతంలో తెలుగు తెర మీద వచ్చిన చాలా కాలేజ్‌ సినిమాల ఛాయలు కనిపిస్తాయి. కన్నడ ప్రేక్షకులకు ఈ తరహా కథలు కొత్త అయినా, తెలుగు ప్రేక్షకులకు మాత్రం రొటీన్‌ ఫార్ములా సినిమాలాగే అనిపిస్తుంది. ఇంత‌కు ముందు చాలా సినిమాల్లో చూసిన‌ట్లుగానే హీరో.. హీరోయిన్ కోసం ఆమెకు న‌చ్చిన ప‌నులు చేయ‌డం.. మందు, సిగ‌రెట్ త్రాగ‌డం మానేయ‌డం… హీరోయిన్ ఎవ‌రికో స‌హాయం చేయాల‌నుకుంటే ఆమెకు త‌న వంతుగా స‌హాయం చేయ‌డం, హీరోయిన్ మ‌న‌సుని గెలుచుకోవ‌డం.. వంటి స‌న్నివేశాలు ఈ సినిమాలో క‌న‌ప‌డ‌తాయి. అలాగే సీనియ‌ర్ హీరోయిన్ వెనుక హీరో ప‌డే స‌న్నివేశాల‌న్నీ.. ‘హ్యాపీడేస్‌’లో స‌న్నివేశాలు కొన్నింటిని గుర్తుకు తెస్తాయి. ఇక సెకండాఫ్ వ‌చ్చేసరికి హీరో గ్యాంగే రెండుగా విడిపోవ‌డం.. కాలేజీ ఎల‌క్ష‌న్స్‌, గొడ‌వ‌లు.. ఓ హీరోయిన్ ప్ర‌మాద‌వ‌శాతు మ‌ర‌ణించ‌డంతో .. మ‌రో హీరోయిన్ ఎంట్రీ.. ఆమె హీరోను ప్రేమించ‌డం.. సీరియ‌స్‌గా ఉండే హీరోను న‌వ్వించేలా చేయ‌డం.. ఎప్పుడూ న‌వ్వుతూ ఉండాల‌ని చెప్ప‌డం ఇలాంటి స‌న్నివేశాల‌తో సాగుతుంది. కథనాన్ని అందించిన సుధీర్ వర్మ మొదటి అర్ధభాగాన్ని బాగానే రాసినా ద్వితీయార్థాన్ని మాత్రం పేలవంగా రాయడంతో… దర్శకుడు శరన్ కొప్పిశెట్టి పూర్తి స్థాయిలో ఇంప్రెస్ చేయలేకపోయారు. దీంతో సినిమా రెండవ సగం ఫన్, ఎమోషన్ ఏదీ పూర్తిస్థాయిలో పండలేదు.విరామ సమయానికి అసలు కథ ఓపెన్ అయినా ద్వితీయార్థంలో అదెక్కడా పెద్దగా కనిపించదు. కాలేజ్ ఎలక్షన్స్, గొడవలు అంటూ సినిమా సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. పోనీ ఆ అంశాలనైనా ఎఫెక్టివ్ గా చూపించారా అంటే పేలవమైన సన్నివేశాలతో అరకొరగా చూపించి వదిలేశారు.
దాంతో కథానాయకుడి పాత్ర యొక్క గమ్యం, వ్యక్తిత్వం ఏమిటనేది స్పష్టంగా తెరపై కనబడదు. క్లైమాక్స్‌ చిన్న ఎమోషన్, ఒక ఫన్నీ సీన్ తో నార్మల్ గానే ముగిసిపోతుంది. మొత్తం మీద దర్శకుడు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాడు.
 
సినిమా అంతా హీరో చుట్టూనే తిరుగుతుంది. కృష్ణ పాత్రలో నిఖిల్ మంచి నటన కనబరిచాడు. స్టూడెంట్‌ గా తనకు అలవాటైన ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌ తో మెప్పించటంతో పాటు సెకండ్‌ హాఫ్‌లో మెచ్యూర్డ్‌ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో పాటు క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ లో నిఖిల్ నటన చాలా బాగుంది. ముఖ్యంగా నార్మ‌ల్ లుక్‌, గ‌డ్డం ఉన్న లుక్‌లో నిఖిల్ మంచి వేరియేష‌న్ చూపించాడు. ఫస్ట్‌హాఫ్ లో హీరోయిన్‌ గా కనిపించిన సిమ్రాన్‌ హుందాగా కనిపించింది. సెటిల్డ్‌ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది.మరో హీరోయిన్‌ సంయుక్త హెగ్డే బబ్లీ గర్ల్ గా కనిపించి సెంకడ్‌హాఫ్‌ లో జోష్ నింపే ప్రయత్నం చేసింది. బ్రహ్మాజీది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో మంచి కామెడీ పండించాడు. సిజ్జు, రాకేందు మౌళి స‌హా మిగిలిన తారాగ‌ణం , ఫ్రెండ్స్ పాత్రల్లో చేసినవారు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు
 
ఒరిజినల్‌ వర్షన్ కు సంగీతమందించిన అజనీష్ తెలుగు వర్షన్‌కు కూడా మంచి సంగీతాన్ని అందించాడు. పాటలు అలరిస్తాయి. నేపథ్య సంగీతం కూడా బాగుంది. స్నేహితుల మధ్యన నడిచే పాట, హీరో హీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ సాంగ్ బాగుంది. అద్వైత గుర్తుమూర్తి సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ముఖ్యంగా పాట‌ల్లోని సన్నివేశాల‌ను ఎలివేట్ చేసిన తీరు బావుంది. ఎం.ఆర్‌.వ‌ర్మ‌ ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. చందూ మొండేటి రాసిన డైలాగ్స్ పర్వాలేదనిపించాయి – ధరణి