జాతీయ అవార్డు సాధిస్తాననే నమ్మకం ఉంది!

“ఒక నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ప్రేక్షకులు మెచ్చిన మంచి సినిమాలో నేను భాగమై, అందులో నా నటనకు జాతీయ అవార్డు రావాలనుకుంటున్నాను”….అని అన్నారు నిత్యామీనన్‌ .
 
సౌత్‌లో హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకున్న నిత్యామీనన్‌ పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నారు. ఈ ఏడాది ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాతో బాలీవుడ్‌కు కూడా ఎంట్రీ ఇచ్చారు. నటిగా ఇప్పటివరకూ ఎన్నో అవార్డులు అందుకున్నారు. అయితే జాతీయ అవార్డు మాత్రం పొందలేకపోయారు. ఈ విషయం గురించి నిత్యామీనన్‌ మాట్లాడుతూ…
 
‘‘ఒక నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ప్రేక్షకులు మెచ్చిన మంచి సినిమాలో నేను భాగమై, అందులో నా నటనకు జాతీయ అవార్డు రావాలనుకుంటున్నాను.నాకు జాతీయ అవార్డు తెచ్చే సినిమా రొటీన్‌గా ఉండకూడదు. అలాంటి సినిమా అయితేనే చేస్తాను. అయినా నా కెరీర్‌ ఇంకా అయిపోలేదు. చాలా కెరీర్‌ ఉంది కాబట్టి తప్పకుండా ఏదో ఒక సినిమాకి జాతీయ అవార్డు సాధిస్తాననే నమ్మకం ఉంది. నన్ను నేను ఎప్పుడూ ఒక కొత్త హీరోయిన్‌లానే భావిస్తాను. యాక్టర్‌గా ‘ఇక చాలు’ అని అసలు  అనుకోను’’ అని పేర్కొన్నారు. ‘మిషన్‌ మంగళ్‌’ తర్వాత వేరే హిందీ చిత్రం కమిట్‌ కాలేదు ఎందుకు? అనడిగితే – ‘‘నాకు నచ్చే కథ కోసం ఎదురుచూస్తున్నా’’ అన్నారు నిత్యామీనన్‌.
 
తొలి ఆల్బమ్‌ మ్యూజిక్‌ త్వరలోనే
నిత్యామీనన్‌ మల్టీటాలెంటెడ్‌. బాగా యాక్ట్‌ చేయగలరు. మలయాళీ అయినా అచ్చ తెలుగులో సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకోగలరు. సినిమాల్లో పాటలు పాడగలరు. ఇప్పుడు తనలోని గాయనిపై మరింత దృష్టి పెట్టారు. గాయనిగా నిత్యామీనన్‌ తన తొలి ఆల్బమ్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ మ్యూజిక్‌ ఆల్బమ్‌కి లండన్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ సౌమిక్‌ దత్తా సంగీతాన్ని సమకూర్చగా..నిత్యామీనన్‌ పాడనున్నారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా తెలియజేశారామె… ‘‘సరికొత్త ప్రాజెక్ట్‌ తయారవుతోంది. కెరీర్‌లో చిన్న మార్పు రాబోతోంది. నా తొలి మ్యూజిక్‌ సింగిల్‌ త్వరలో విడుదల కాబోతోంది. అందరికీ త్వరగా వినిపించేయాలనే ఆతృత తో ఉన్నాను’’ అన్నారు. ప్రస్తుతం నిత్యామీనన్‌ జయలలిత బయోపిక్‌ ‘ది ఐరన్‌ లేడీ’, తెలుగులో సత్యదేవ్‌తో ఓ సినిమా చేస్తున్నారు.