సెప్టెంబ‌ర్ 21న ఎన్టీఆర్ ‘జై ల‌వ‌ కుశ’

“మంచిత‌నం పుస్తకాల‌ల‌లో ఉంటే పాఠం అవుతుంది. మ‌న‌లో ఉంటే గుణ‌పాఠం అవుతుంది.. అదే నా జీవితాన్ని త‌ల‌క్రిందులు చేసింది” అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ “జై ల‌వ‌ కుశ”సినిమాపై అంచ‌నాలు పెంచుతుంది. అభిమానుల‌కు ఒక‌రోజు ముందే పండుగ ఆనందాన్ని అందించాడు ఎన్టీఆర్. ‘ల‌వ’ టీజ‌ర్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం చిత్ర బృందం ‘వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌ల‌తో’ తాజాగా క్లాసీ టీజ‌ర్ విడుద‌ల చేసింది.టీజ‌ర్ లో క్లాస్ లుక్ తో కనిపించిన‌ ఎన్టీఆర్ త‌న‌ ప‌ర్‌ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ నిఅలరించాడు. ‘జై’ టీజ‌ర్ లో “ఆ రావణుడ్ని సంపాలంటే సముద్రం దాటాలా.. ఈ రావణుడ్ని సంపాలంటే.. సముద్రమంత ధ ధ ధ ధ ధైర్యం ఉండాలా” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌పై అభిమానులనే కాదు సెల‌బ్రిటీలు ప్ర‌శంస‌లు కురిపించారు. కాజ‌ల్, స‌మంత‌,సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్, క్రిష్ జాగ‌ర్ల‌మూడి, నితిన్, రాజమౌళి, రానా, రాఘవేంద్రరావు ఇలా ఒక్కరేంటి ఎందరో సెలబ్రిటీలు ‘జై’ టీజర్ ని ఆకాశానికి ఎత్తిన సంగ‌తి తెలిసిందే.

‘జై’ టీజ‌ర్ లో ఎన్టీఆర్ పాత్ర‌ని వైల్డ్‌గా చూపించిన మేక‌ర్స్ ‘ల‌వ’ టీజ‌ర్‌లో సౌమ్యుడిగా చూపించారు. ఈ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటూ , క‌థ‌తో పాటు న‌డుస్తుంద‌ని అంటున్నారు. తొలిసారి “జైల‌వ‌కుశ” చిత్రంలో త్రిపాత్రాభిన‌యం చేస్తున్న ఎన్టీఆర్ ‘జై, ల‌వ‌, కుశ’ అనే మూడు భిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. రాశీ ఖ‌న్నా, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని క‌ళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ‘రాక్ స్టార్’ స‌మ‌కూర్చిన పాట‌ల‌ను సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. చిత్రంలో మూడో పాత్ర ‘కుశ’ లుక్ తో పాటు టీజ‌ర్ ని ఆగ‌స్ట్ నెలాఖ‌రులో లేదంటే సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో విడుద‌ల చేయ‌నున్నార‌ని ఫిలింన‌గర్ టాక్.