ఇప్పటికంటే సంతోషంగా ఉంటుందంటేనే పెళ్లి చేసుకుంటా !

“నేను సన్నిహితంగా ఉండాలని కొందరు కోరుకుంటారు. లేకుంటే పొగరుబోతు అని ముద్రవేస్తారు”అని అంటోంది నిత్యామీనన్. ఈ మలయాళ కుట్టి నేడు దక్షిణాదిన బహుభాషా నటిగా ఎంతో పాపులారిటీ సంపాదించింది. సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న నిత్యామీనన్‌ను  పొగరుబోతు, అహంకారి అని గిట్టనివారు కొందరు అంటారు. ఏ విషయాన్ని అయినా నిర్మొహమాటంగా వెల్లడించే నిత్యామీనన్ సౌత్‌లోని అన్ని భాషల్లో నటించింది.

“నేను 18 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డాను. ఒక దశలో అతనితో నా జీవితం సుఖమయంగా ఉండదనే భావన కలగడంతో వెంటనే అతన్ని వదిలి వచ్చేశాను. ఎవరైనా ఒక వ్యక్తి తారసపడి అతనితో నా జీవితం ఇప్పటికంటే ఎక్కువ సంతోషంగా ఉంటుందనిపిస్తే అప్పుడే అతన్ని పెళ్లి చేసుకుంటాను. అలాంటి వ్యక్తి ఇప్పటివరకు ఎదురుపడలేదు. తగని వాడిని పెళ్లాడి మనసును కష్టపెట్టేకంటే వివాహం చేసుకోకపోవడమే బెటర్.  నటీమణుల పేర్ల ముందు ప్రముఖ అనే పదాన్ని చేర్చడం నాకు నచ్చని అంశం. ఇతరుల విషయంలో నేను చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. షూటింగ్‌లకు నా వెంట మా అమ్మకానీ, నాన్నకానీ రారు. మేనేజర్ కూడా నా వెంట రాడు. కాబట్టి నన్ను నేనే సంరక్షించుకోవాలి. అలాంటప్పుడు ఎవరైనా మొరటుగా ప్రవర్తిస్తే చెడామడా తిట్టేస్తాను. అందుకే నన్ను పొగరుబోతు అంటున్నారు. నిజం చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు నేను నటించిన చిత్రాలకు సంబంధించి ఏ నటుడినీ, దర్శకుడిని ఇబ్బంది పెట్టలేదు. చిత్ర పరిశ్రమలో అందరూ చెడ్డవారు కాదు…. మంచివారు కూడా ఉన్నారు. నేను పొట్టిగా, లావుగా ఉంటాను. నటన కోసం తినడం మానుకోవడం పిచ్చితనం. అయినా పొట్టి, లావు అన్నది దేవుని సృష్టి. దాన్ని విమర్శించడం తగదు. అందం అనేది మనిషి జీవన విధానాన్ని బట్టే ఉంటుంది”అని అన్నారు.