మంచి రొమాంటిక్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘సెవెన్’

తెలుగులో ‘భలే భలే మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘మహానుభావుడు’, ‘శైలజారెడ్డి అల్లుడు’తో సినిమాటోగ్రాఫ‌ర్‌గా నిజార్ షఫీ పేరు తెచ్చుకున్నారు. ఆయన ‘సెవెన్’తో దర్శకుడిగా మారుతున్నారు. హవీష్ కథానాయకుడిగా కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ లో రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లు. ఈ సినిమా ప్రీమియర్ షోలు బుధవారం ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా నిజార్ షఫీతో ఇంటర్వ్యూ….
 
మీ గురించి చెప్పండి?
మాది చెన్నై. ఎంజిఆర్ గ‌వ‌ర్న‌మెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్‌ ట్రయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లొమా ఇన్ సినిమాటోగ్రఫీ చేశా. అప్పుడు షార్ట్ ఫిల్మ్స్‌కి డైరెక్షన్ కూడా చేశాను. కోర్స్ పూర్తయిన తర్వాత శక్తి శరవణన్ గారి దగ్గర ‘సరోజ’, తెలుగులో ‘గ్యాంబ్లర్’గా విడుదలైన అజిత్ సినిమాలకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశా. రజనీకాంత్ గారి ‘రోబో’కి సినిమాటోగ్రాఫర్ రత్నవేలుగారి దగ్గర అసిస్టెంట్ గా చేశా. తర్వాత తమిళంలో మూడు సినిమాలకు సినిమాటోగ్రఫీ చేశా. అందులో సత్యరాజ్ గారు నిర్మించిన సినిమా ‘నాయిగల్ జాకిరతై’ ఒకటి. వాళ్లబ్బాయి శిబిరాజ్ హీరోగా నటించారు. ఆ సినిమా కెమెరా వర్క్ మారుతిగారికి నచ్చింది. ‘భలే భలే మగాడివోయ్’కి వర్క్ చేద్దామని పిలిచారు. తర్వాత ‘నేను లోకల్’, ‘మహానుభావుడు’, ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలకు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశాను. ‘సెవెన్’తో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను.
 
‘సెవెన్’ ఎలా ప్రారంభమైంది?
ఒక రోజు హవీష్ ఫోన్ చేశారు. ‘మంచి లైన్ విన్నాను. డైరెక్షన్ చేస్తారా?’ అని అడిగారు. నాకు స్టోరీ లైన్ నచ్చింది. రమేష్ వర్మగారితో కలిసి డెవలప్ చేశాం. మంచి స్టోరీ లైన్, ఎందుకు ఈ సినిమా మిస్ చేసుకోవాలని ఓకే చెప్పేశా.
 
మీరు దర్శకుడిగా మారాలని ఎదురు చూస్తున్న సమయంలో ఈ అవకాశం వచ్చిందా?
లేదు. దర్శకుడిగా మారాలనే ఆలోచన నాలో ఉంది. అయితే, ఇంత త్వరగా దర్శకుణ్ణి అవుదామని అనుకోలేదు. కొన్నేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టుకోవాలని అనుకున్నా. అయితే ముందు చెప్పినట్టు మంచి స్టోరీ నా దగ్గరకు వచ్చింది. ఎందుకు మిస్ చేసుకోవాలని ఓకే చెప్పేశా. సినిమాటోగ్రఫీ ప‌రంగానూ మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది. నైట్ ఎఫెక్ట్స్, థ్రిల్స్ ఉంటాయి. ప్రేక్షకులకు ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్.
 
‘సెవెన్’ కథ ఏంటి?
ఒక రొమాంటిక్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. రెహమాన్ గారు ఇందులో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. ఆయన దగ్గరకు ఒక కేసు వస్తుంది. కేసుకు సంబంధించి మొత్తం ఏడుగురు వ్యక్తులు కీలకంగా ఉంటారు. హీరో కార్తీక్, ఆరుగురు హీరోయిన్లు. రెహమాన్ దృష్టిలో ఏడుగురు. అదే ‘సెవెన్’.
కార్తీక్, కృష్ణమూర్తి ఒక్కరేనా? ట్రైలర్‌లో ఆ పాయింట్ ప్రేక్షకులను ఆలోచింపజేసింది!
రెండు రోజుల్లో సినిమా విడుదలవుతుంది. మరికొన్ని గంటలు ఎదురుచూడండి. ఈ సస్పెన్స్ కి తెర పడుతుంది.
 
కార్తీక్ గా హవీష్ ఎలా నటించాడు?
చాలా బాగా చేశాడు. ఇప్పటివరకు తను ఇటువంటి సినిమా చేయలేదు. ‘సెవెన్’లో కొత్తగా కనిపిస్తాడు.
 
