‘బాహుబ‌లి’కి ప్రీక్వెల్‌ వస్తోంది !

రాజ‌మౌళి తెర‌కెక్కించిన ‘బాహుబ‌లి’ సిరీస్‌లో వ‌చ్చిన రెండు భాగాల‌కి ద‌క్కని గౌర‌వం లేదు, అందుకోని అవార్డులు లేవు .  అన్నింటా విజ‌యబావుటా ఎగుర‌వేస్తూనే ఉంది ఈ చిత్రం. కథ – కథనం – చిత్రీకరణ – సంగీతం – నటీనటులు – ప్ర‌మోష‌న్స్ ఇలా ప్ర‌తి ఒక్క‌టి సినిమా ఇంత‌టి ఘ‌న విజ‌యం సాధించ‌డానికి కార‌ణ‌మ‌య్యాయి అని చెప్ప‌వ‌చ్చు. క‌థ బాగున్నా, ఎన్ని టెక్నిక‌ల్ వాల్యూస్ వాడినా ఫ్లాప్‌గా మిగిలిన సినిమాలు లేక‌పోలేదు. కాని రెండు పార్టులుగా తెర‌కెక్కిన బాహుబ‌లికి అన్నీకుదిరి ఇండియాలోనే కాక ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా అశేష ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. చైనాలోనూ ఈ చిత్రం విజ‌య‌బావుటా ఎగుర‌వేస్తుంది.

బాహుబ‌లి చిత్రంకి చైనాలోను మంచి రెస్పాన్స్ రావ‌డంతో చిత్ర నిర్మాతలు ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డలు మీడియాతో మాట్లాడారు… త్వ‌ర‌లో బాహుబ‌లి ప్రీక్వెల్‌కి స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలిపారు. అయితే ఈ ప్రీక్వెల్ వెండితెర‌పై కాకుండా ఆన్‌లైన్ సిరీస్‌గా ఇంగ్లీష్‌, హిందీ భాష‌ల‌లో రూపొంద‌నుంద‌ని వారు అన్నారు. ఆగ‌స్ట్‌లో ప్రీక్వెల్ షూటింగ్ ప్రారంభం కానుండ‌గా, ఇందులో అంద‌రు కొత్త న‌టీన‌టులే క‌నిపిస్తార‌ట‌. శివ‌గామి చిన్న‌త‌నం నుండి జిరిగే క‌థ‌ని ప్రీక్వెల్‌లో చూపించ‌నుండగా, దీని కోసం మాహిష్మ‌తి సెట్‌తో పాటు మరికొన్ని సెట్స్ రూపొందించి ప్రీక్వెల్ తెర‌కెక్కించ‌నున్నారు.

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన బాహుబ‌లి చిత్రం పాఠ్యాంశంగా కూడా ప్ర‌చురిత‌మైంది. ప్రతిష్టాత్మక అహ్మదాబాద్ ఐఐఎం విద్యార్థుల మేనేజ్ మెంట్ సిలబస్ లో బాహుబలిని ఓ అంశంగా చేర్చిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. బాహుబలి థీమ్‌తో వచ్చిన కామిక్‌ బుక్స్‌, ఏనిమేషన్‌ సిరీస్‌, మర్చెంట్‌ డైస్‌లకు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. దీంతో త్వ‌ర‌లో రానున్న ప్రీక్వెల్ ఆన్‌లైన్ సిరీస్‌కి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని టీం భావిస్తుంది. బాహుబ‌లి 2 చిత్రం 65వ జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డుల‌లో భాగంగా ఉత్తమ యాక్షన్‌, ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డులను గెలుచుకున్న విష‌యం విదిత‌మే.