‘ఇఫీ’ వేడుకల్లో వివాదం : జ్యూరీ చైర్మన్ రాజీనామా !

‘ఇండియన్‌ పనోరమా’కి సంబంధించిన ఫీచర్‌ ఫిల్మ్స్‌ జ్యూరీ చైర్మెన్‌గా ఉన్న సుజోయ్ ఘోష్ తన పదవికి రాజీనామా చేశారు. సుజోయ్ తీసుకున్న సంచలన నిర్ణయం ప్రస్తుతం పరిశ్రమ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. సినిమాల ఎంపిక విషయంలో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ జోక్యమే సుజోయ్ రాజీనామాకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
48వ ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా’ (ఇఫీ) వేడుకలు ఈ నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరుగనున్న విషయం విదితమే. ఇందులో భాగంగా ఇండియన్‌ పనోరమాకి సంబంధించిన ఫీచర్‌ ఫిల్మ్స్‌, మెయిన్‌ స్ట్రీమ్‌ ఫిల్మ్స్‌, నాన్‌ ఫీచర్‌ ఫీల్మ్స్‌ విభాగాల్లో ఎంపికైన సినిమాలను గత వారం ప్రకటించారు.
దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన 153 ఫీచర్‌ ఫీల్మ్స్‌ నుంచి 28 చిత్రాలను సుజోయ్ ఘోష్‌ అధ్యక్షతన 12 మంది సభ్యులు గల జ్యూరీ ఎంపిక చేసింది. అయితే జ్యూరీ 28 చిత్రాలను ఎంపిక చేసినప్పటికీ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కేవలం 26 చిత్రాలను మాత్రమే అధికారికంగా ప్రకటించింది. ‘ఎస్‌ దుర్గ’ (మలయాళం), ‘న్యూడ్‌’ (మరాఠీ) ఈ రెండు చిత్రాలను మాత్రం ప్రకటించలేదు. అంతేకాదు ఈ రెండు సినిమాలను సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించడం లేదనే సమాచారం కనీసం జ్యూరీ చైర్మెన్‌, సభ్యులకు కూడా లేదు. సమాచారం ఇవ్వకపోవడంతోపాటు జ్యూరీ ఎంపిక చేసిన ఈ రెండు చిత్రాలను ఎందుకు నిలిపివేశారనే విషయంలోనూ వివరణ ఇవ్వలేదు. జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఫీచర్‌ ఫిల్మ్స్‌ విభాగ చైర్మన్ సుజోయ్ ఘోష్‌ రాజీనామా చేశారు.

ఎందుకు జోక్యం చేసుకుందో అర్థం కాలేదు !

‘ఎస్‌ దుర్గ’, ‘న్యూడ్‌’ ఈ రెండు చిత్రాలు ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో  ప్రదర్శితమయ్యాయి. కంటెంట్‌ పరంగా ఉన్నత ప్రమాణాలు కలిగిన ఈ రెండు చిత్రాలను సమాచార మంత్రిత్వ శాఖ ఎందుకు నిలిపి వేసిందో ఇప్పటికీ అర్థం కాలేదని జ్యూరీ సభ్యులు ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుజోయ్ రాజీనామాను జ్యూరీలో ఎక్కువ సభ్యులు సమర్థించారు. మంచి సినిమాలను, మంచి నిర్మాణాత్మక విలువలున్న సినిమాలు, సామాజిక సందేశం ఉన్న సినిమాలు, సమాజానికి ఉపయోగపడే రీతిలో ఉండే సినిమాలను, వాస్తవికతను తెలియజేసే సినిమాలను ఇటువంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఎంపిక చేస్తే ఆయా దర్శక, నిర్మాతలు తాము చెప్పదల్చుకున్న లేదా చూపించదల్చుకున్న మంచి విషయాలు ప్రజలకు చేరతాయి. అటువంటి మంచి ఉద్దేశ్యం ఉన్నప్పటికీ జ్యూరీ ఎంపిక సినిమాల విషయంలో సమాచార మంత్రిత్వశాఖ ఎందుకు జోక్యం చేసుకుందో ఇప్పటికీ అర్థం కాలేదని పలువురు విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఆ రెండు చిత్రాలను ఎందుకు ప్రకటించలేదనే విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నారు.

‘కాశవ్‌’ కూడా ప్రదర్శించడం లేదు !

