నా గురించి నేను తెలుసుకున్నా!

‘వారం రోజులపాటు ఆశ్రమంలో గడిపొచ్చా’నని చెప్పింది ఆమధ్య నిత్యామీనన్‌. ఆమె ఆధ్యాత్మిక మార్గం పట్టిందా? అనే అనుమానం వస్తుంది కదా.. అయితే ఆశ్రమంలో అలా ఎందుకు గడపాల్సి వచ్చిందన్నది చెప్పలేదు ఆమె .అక్కడ మతం గురించి నేర్చుకోలేదు గానీ.. నా గురించి నేను తెలుసుకున్నానని నిత్యా చెప్పింది. పాఠాలు నేర్పడానికి చాలా కళాశాలలు ఉన్నాయి. మనుషులైన మన గురించి ఏ కళాశాలలోనూ చెప్పడం లేదు.. అని అంది నిత్యామీనన్‌.
ప్రేమ కోసం వెతుక్కోకండి !
“మనలో ప్రేమను నింపుకుంటే ప్రపంచమే ప్రేమమయం అవుతుంది.ప్రేమ అనేది అనుభవంగా ఉండకూడదు. అది అనుభవించేదిగా ఉండాలి”.. అని అంటోంది నిత్యామీనన్‌ .ప్రేమ కోసం ఎక్కడికో పరుగులు తీయాల్సిన అవసరం లేదని అంటోంది .
“ప్రేమ కోసం వెతుక్కోకండి. అసలు ప్రేమకు మరొకరు అవసరమే లేదు. సంతోషంగా ఉన్నవాళ్లు.. దాన్ని ఇతరులకు పంచుతారు. ప్రేమ ఉన్నవారే.. దాన్ని ఇతరులతో పంచుకుంటారు. నిన్ను ప్రేమించడానికి.. నీకంటే మంచివాళ్లు ఎవరూ ఉండరు !
 
అసలు ‘ప్రేమ’ అనేదాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నాం. ‘ఐలవ్యూ’ అనే మాటను కూడా తప్పుగా భావిస్తున్నాం. ఇతరులపై చూపే ప్రేమాభిమానాలు.. మనం మనపై చూపుకునే ప్రేమ..ప్రేమ పలు రకాలు. ప్రేమ కోసం వెతుకుంటూ ఎక్కడికో వెళ్ళాల్సిన ఆవససరం లేదు. ప్రేమ అనేది ప్రపంచంలో ఎక్కడో లేదు. అది మనలోనే ఉంది. లోపలున్న దాన్ని బయటకు తీస్తే… అదే నిజమైన ప్రేమ. ప్రేమ అనేది మననుంచే ప్రారంభం కావాలి. అది మీ వద్ద లేకుంటే ఇతరుల దగ్గర దొరుకుతుందనుకుని పరిగెత్తకూడదు. మనల్ని ఇతరులు గౌరవించాలని భావిస్తున్నాం. అయితే,ముందు మనల్ని మనమే గౌరవించుకోవాలి” అని నిత్యామీనన్‌ అంటోంది
నా మనసులో నిలిచిపోతుంది !
నటిగా తాను నటించే పాత్రల కోసం ముందుగా ఎలాంటి శిక్షణ తీసుకోనని…ఇంకా చెప్పాలంటే, ఏ పాత్రనూ కష్టపడి నటించను. షూటింగ్‌ స్పాట్‌లో యూనిట్‌ వాళ్లు ఇచ్చిన దుస్తులు ధరించగానే… ‘నిత్యామీనన్‌’ అన్న విషయాన్ని మరిచిపోయి పాత్ర లోకి మారిపోతానని చెప్పింది. సాధారణంగా నటించాల్సిన సీన్‌ పేపర్లు.. సంభాషణలు చివరి నిమిషంలోనే ఇస్తుంటారు. అయితే చిత్ర కథను విన్నప్పుడే ఆ పాత్ర నా మనసులో నిలిచిపోతుందని చెప్పింది. దాంతో పాత్రలో ఒదిగిపోతానని అంది.
బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నిత్యామీనన్‌ నటించిన ‘మిషన్‌ మంగళ్‌’ ఇటీవల విడుదలయ్యి విజయ వంతం అయ్యింది.. ఇక కోలీవుడ్‌లో జయలలిత బయోపిక్‌ ‘ది ఐరన్‌ లేడీ’ చిత్రంలో నటిస్తోంది . అదేవిధంగా ‘సైకో’ అనే చిత్రంతో పాటు ఓ మలయాళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది.