నిత్యా ఎందుకు తెర మరుగవుతోంది?

నిత్యమీనన్ తన వద్దకు ఎన్నో ఆఫర్లు వస్తున్నప్పటికీ, వాటిని తిరస్కరిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాల్లో విలక్షణ నటిగా నిత్య పేరు తెచ్చుకుంది.ఈ మళయాల బ్యూటీ ఏ సినిమా చేసినా అందులో ఓ కొత్త కోణం ఉంటుంది. కథలో కొత్తదనమూ ఉంటుంది. సినిమాలో గ్లామర్‌ డోస్‌ ఉంటే మాత్రం అస్సలు అంగీకరించదు. అయితే, ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పాలన్న నిర్ణయానికి వచ్చినట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. తన వద్దకు ఎన్నో ఆఫర్లు వస్తున్నప్పటికీ.. వాటిని నిత్య వదులుకుంటునట్లు తెలుస్తోంది. ఆమధ్య  బ్లాక్‌బస్టర్‌గా నిలిచి జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకున్న ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రను రిజెక్ట్‌ చేసింది నిత్య. కొంతకాలంగా నిత్య టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న విషయం విదితమే. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. పలువురు దర్శకులు సంప్రదిస్తున్నప్పటికీ..ఆమె ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. తాజాగా ‘కరణం మళ్లీశ్వరి’ బయోపిక్ తీసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.ఈ బయోపిక్‌ని కోన వెంకట్‌ తెరకెక్కించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. ఈ సినిమాలో నటించాలని నిర్మాతలు నిత్యను సంప్రదించారట. అయితే ఆమె ఆసక్తి చూపలేదట. తనకు సినిమాలు చేయడమే ఇష్టం లేదని, అందుకే పరిశ్రమకు దూరంగా ఉంటున్నట్టు నిత్య తన సన్నిహితులకు చెబుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిత్య ఇలా ఊహించని విధంగా సినిమాలకు దూరం అవుతున్నట్టు ప్రచారం జరుగుతుండడంతో ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆమెకు ఒక్క మలయాళ సినిమా తప్ప వేరే సినిమాలేవీ లేవు. నిత్య గతంలో మాదిరిగానే సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుతున్నారు.
 
డిజిట‌ల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది!
సినిమాల్లో క‌థానాయిక త‌న‌దైన న‌ట‌న‌తో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో నిత్యామీన‌న్ ఒక‌రు. పాత్ర న‌చ్చితేనే నటించడానికి నిత్యామీన‌న్ ఆస‌క్తి చూపుతారు. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాల‌కే ప‌రిమిత‌మైన ఈమె డిజిట‌ల్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు. కొన్ని నెల‌ల నుండి నిత్యామీన‌న్ డిజిట‌ల్ ఎంట్రీపై వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌ను నిజం చేస్తూ అభిషేక్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి ‘బ్రీత్… ఇన్ టు ది షాడోస్’ వెబ్ సిరీస్లో నటించారు నిత్యామీనన్. అమెజాన్ ప్రైమ్‌లో ప్ర‌సారమ‌వుతున్న ఈ వెబ్ సిరీస్‌లో అమిత్ సాద్‌, స‌యామీఖేర్ కూడా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.