గందరగోళం మిగిల్చిన …… ‘ లై ‘ చిత్ర సమీక్ష

                              సినీవినోదం రేటింగ్ : 2.25/5

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై హను రాఘవపూడి రచన దర్శకత్వం లో రామ్‌ ఆచంట, గోపి ఆచంట, అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు .

పేరులో స‌త్యం ఉన్నా.. ఇంటి పేరు ‘ఎ’ తో క‌లుపుకుని వాడుకలో అస‌త్యంగా త‌న‌ని తాను హైలెట్ చేసుకుంటుంటాడు ఎ.స‌త్యం (నితిన్‌). తండ్రిలేని స‌త్యంకి తొంద‌రగా పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేయాల‌న్న‌ది స‌త్యం త‌ల్లి కోరిక‌. అయితే స‌త్యం మాత్రం లైఫ్‌లో సెటిల్ అవ‌డం కోసం లాస్ వేగాస్ వెళ్లాల‌ని ప్లాన్ చేసుకుంటాడు. కొన్ని విచిత్ర‌మైన ప‌రిస్థితుల మ‌ధ్య పిసినారి అమ్మాయి చైత్ర (మేఘా ఆకాష్‌)తో క‌లిసి లాస్ వేగాస్‌కి వెళ్లాల్సి వ‌స్తుంది స‌త్యంకి. ఆ జ‌ర్నీలో ఇద్ద‌రికీ ఒక‌రంటే ఒక‌రికి ప్రేమ పుడుతుంది. ఈ మ‌ధ్య‌లో ఒక ‘సూట్’ కోసం పద్మ‌నాభం (అర్జున్‌) చేసే ప్లానింగ్స్ నడుస్తుంటాయి. ఈ మూడు పాత్రలతో కథ నడిపించడానికో ‘సూట్‌’ హైదరాబాద్‌ నుంచి యుఎస్‌ వెళుతుంది. దానిని ట్రాక్‌ చేస్తే విలన్‌ ఆచూకీ తెలుసుకోవచ్చని ఇంటిల్లిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఒక మిషన్‌ నడుపుతుంది… దాని పేరు ‘షోలే’. ఈ మిషన్‌లోకి హీరో ఎలా ఎంటర్‌ అవుతాడు, అసలు ఆ సూటులో ఏముందని విలన్‌ దానికోసం పరితపిస్తున్నాడు . ఆ ‘సూట్’ వెనుక ఉన్న ర‌హ‌స్యం ఏమిటి? ఈ మిష‌న్‌లో హీరో ఎలా ఇరుక్కున్నాడు? హీరో, విల‌న్ కి మ‌ధ్య ఉన్న క‌నెక్ష‌న్ ఏంటి? అనేది తెర‌పైనే చూడాలి.
‘అఆ’ వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత క‌థానాయ‌కుడు నితిన్, ‘కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి చేసిన చిత్రం ఈ ‘లై’.ఎల్‌-లవ్‌, ఐ-ఇంటిల్లిజెన్స్‌, ఈ-ఎనిమిటీ అంటూ దర్శకుడు మూడు విషయాల చుట్టూ అల్లుకున్న ఆలోచన బాగుంది.రొటీన్‌కి భిన్నంగా ఆలోచించడానికి ఇష్టపడే హను రాఘవపూడి ‘లై’తో కూడా ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి చేసిన ప్రయత్నమైతే కనిపిస్తుంటుంది కానీ .. దాన్ని తెర మీదకి ఆసక్తికరం గా తీసుకు రావడంలో మాత్రం విఫలమయ్యాడు .సినిమాలో దర్శకుడు మరీ ఎక్కువ స్వేచ్ఛను తీసుకొని రాసిన సన్నివేశాలు, ట్రాక్స్ ఇబ్బంది కలిగిస్తాయి. దేవేంద్రుడి ట్రాక్ … ‘అశ్వద్ధామ హతః’ వంటి పురాణం విషయాలు
ఉపయోగించడం మోడ్రన్ నేపధ్యం లో నడిచే ఈ చిత్రానికి సరిపోలేదు. హాలీవుడ్ తరహాలో మన ప్రేక్షకులకి సరికొత్త సినిమా అనుభూతిని ఇవ్వాలనుకున్నప్పుడు స్క్రిప్ట్ విషయం లో చాలా పకడ్బందీగా,పక్కాగా ఉండాలి .