అది జరిగేవరకు నాకు మనశ్శాంతి ఉండదు !

తన జీవితంలో సినిమా దశ ముగిసిపోయిందని అంటున్నారు అలనాటి నటి, భాజపా ఎంపీ హేమమాలిని. త్వరలో ‘సినర్జీ 2017’ పేరిట హేమ ముంబై లో సాంస్క్రతిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో హేమ పాల్గొన్నారు….

“నా జీవితంలో సినిమా దశ ముగిసిపోయింది. సినిమాల్లో నటిస్తున్నావా అని పార్లమెంట్‌లో అడుగుతుంటారు. నేను నటించిన ‘భాగ్‌బన్‌’ లాంటి కథ దొరికితే తప్పకుండా నటిస్తాను. లేదంటే ఇక సినిమాల జోలికి వెళ్లను. కానీ నా నాట్య ప్రదర్శనలను మాత్రం ఆపను. కేంద్రమంత్రి పదవి గురించి నన్ను చాలా మంది ప్రశ్నిస్తున్నారు. నాకు మంత్రి అయ్యే అర్హత లేదని నా అభిప్రాయం. ప్రస్తుతం నాకున్న బాధ్యతలతో సంతోషంగా ఉన్నాను. అంతకుమించి ఎలాంటి కోరికలు లేవు. కళా రంగంలో నా వంతు కృషి చేయాలని ఉంది. నేను మంత్రి అయితే ఇక ప్రజలకు నన్ను కలిసే అవకాశం ఉండదు. ఓ ఎంపీగా నేను చేయగలిగినంత చేస్తున్నాను. అదే సంతోషంగా ఉంది. నా నియోజకవర్గమైన మథురలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నాను. అది జరిగేవరకు నాకు మనశ్శాంతి ఉండదు”….అని చెప్పుకొచ్చారు హేమ.