నవ్వులు పండించిన… ‘భీష్మ’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 3/5

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకం పై వెంకీ కుడుముల‌ రచన,దర్శకత్వంలో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధ… డిగ్రీ తప్పిన కుర్రాడు భీష్మ(నితిన్) మీమ్స్ చేసుకుంటూ ఉంటాడు. గర్ల్ ఫ్రెండ్ లేని భీష్మ అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ దేవా(సంపత్) కూతురు ఛైత్ర(రష్మిక మందన్న)ని ప్రేమిస్తాడు. ఆమె భీష్మ ఆర్గానిక్ ఫార్మ్ కంపెనీలో పని చేస్తుంటుంది. ఆ కంపెనీ యజమాని పేరు కూడా భీష్మ(అనంత్ నాగ్). తన మంచితనంతో భీష్మ(నితిన్), ఛైత్ర మనసుని గెలుస్తాడు. కానీ దేవాకి భీష్మ తండ్రి అంటే పడదు. దాంతో వారి పెళ్లికి ఒప్పుకోడు. అప్పుడు భీష్మ తండ్రి(నరేష్).. తన కొడుకు భీష్మ ఆర్గానిక్ వ్యవసాయ కంపెనీకి కాబోయే చైర్మన్ అని చెబుతాడు. అదే సమయంలో భీష్మను నెల రోజుల పాటు భీష్మ ఆర్గానిక్ ఫార్మ్ కంపెనీకి సీఈఓగా అనౌన్స్ చేస్తారు. అసలు భీష్మ ఎవరు? అతనికి, భీష్మ ఆర్గానిక్ వ్యవసాయ కంపెనీ ఉన్న సంబంధం ఏంటి? సీఈవోగా భీష్మ.. కంపెనీ బాధ్యతలు తీసుకుని ఏం చేస్తాడు? రసాయనాలు వాడుతూ వ్యవసాయం చేయాలంటూ ఓ ప్రొడక్ట్‌ను కనిపెట్టిన మరో కంపెనీ యజమాని రాజన్(జిస్సేన్ గుప్తా)ను భీష్మ ఎలా అడ్డుకుంటాడు? తన ప్రేమను ఎలా గెలుచుకుంటాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమాలో చూడాలి…

విశ్లేషణ… మూడు వరుస పరాజయాల తర్వాత నితిన్ చేసిన భీష్మ.వెంకీ కుడుముల ‘ఛలో’ తరహాలో కమర్షియల్ పంథాలో సినిమాను ఆసాంతం ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కామెడీ సన్నివేశాలను, అందుకు తగిన విధంగా నితిన్ పాత్రను, దానికి సపోర్టింగ్‌గా ప్రేక్షకులను నవ్వించేలా వెన్నెలకిషోర్ పాత్రను క్రియేట్ చేయడం ప్లస్ అయ్యింది. హీరో హీరోయిన్ ల మధ్య కెమిస్త్రీ బాగుంది.కథ పరంగా చూస్తే గొప్ప కథేం కాదు..రొటీన్ కమర్షియల్. ‘క్షేత్రీయ వ్యవసాయం’ అనే పాయింట్ తప్ప.. కథలో కొత్తగా ఏమీ కనపడదు. కథ కన్నా కథనానికి ప్రాధాన్యత ఇస్తూ త్రివిక్రమ్ టచ్ తో …సెకండాఫ్‌ కామెడీతో ఎక్కడా డల్ మూవ్ మెంట్ లేకుండా సినిమాని నడిపించారు. కధ ఆర్గానిక్ వ్యవసాయం చుట్టూ తిరుగుతున్నా.. శృతి మించని ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించడం బాగుంది.కొన్ని పంచ్‌ డైలాగ్‌లు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్‌ బాగుంది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది.
 
నటవర్గం… నితిన్ సినిమాలో మన పక్కింటి కుర్రాడిలా కనిపించాడు. కామెడీ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. ముఖ్యంగా మీమ్స్ డైలాగ్స్ చెప్పే సీన్స్, వెన్నెలకిషోర్ కామెడీ..రఘుబాబు కామెడీ ఆకట్టుకుంటుంది. చైత్రగా కనిపించిన రష్మిక నితిన్‌తో పోటీ పడి మరీ నటించింది. తన అందం.. క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ తో మెస్మరైజ్‌ చేసింది. నితిన్‌తో కలిసి రష్మిక డ్యాన్స్‌లతో అదరగొట్టింది. ముఖ్యంగా ‘వాట్టే బేబీ’ పాటలో.. తన నటన ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్ తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. కమర్షియల్ కామెడీని పండించడంలో వెన్నెల కిషోర్ తనదైన పాత్రను పోషించాడు. హెబ్బా పటేల్‌ కనిపించేది రెండు మూడు సీన్లలో అయినా ఆకట్టుకుంటుంది. అనంత్‌ నాగ్‌ భీష్మ పాత్రను బాగా చేశారు. సంపత్, నరేశ్, రఘుబాబు, జేపీ, విలన్‌గా కనిపించిన జిషుసేన్‌ గుప్త ,బ్రహ్మాజీ వారి పాత్రల మేరకు నటించారు.
 
సాంకేతికం… మహతి స్వర సాగర్‌ సంగీతం మరో ప్లస్. ‘వాట్టే బేబీ’.. సాంగ్ అందులో నితిన్, రష్మిక డాన్స్ చాలా బావున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బావుంది.సాయి శ్రీరామ్‌ తన కెమెరా పనితనంతో సినిమాను చాలా రిచ్‌గా చూపించారు. న‌వీన్ నూలి ఎడిటింగ్‌ బాగుంది.నిర్మాణ విలువలు బాగున్నాయి – రాజేష్