అయితే ఈ చిత్రం లో స్క్రిప్ట్ విషయం లో , క్యారెక్టరైజేషన్ విషయం లో చాలా గందర గోళం నడిచింది . కాస్తో కూస్తో మోడ్రన్ సినిమాలు చూసే అనుభవం ఉన్న ప్రేక్షకులే చాలాసార్లు తిక మక పడ్డారంటే పరిస్థితి ని అర్ధం చేసుకోవచ్చు. సినిమాను సాగదీసిన ఫీలింగ్ కలిగింది. దర్శకుడి అనుభవలేమి చాలా సన్నివేశాలలో కనబడింది. ప్రతినాయకుడి ట్రాక్ ను మాత్రం చాలా బాగా హేండిల్ చేశాడు.హీరోయిన్ పాత్ర ప్రేక్షకులని ఇబ్బంది పెట్టింది. హీరో హీరోయిన్ ల ప్రేమ కూడా ఆర్టిఫీషియల్ గానే అనిపిస్తుంది . విజువల్ గా సినిమాని ఎంతో రిచ్ గా చూపించాడు . ‘బ‌ల‌హీన‌త లేని బ‌ల‌వంతుడుని భ‌గ‌వంతుడు కూడా సృష్టించ‌లేదు’ వంటి మాటలు అక్కడక్కడా బాగున్నాయి . ఇంటర్వెల్ బ్యాంగ్, స్టైలిష్ గా తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి.
ప్రేమ‌క‌థా చిత్రాల‌కే కాదు, యాక్ష‌న్ చిత్రాల‌కూ న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని నితిన్ ఈ చిత్రం తో నిరూపించుకున్నాడు . ఈ సినిమా కోసం అతను పడ్డ కష్టం స్ప‌ష్టంగా తెలుస్తుంది స్క్రీన్ మీద‌. న‌ట‌న‌, డ్యాన్స్‌, ఫైట్స్‌, రొమాన్స్‌.. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ ప‌రిణితిని చూపించాడు. నితిన్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ గా ‘లై’లోని పాత్ర‌ని చెప్పుకోవ‌చ్చు. ఇక ఈ సినిమాలో నితిన్ త‌రువాత అర్జున్ పాత్ర‌కే ప్రాధాన్యం. యాక్ష‌న్ చిత్రాల‌కు పెట్టింది పేరైన అర్జున్‌.. ఈ సినిమాలో విల‌న్‌ పద్మనాభం గా అద్భుతంగా న‌టించాడు. స్టైలీష్‌గా క‌నిపిస్తూనే తన బాడీ లాంగ్వేజ్‌తో సినిమాకి హైలైట్ గా నిలిచాడు. ఇక కొత్త‌మ్మాయి మేఘా ఆకాష్‌కి న‌ట‌న‌కు అంత‌గా ప్రాధాన్యం లేని పాత్ర అయినా పిసినారి అమ్మాయి గా క్యూట్ గా క‌నిపించింది. కొన్ని చోట్ల తొలి రోజుల్లోని శ్రియ‌ని గుర్తుకి తెచ్చింది. నితిన్‌తో రొమాంటిక్ సీన్స్‌లో ఆక‌ట్టుకుంది. ర‌వికిష‌న్‌, నాజ‌ర్‌, అజ‌య్‌, శ్రీ‌రామ్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధిమేర‌కు చ‌క్క‌గా న‌టించారు. నిన్న‌టి త‌రం హీరోయిన్ పూర్ణిమ హీరో త‌ల్లిగా కనిపిస్తే .. రాజీవ్ క‌న‌కాల హీరోయిన్‌కి తండ్రిగా క‌నిపించాడు. ఇక ఇంద్ర‌కుమార్‌, నార‌ద శ‌ర్మ అంటూ కామెడీ కోసం అల్లిన పురాణ పాత్ర‌ల్లో పృథ్వీ, బ్ర‌హ్మాజీ ,నితిన్ ఫ్రెండ్ పాత్ర‌లో మ‌ధునంద‌న్ న‌వ్వించే ప్రయత్నం చేశారు.
యువ‌రాజ్ ఛాయాగ్ర‌హ‌ణం సినిమాకి పెద్ద హైలెట్‌. బొంబాయి, శాన్‌ప్రాన్‌సిస్కో, జోర్డాన్‌, లాస్ వేగాస్‌.. ఇలా సినిమాలోని అన్ని లోకేష‌న్స్ లో సినిమాటోగ్ర‌ఫీలో తన క్వాలిటీ ఎక్క‌డా మిస్ కాలేదు . సంగీతం విష‌యానికి వ‌స్తే.. మ‌ణిశ‌ర్మ పాట‌ల్లో ‘మిస్ స‌న్‌షైన్‌’, ‘బంభ‌ట్ పోరి’ అల‌రిస్తాయి. ఇక రీరికార్డింగ్ స్పెష‌లిస్ట్‌ గా త‌న‌ను ఈ సినిమాతో మ‌రోసారి ప్రూవ్ చేసుకుని సినిమాకి మంచి మూడ్ తీసుకొచ్చాడు . ఎన్ .ఆర్ .శేఖర్ ఎడిటింగ్ బాగుంది. ఇక 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారి నిర్మాణ విలువ‌లు భారీ స్థాయిలో ఉన్నాయి   – రాజేష్