లిప్ లాక్స్ ఐడియా మీదేనట… హవీష్‌కి ముద్దుల గురించి చెప్పలేదట?
లిప్ కిస్సుల ఐడియా నాదే. కథలో భాగంగా ఉంటాయి. ప్రేమకథలో లిప్ కిస్సులు కూడా భాగమే. నటుడిగా ముద్దు సన్నివేశాలు చేయడానికి హవీష్ కొంచెం అలోచించి ఉండొచ్చు. కానీ, దర్శకుడిగా సెట్ లో నాకు కావలసిన సన్నివేశాలు చేయించుకున్నాను. రొమాన్స్, థ్రిల్ సీన్స్… సినిమాలో రెండూ ఉంటాయి.
 
ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు. అంతమందితో పని చేయడం?
సినిమాను ఆరు రీళ్ళుగా విభజిస్తే… రీలుకు ఒక హీరోయిన్ చొప్పున వస్తారు. ప్రతి ఒక్కరికీ కథలో ప్రాముఖ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరి కథ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. అందరూ తమ తమ పాత్రల్లో బాగా చేశారు.
 
పాటలకు మంచి పేరొచ్చింది. హవీష్ కూడా సంగీతం గురించి చాలా చెప్పారు!
సినిమాలో మూడు పాటలు ఉన్నాయి. మూడూ హిట్టయ్యాయి. థ్రిల్లర్ సినిమాలకు పాటలతో పాటు నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. చైతన్ భరద్వాజ్ మంచి నేపథ్య సంగీతం అందించారు.
 
రమేష్ వర్మ దర్శకుడు కూడా. ‘సెవెన్’లో ఆయ‌న ఇన్వాల్వ‌మెంట్‌ ఎంతవరకు ఉంది?
ఆయన కథ చెప్పారు. తర్వాత టీమ్ అంతా కలిసి డెవలప్ చేశాం. సెట్‌కి వెళ్ళిన త‌ర్వాత‌ నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆయన జోక్యం చేసుకోలేదు.
 
సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ అయితే అడ్వాంటేజ్ ఏంటి?
సినిమాటోగ్రాఫర్ అనుకున్నది అనుకున్నట్టుగా 95 శాతం వరకూ తీయవచ్చు. సినిమాటోగ్రఫీ మాత్రమే చేసిన సినిమాలకు కూడా దర్శకులతో హెల్తీ డిస్కషన్ ఉండేది. షాట్స్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం.
 
‘సెవెన్’కి సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ చేశారు. ఇబ్బంది పడిన సందర్భాలు?
ఏమీ లేవు. ఆపరేటివ్ కెమెరామేన్ ఒకరిని పెట్టుకున్నాను. కాకపోతే… పది రోజులు ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే… ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘సెవెన్’ షెడ్యూల్స్ క్లాష్ అయ్యాయి. పగలు ‘శైలజారెడ్డి అల్లుడు’, రాత్రి ‘సెవెన్’ షూటింగ్ చేసేవాణ్ణి. ఒక సినిమాకు నేను సినిమాటోగ్రాఫర్. మరో సినిమాకు నేను డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్. ‘సెవెన్’ షెడ్యూల్ వాయిదా వేద్దామంటే ఆర్టిస్టుల డేట్స్ తో ఇబ్బంది. అందుకని, పది రోజులు నిద్రపోకుండా పని చేశా.
 
దర్శకుడిగా మారుతున్నానని రత్నవేలు, మారుతికి చెబితే ఏమన్నారు?
రత్నవేలుగారు చాలా సంతోషపడ్డారు. ట్రైలర్లు, పాటలు పంపించాను. బావున్నాయని మెచ్చుకున్నారు. ప్రస్తుతం ‘సైరా’ షూటింగ్ చేస్తున్నారు. అది పూర్తయిన తరవాత సినిమా చూస్తానని చెప్పారు. మారుతి కూడా ఎంతో సంతోషించారు. ట్రైలర్లు, పాటల గురించి చాటింగ్ చేసేవారు.
 
నెక్స్ట్ ఏంటి? సినిమాటోగ్రఫీ చేస్తారా? దర్శకత్వమా?
సినిమాటోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలకు కమిట్ అయ్యాను. దర్శకుడిగా మారినందువల్ల సమస్యలు ఏవీ రావు. దర్శకుడిగా రెండు ఐడియాలు ఉన్నాయి. ఒకటి లవ్ స్టోరీ. మరొకటి థ్రిల్లర్. దర్శకుడిగా ఈ రెండు జానర్లు నాకిష్టమే. అవి డెవలప్ చేశాక, ఏదో ఒకటి చేస్తా