వారు నన్ను చంపాలనే కోరుకుంటున్నారు !

 ‘కాంచన2’ నుంచి ‘మెర్సల్‌’ వరకు నిత్యమేనన్‌ నటించిన చిత్రాల్లో  పాత్రలు వేటికవే వైవిధ్యమైనవి. ఈ తరం కధానాయికల్లో విలక్షణ పాత్రలు పోషించడంలో మలయాళతార నిత్యమేనన్‌దే అగ్రస్థానం. ఆమె ఎంచుకున్న పాత్రలు, కథలు అన్నీ భిన్నంగానే ఉంటాయి. ప్రేక్షకులనూ అమితంగా ఆకట్టుకుంటున్నాయి.గత రెండేళ్లలో విడుదలైన చిత్రాలను పరిశీలిస్తే… ‘24’లో గృహిణిగా మెప్పించి, ఆ వెంటనే విక్రమ్‌తో ‘ఇరుముగన్‌’ తెలుగులో (ఇంకోక్కడు) ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌గా అదరగొట్టింది. తాజాగా ‘మెర్సల్‌’లో పంజాబీ అమ్మాయిగా, భార్యగా, బిడ్డను పోగొట్టుకుని బాధపడే తల్లిగా భావోద్వేగ పాత్రలో ప్రశంసలందుకుంది. ‘ఇలయదళపతి’ విజయ్‌ నటించిన ఈ చిత్రంలో అందాలతారలు కాజల్‌ అగర్వాల్‌, సమంతలు ఉన్నప్పటికీ, నిత్యమేనన్‌ పాత్ర ముందు తేలిపోయారు.
‘మెర్సల్‌’ అమోఘ విజయం సాధించిన నేపథ్యంలో నిత్య మీడియాతో మాట్లాడుతూ….
 ‘‘నా కెరీర్‌ ప్రారంభం నుండి భిన్నమైన సినిమాల్లో నటిస్తున్నాను. నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తాను. నిజానికి ‘మెర్సల్‌’ కంటే ముందు ‘రాజారాణి’, ‘తెరి’ చిత్రాల్లోనే అట్లీతో పనిచేయాల్సి ఉంది. అది ఈ సినిమాతో కుదిరింది. ఇంకో విషయం ఏమిటంటే… దర్శకులందరూ నా పాత్రల్ని చంపాలనే కోరుకుంటున్నారు (నవ్వుతూ…). ఒక మంచి పాత్ర మరణిస్తే సెంటిమెంట్‌ ఎక్కువగా పండుతుంది. అది వారి ఆలోచన. మంచి పేరు తెచ్చే పాత్రలు చేయడం నాకూ ఇష్టమే’’ అని పేర్కొంది