ఎన్టీఆర్‌ ‘వన్‌ మేన్‌ షో’ …. ‘జై లవ కుశ’ చిత్ర సమీక్ష

                                             సినీవినోదం రేటింగ్ : 2.75 /5

నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్‌ పతాకం పై కె.ఎస్‌.ర‌వీంద్ర‌ దర్శకత్వం లో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు .

జై ల‌వ‌కుశ‌లు క‌వ‌ల‌లు. జై పెద్ద‌వాడు. అతనికి న‌త్తి ఉంటుంది. వీరి ఫ్యామిలీ నాట‌క రంగాన్ని న‌మ్ముకుని బ్ర‌తుకుతుంటుంది. జైకి ఉన్న న‌త్తి కార‌ణంగా వీరి మావ‌య్య‌(పోసాని) త‌న ఆధ్వ‌ర్యంలో వేసే రామాయ‌ణ నాట‌కంలో ల‌వ‌, కుశుల‌కే ప్రాధాన్య‌త‌నిస్తుంటాడు. అందువ‌ల్ల జైకి ఆత్మ న్యూన‌త భావం ఏర్ప‌డుతుంది. దాంతో జైకి క‌సి పెరుగుతుంది. వారు వేస్తున్న నాట‌కం వేదికను పేల్చేస్తాడు. ఆ ప్రమాదం నుండి బయట పడ్డ ముగ్గురు అన్న‌దమ్ములు విడిపోతారు. జై పెద్ద డాన్‌గా మారతాడు. రావణాసురుడి వ్యక్తిత్వం కు ఆకర్షితుడై అతడి పేరును కూడా ‘రావణ్‌ మహారాజ్‌’ గా మార్చుకొని ఒడిశాలోని బైరంపూర్‌ అనే ప్రాంతంలో హవా చూపిస్తుంటాడు. ల‌వ‌కుమార్ బ్యాంక్ ఆఫీస‌ర్ అవుతాడు. మంచివాడైన ల‌వ‌కుమార్‌ దగ్గర అంద‌రూ లోన్స్ తీసుకుని క‌ట్ట‌కుండా మోసం చేస్తుంటారు. ఆ స‌మ‌యంలో కుశుడు, ల‌వుడు ఒక‌రికొక‌రు తార‌స‌ప‌డ‌తారు.

 కుశుడు దొంగ . ప‌క్క‌వారిని మోసం చేసే కుశుడు మోసంతో భారీ మొత్తంలో డ‌బ్బులు సంపాదిస్తాడు. అయితే నోట్ల మార్పిడి కార‌ణంగా పాత నోట్లు చెల్ల‌క‌పోవ‌డంతో దిగులుప‌డ‌తాడు. ఆ స‌మ‌యంలో కుశుడు ల‌వుడి స్థానంలో బ్యాంకులోకి వెళ్లి నోట్లు మార్చుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తాడు. కానీ కుద‌ర‌దు. రిక‌వ‌రీ డ‌బ్బుతో ల‌వ‌కుమార్‌కి చెప్ప‌కుండా పారిపోయినా, అతని నుంచి ఆ డబ్బు వేరెవరో ఎత్తుకు పోతారు .అలాగే ల‌వ‌కుమార్‌ ప్రియురాలి(రాశి ఖన్నా)ని కూడా ఎవరో కిడ్నాప్ చేస్తారు .అక్కడే క‌థ మలుపు తీసుకుంటుంది… ఆ సోదరులిద్దరినీ జై ఎత్తుకుపోతాడు . తాను చెప్పిన పని చేస్తే కుశుడి డబ్బు, లవుడి ప్రియురాలిని తిరిగిస్తానని అంటాడు . ఆ పని లవకుశులు పూర్తి చేశారా ? జై రావ‌ణ‌లా ఎందుకు మారుతాడు? చివ‌ర‌కు ముగ్గురు అన్న‌ద‌మ్ములు క‌లుస్తారా? అనేది తెలుసుకోవాలంటే సినిమాలో చూడాల్సిందే…..

