చలాకీ లేని…..’చల్ మోహన్ రంగ’ చిత్ర సమీక్ష

                                 సినీ వినోదం రేటింగ్ : 2.5 / 5
శ్రేష్ఠ్ మూవీస్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్‌ పతాకాల పై కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు
 
మోహ‌న్ రంగ (నితిన్‌) దేన్నైనా తేలిగ్గా తీసుకునే కుర్రాడు. జీవితంలో స్థిర‌ప‌డ‌డం కోసం అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేయాల‌నుకుంటాడు. అయితే మూడేళ్ళ పాటు ప్ర‌య‌త్నించినా వీసా అప్రూవ్ కాదు. నాలుగో ఏడాది మాత్రం స‌రోజ‌ అనే బామ్మ (రోహిణి హ‌ట్టంగ‌డి) శ‌వాన్ని అడ్డం పెట్టుకుని అమెరికా వెళ‌తాడు. అక్క‌డ అత‌నికి విచిత్ర‌మైన ప‌రిస్థితుల మ‌ధ్య‌ మేఘ (మేఘా ఆకాశ్‌) అనే అమ్మాయి ప‌రిచ‌య‌మ‌వుతుంది. క్ర‌మంగా ఇద్ద‌రి మ‌ధ్య చ‌నువు పెరుగుతుంది. అది కాస్త ప్రేమ‌గా మారుతుంది. ఆ విష‌యాన్ని ఒక‌రితో ఒక‌రు పంచుకోవాల‌ని.. ఓ చోట క‌లుద్దామ‌నుకుంటారు. అయితే.. ‘భిన్న‌మైన మ‌న‌స్త‌త్వాలు ఉన్న త‌మ మ‌ధ్య రిలేష‌న్ నిల‌బ‌డ‌దు’ అనే కార‌ణంతో ఇద్ద‌రు ఒక‌రినొక‌రు క‌ల‌వ‌కుండానే విడిపోతారు. వేర్వేరు కార‌ణాల‌తో ఇండియా వెళ్ళిన ఆ ఇద్ద‌రూ తిరిగి క‌లుకున్నారా? చిన్నప్పుడే త‌మ మ‌ధ్య ప‌రిచ‌యం ఉంద‌న్న విష‌యాన్ని వాళ్ళు గుర్తించారా? మోహ‌న్ రంగ‌, మేఘ ప్రేమ‌క‌థ ఏ తీరాల‌కు చేరింది? అనేది తెలుసుకోవాలంటే.. సినిమాలో చూడాలి…..
 
త్రివిక్రమ్ కధతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రచారం చేసి కొంత ఆసక్తి కలిగించారు. అయితే సినిమా విడుదలకు ముందు కనీస ప్రచారం కూడా చెయ్యకుండా చేతులెత్తేశారు. ‘విధి అనేది మ‌న‌కు అనుకూలంగా ఉంటే మ‌నం కావాల‌నుకున్న‌ది ఎలాగైనా మ‌న‌కు ద‌క్కుతుంది’ అనే కాన్సెప్ట్‌తో త్రివిక్ర‌మ్ రాసిన క‌థే `ఛ‌ల్ మోహ‌న్ రంగ‌’. త్రివిక్రమ్ కథను పూర్తిస్థాయి ఎమోషన్ ను క్యారీ చేసేలా డెవలప్ చేయలేకపోయారు దర్శకుడు కృష్ణ చైతన్య. ఫస్టాఫ్ మొత్తం కామెడీ, హీరో పాత్రతో, డైలాగులతో నెట్టుకొచ్చిన ఆయన ద్వితీయార్థంలో సినిమాను పతాకస్థాయికి తీసుకెళ్లలేకపోయారు. ప్రేమ కథ ఆరంభం ఎలా అయితే సాదాసీదాగా ఉందో ప్రయాణం, ముగింపు కూడ అలానే నార్మల్ గా ఉన్నాయి.ఇక హీరో హీరోయిన్ల మధ్యన ప్రేమ ఎలివేట్ అయ్యేలా బలమైన రొమాంటిక్ సన్నివేశాలు, విడిపోయాక వారి ఎడబాటును ప్రేక్షకుడు అనుభూతి చెందేలా చేసే భావోద్వేగపూరితమైన పరిస్థితులు కానీ కనబడలేదు. అసలు హీరో హీరోయిన్లు… ఒక చిన్నపాటి క్యాజువల్ మీటింగ్ కు ఒకరు రాలేదని మరొకరు అపార్థం చేసుకుని విడిపోవడం సిల్లీగా అనిపిస్తుంది.ఫ‌స్ట్ హాఫ్‌లో క‌న‌ప‌డే ‘పెద్ద పులి’ సాంగ్ మాత్రం యూత్‌కు న‌చ్చుతుంది. ఇక త్రివిక్ర‌మ్ క‌థ‌ల్లో క‌న‌ప‌డే బ‌ల‌మైన ఎమోష‌న్స్ ఈ సినిమాలో ఎక్క‌డా క‌న‌ప‌డ‌దు. ద్వితీయార్థంలో ఫన్నీ సీన్స్ మినహా ప్రేక్షకుడ్ని కదిలించే సన్నివేశాలు పెద్దగా లేకపోవడంతో సినిమా నీరసంగా ముగిసిన ఫీలింగ్ కలిగింది. మొత్తంగా చూస్తే కామెడీ, మేకింగ్‌లో క్వాలిటీ మిన‌హా కొత్త‌ద‌నం ఎక్క‌డా క‌న‌ప‌డ‌దు.
 