సుజోయ్ రాజీనామా అనంతరం సుమిత్రాభావే తన ‘కాశవ్‌’ చిత్రాన్ని చలన చిత్రోత్సవంలో ప్రదర్శించడం లేదని ప్రకటించారు. మంచి లక్ష్యాలతో సాగుతున్న ఇఫీలో మంత్రిత్వశాఖ జోక్యాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. గతేడాది జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన ‘కాశవ్‌’ (మరాఠి) చిత్రం డైరెక్ట్‌ ఎంట్రీతో ఫీచర్‌ ఫిల్మ్స్‌ విభాగంలో అర్హత సాధించింది. సుజోయ్ రాజీనామా చేయటమనేది సంచలనాత్మక నిర్ణయం. ఆయన ఎందుకు రాజీనామా చేశారనే విషయంలో వివరణ ఇవ్వకపోయినా, రాజీనామా అస్త్రమే ప్రజలకు అసలు విషయాన్ని తెలియజేస్తుందని జ్యూరీ సభ్యుల్లో ఒకరైన రుచి నారాయణ్‌ పేర్కొన్నారు.

మహిళలను శక్తివంతంగా చూపించిన సినిమాలు..

‘మరాఠి ‘న్యూడ్‌’, మలయాళం ‘ఎస్‌ దుర్గ’ (సెక్సీ దుర్గ) ఈ రెండు సమకాలీన భారతీయ చిత్రాలు. ఇప్పటి వరకు ఏ చిత్రాల్లోనూ ఆవిష్కరించని రీతిలో అత్యంత శక్తివంతంగా మహిళలను తెరపై ఆవిష్కరించారు. టైటిల్స్‌ పరంగా వినడానికి ఇవి ఇబ్బందికరంగా ఉన్నా సినిమాలు మాత్రం అలా లేవు. నాతోపాటు జ్యూరీలో ఉన్న 11 మంది సభ్యులు ఈరెండు చిత్రాలను ఏకగ్రీవంగా ఇండియన్‌ పనోరమా విభాగం లోని ఫీచర్‌ ఫిల్మ్స్‌ సెక్షన్‌లో ఎంపిక చేశాం. వీటిని ఫైనల్‌ లిస్ట్‌లో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఎందుకు తొలగించిందో అర్థం కాలేదు. పైగా దీనిపై వివరణ ఇవ్వకపోవడం కూడా శోచనీయం. మహిళల గొప్పతనాన్ని, వారి శక్తియుక్తులను అత్యద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రాలను ఫైనల్‌ లిస్ట్‌లో నుంచి తొలగించడమంటే రెండు మంచి చిత్రాలను ప్రజలకు చూపే అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వకపోవడమే’ అని జ్యూరీ సభ్యుడు అపూర్వ అస్రాని ఘాటుగా స్పందించారు.

ఎందుకు తొలగించారు..?

‘చైర్మెన్‌తోపాటు 12 మంది సభ్యులున్న జ్యూరీ నా ‘న్యూడ్‌’ చిత్రాన్ని ఎంపిక చేసింది. అంతేకాదు ఈనెల 20వ తేదీన ప్రారంభమయ్యే ఇఫీ వేడుకల్లో ప్రారంభ చిత్రంగా ‘న్యూడ్‌’చిత్రాన్ని ప్రదర్శిస్తే బాగుంటుందని కూడా జ్యూరీ కేంద్రానికి సూచించింది. అయితే జ్యూరీ సూచనలను, వారి విలువైన అభిప్రాయాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం. నా చిత్ర కథకు ‘న్యూడ్‌’ అనే టైటిల్‌ యాప్ట్‌. న్యూడ్‌ అని టైటిల్‌ పెట్టినంత మాత్రాన  సినిమా మొత్తం మీరు ఊహించుకున్నట్టు ఉంటుందా?, ఇందులో మహిళలను ఎంతో డిగ్నిఫైడ్‌గా, భావోద్వేగభరితంగా చూపించాను. అంతేకాదు వారి శక్తి ఏమిటో ఈ చిత్రం చూస్తే తెలిసేలా ప్రయత్నించాను. నా ప్రయత్నాన్ని ప్రజలకు చేరనీయకుండా ప్రభుత్వం అడ్డుపడుతోంది’ అని ‘న్యూడ్‌’ చిత్ర దర్శక, నిర్మాత రవి జాదవ్‌ ఆరోపించారు.