తొలిసారి కుటుంబ బ్యానర్‌ నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్‌ లో నటించడంతోపాటు, ఏకంగా మూడు పాత్రలు … అందులోనూ తొలిసారి ఓ నెగెటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో ఎన్టీఆర్‌ నటించడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఈ సినిమా కోసం ఎదురుచూశారు. ఈ చిత్రం ఎన్టీఆర్‌ ‘వన్‌ మేన్‌ షో’ . మూడు పాత్రల్లో ఎన్టీఆర్‌ ఒదిగిపోయిన తీరు అద్భుతం. మూడు పాత్రల్లోను అతడు నటించిన తీరు చాలా బాగుంది . వేషం, భాష, వ్యక్తిత్వం చివరికి శరీరం కదలికల్లో కూడా మూడు పాత్రల్లోనూ మూడు విధాలుగా చేసి స్పష్టమైన తేడా చూపించాడు .జై పాత్ర ద్వారా అసలైన రౌద్రాన్ని, సున్నిత మనస్తత్వాన్ని, కుశుడి పాత్ర ద్వారా చలాకీతనాన్ని ఎన్టీఆర్‌ పండించాడు. కుశ పాత్ర ద్వారా కామెడీ కూడా బాగా చేశాడు. ఇక సెంటిమెంట్ స‌న్నివేశాల్లో కూడా ఎన్టీఆర్ న‌ట‌న సింప్లీ సూప‌ర్బ్‌. పౌరాణిక పాత్రలకు సంబంధించిన డైలాగ్స్ తో కట్టిపడేశాడు. డ్యాన్సుల విష‌యంలో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్రీ క్లైమాక్స్‌లో త‌మ‌ను క్ష‌మించాల్సిందిగా జై ని త‌మ్ముళ్లు ప్రాధేయ‌ప‌డ‌టం, అలాగే త‌మ్ముళ్ల‌ను క్ష‌మించ‌మ‌ని పోసాని క్లైమాక్స్ లో జై ని ప్రాధేయ పడే స‌న్నివేశంలో సెంటిమెంట్ మెప్పించింది.
సినిమాకు ప్రధాన మైనస్అందరికీ తెలిసిన క‌థ‌కావడం …. ఆకట్టుకునే కథనం లేకపోవడమే. దర్శకుడు కొంతవరకూ కొత్త దనంతో సగం వరకు బాగానే నడిపినా… ఆ తర్వాత మాత్రం తేల్చేశాడు.’బాగుంది’ అనుకునేలోపు సినిమాను రొటీన్ లోకి తీసుకెళ్లి, దానికి పాతకాలపు ముగింపు ఇచ్చి నిరుత్సాహానికి గురిచేశాడు. ఒకటి, రెండు సన్నివేశాలు మినహా ప్రేక్షకుడిని ప్రభావితం చేసే బలమైన సీన్లు లేవు. ఎన్టీఆర్‌ అభినయం వల్ల కొన్ని సందర్భాల్లో విషయం తక్కువగా ఉన్నా కవర్‌ అయిపోయింది. ద్వితీయార్ధం లో కధనం డీలా పడి సినిమా నెమ్మదించింది. బహుపాత్రా చిత్రాల్లో  ఒకరిని చూసి ఒకరనుకునే సన్నివేశాలు రీజనింగ్ తో సంబంధం లేకుండా ఇందులోనూ ఉన్నాయి . పతాక సన్నివేశాలకి ముందు వచ్చే ‘నాటకం’ సీన్‌ బాగుంది . స్క్రీన్ ప్లే లో అక్కడక్కడా కనిపించే కొన్ని మెరుపుల క్రెడిట్ కోన వెంకట్‌, చక్రవర్తి లకు దక్కుతుంది . ఇక సెకండాఫ్ లో  జై మిగతా ఇద్దరినీ తన దగ్గరకు రప్పించుకోవడం వరకు బాగున్నా, వాళ్ళని వాడుకోవడం మాత్రం పరమ రొటీన్ గానే అనిపించింది. పైగా లవ్ ట్రాక్స్ కూడా ఏమంత ఆకట్టుకునే విధంగా లేవు. తమన్నా స్పెషల్ సాంగ్ ఓకే.

 ఇక హీరోయిన్స్‌గా న‌టించిన నివేద థామ‌స్‌, రాశిఖ‌న్నాల పాత్రలు ప‌రిమితం . వీరి పాత్ర‌ల్లో న‌ట‌న‌కు స్కోప్ త‌క్కువ‌గా ఉంది. నివేదా పాత్రకు కూడా సరైన రీజన్ కనబడదు. ఇక సాయికుమార్‌, పోసాని , హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, రోనిత్ రాయ్‌, అభిమ‌న్యుసింగ్, ప్రవీణ్‌, బ్రహ్మాజీ, హంసానందిని త‌దిత‌రులు వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ద‌ర్శ‌కుడు బాబీ మాట‌ల‌ను చ‌క్క‌గా రాసుకున్నాడు. రైతుల మీద ఎన్టీఆర్ చెప్పే డైలాగ్‌, అన్న‌ను తమ్ముళ్లు ప్రాధేయ‌ప‌డే స‌న్నివేశాల్లో సంభాష‌ణ‌లు బావున్నాయి. దేవిశ్రీప్రసాద్‌ పాటలు పర్లేదనిపిస్తాయి తప్ప, అతని స్థాయికి తగ్గట్టు అనిపించలేదు. నేపథ్య సంగీతం మరీ కొత్తగా లేకున్నా బాగుంది . సినిమాకి ప్లస్ అయ్యింది . ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ బావుంది.కానీ అతన్నుండి ఆశించే స్థాయిలో లేదు . ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌ ఆర్ట్ ప‌నిత‌నం బావుంది – రాజేష్