నితిన్ ఒక హీరోలా కాకుండా నార్మల్ మధ్యతరగతి మనస్తత్వం కలిగిన కుర్రాడు మోహన్ రంగ పాత్రలో కనిపించి తన నటనతో ఆకట్టుకున్నాడు. అమాయకత్వాన్ని, నిజాయితీని, హాస్యాన్ని మేళవించి కథానాయకుడి పాత్రను తెరపై అవిష్కరించిన తీరు ఆకట్టుకుంది. నితిన్ ఎమోషనల్‌ సీన్స్‌ తో పాటు అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రేమకు దూరమైన యువకుడిగా బాధను చూపిస్తూనే కామెడీతో అలరించాడు. పవన్‌ వీరాభిమాని అయిన నితిన్‌ ఈ సినిమాలో కూడా పవన్‌ స్టైల్స్‌ను ఇమిటేట్‌ చేసే ప్రయత్నం చేశాడుహీరోయిన్ మేఘా ఆకాష్ కూడ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించి మెప్పించింది. ఆమెకు, నితిన్ కు మధ్యన నడిచే కామెడీ సీన్స్ ఆకట్టుకున్నాయి. తొలి సినిమాలో బబ్లీగా కనిపించిన మేఘకు ఈ సినిమాలో కాస్త నటనకు అవకాశం ఉన్న పాత్ర దక్కింది. తొలి భాగం అల్లరి అమ్మాయిగా కనిపించిన మేఘ, సెకండ్‌ హాఫ్‌లో ప్రేమకు దూరమైన ప్రియురాలిగానూ మెప్పించింది. హీరో తండ్రిగా నరేష్, తల్లిగా ప్రగతి, హీరోయిన్‌ తండ్రిగా సంజయ్ స్వరూప్‌లు రొటీన్‌ పాత్రలో కనిపించారు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన సీనియర్‌ నటి లిజి హీరోయిన్‌ తల్లి పాత్రలో హుందాగా కనిపించింది. ఇతర పాత్రల్లో నర్రా శ్రీను, మదునందన్‌, శ్రీనివాస్‌, ప్రభాస్‌ శ్రీను, సత్యలు కామెడీ బాగా చేసారు
 
గేయ రచయిత అయిన కృష్ణచైతన్య డైలాగ్స్ తో సినిమా రేంజ్‌ ను పెంచాడు. కృష్ణ చైతన్య సంభాషణల్లో చాలా సార్లు త్రివిక్రమ్‌ కనిపిస్తాడు. ముఖ్యంగా ప్రాసలు, పంచ్‌ల విషయంలో త్రివిక్రమ్‌నే ఫాలో అయినట్టుగా అనిపిస్తుంది. నటరాజన్ సుబ్రమణియం అందించిన సినిమాటోగ్రఫీ సినిమాను ఎంతో అందంగా కనబడేలా చేసింది. ఫారిన్ లొకేషన్స్, ఊటీలో తెరకెక్కించిన ప్రతి ఫ్రేమ్ ఆహ్లాదపరిచింది. న్యూయార్క్‌ సిటీని కలర్‌ఫుల్‌ గా చూపించిన నటరాజన్ ఊటి అందాలను కూడా అంతే అ‍ద్భుతంగా చూపించారు. ఎస్.ఆర్. శేఖర్ ఎడిటింగ్ బాగానే ఉంది. ‘ పెద్దపులి’ పాట మినహా తమన్‌ సంగీతంలో చెప్పుకోతగ్గ ప్రత్యేకతలు లేవు. పాట‌ల పిక్చ‌రైజేష‌న్ బావుంది. నేప‌థ్య సంగీతం ఒకే  -రవళి