“సెట్స్‌లో భౌతికదూరం పాటించడం దాదాపు అసాధ్యమని, ప్రస్తుత కోవిడ్ పరిస్థితిని పరిశీలించిన తర్వాతే షూటింగ్‌లపై నిర్ణయం తీసుకుంటాన”ని స్పష్టం చేసింది నిత్యామీనన్. అయినా షూటింగ్‌లకు అంత తొందరేం లేదని తెలిపింది. ఈ లాక్‌డౌన్ కాలాన్ని ఉపయోగకరంగా వాడేసుకున్నానంటోంది. బెంగళూరులో కుటుంబంతో కలిసి నివసించేందుకు గొప్ప అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేసింది. లాక్‌డౌన్ వల్ల కాస్త ప్రశాంతంగా గడిపిన సెలబ్రిటీలు.. ఇప్పుడు మళ్లీ మేకప్ వేసుకునే సమయం వచ్చింది. ఇప్పటికే సీరియల్ షూటింగ్‌లు ప్రారంభమవగా.. సినిమా వాళ్లు కూడా ఇప్పుడిప్పుడే ‘స్టార్ట్.. కెమెరా.. యాక్షన్’ అంటూ సెట్స్‌లో అడుగుపెతటే పనిలో ఉన్నారు. అయితే తనకు ఇప్పుడప్పుడే షూటింగ్‌లో పాల్గొనే ఆలోచన లేదంటోంది నిత్యామీనన్. ‘అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ విలక్షణ ఇమేజి సంపాదించుకుంది నిత్యా మీనన్. అలాగే, గ్లామర్ విషయంలో తనకంటూ కొన్ని పరిధులు పెట్టుకుని.. వాటికి కట్టుబడే సినిమాలు చేస్తుంది. ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేసి… నాలుగు రాళ్లు వెనకేసుకునే ఆలోచన నిత్యామీనన్‌కు ఎప్పుడూ లేదు. నిత్యామీనన్‌కు నచ్చితేనే సినిమా చేస్తుంది. లేదంటే ఎంత పెద్ద ఆఫర్ అయినా సరే.. రిజెక్ట్ చేస్తుంది.
లాక్‌డౌన్ సమయంలో రాయడం, చదవడం మళ్లీ మొదలెట్టానని, పనిలో పనిగా ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టినట్లు నిత్యా తెలిపింది. వీధులన్నీ నిర్మానుష్యంగా, నిశ్శబ్ధంగా ఉండటం ఎంతో ప్రశాంతంగా ఉందని నిత్యా పేర్కొంది. కాగా నిత్య చేతిలో నాలుగైదు ప్రాజెక్టులుండగా అటు వెబ్ సిరీస్‌కూ పచ్చజెండా ఊపేసింది.
మెగా ఫోన్ పట్టే అవకాశాలు
నిత్యామీనన్ ఇప్పుడు మెగా ఫోన్ పట్టాలనుకుంటుందట. తన సినిమాల షూటింగ్స్‌లో బ్రేక్ వచ్చినప్పుడు కెమెరామెన్ పనితనం, దర్శకుడి విజన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తోందట.. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా దర్శకత్వం గురించి నిత్యామీనన్ మాట్లాడింది. త్వరలో నిత్యా మెగా ఫోన్ పట్టే అవకాశాలు లేకపోలేదు. తను దర్శకత్వం చేసేందుకు కొన్ని కథలను కూడా ఈ లాక్‌డౌన్‌లో ఆమె సిద్ధం చేసుకుందట. ఆమె దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా ప్రారంభం కావడం ఖాయం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’ వెబ్ సిరీస్‌లో
నిత్యా మీనన్ తొలిసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్‌తో కలిసి ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. మాధవన్, అమిత్ సాధ్ నటించిన సూపర్ హిట్ ‘బ్రీత్’ వెబ్ సిరీస్‌కి ఇది రెండవ సీజన్. రెండో సీజన్‌లో అమిత్ సాధ్ కూడా కీలక పాత్రలో నటించారు. జూలై 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘బ్రీత్: ఇన్ టు ది షాడోస్’ ప్రసారం కానుంది. కాగా అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్‌లకు ఇది తొలి వెబ్ సిరీస్ కావడం విశేషం. ‘తను నీడలో ఉంది… కనుగొనబడటానికి వేచి చూస్తోంది’ అంటూ ఈ సిరీస్ తొలి పోస్టర్‌ని విడుదల చేశారు.