90వ ఆస్కార్‌ అవార్డులు : ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’కి ఆస్కార్‌ల పంట

ప్రపంచ వ్యాప్తంగా సినీ వర్గాలు, సినీ ప్రేమికులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 90వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ అవార్డుల వేడుకకు లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్సీ థియేటర్‌ వేదికగా నిలిచింది. మెస్మరైజ్‌ చేసే రీతిలో రూపొందిన ఆస్కార్‌ వేదికకు గ్లోబల్‌ సెలబ్రిటీల అందాలు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ప్రపంచ సినీ తారల సందడితో ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ఆద్యంతం అద్భుతంగా జరిగింది. ఉత్తమ చిత్రాల విభాగంలో 9 చిత్రాలు పోటీ పడగా అందులో ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. గ్యారీ ఓల్డ్‌మ్యాన్‌ (డార్కెస్ట్‌ అవర్‌) ఉత్తమ నటుడిగా, ఫ్రాన్సిస్‌ మెక్‌ డోర్మండ్‌ (త్రీ బిల్‌ బోర్డ్స్‌ అవుట్‌ సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ) ఉత్తమ నటిగా, గల్లీర్మో డెల్‌ టోరో ( ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌) ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఉత్తమ చిత్రం ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’కి ఆస్కార్‌ల పంట పండింది. ఏకంగా నాలుగు పురస్కారాలను దక్కించుకుని ప్రధమ స్థానంలో నిలవగా, ‘డన్‌కిర్క్‌’ మూడు అవార్డులతో రెండో స్థానంలో, ‘బ్లేడ్‌ రన్నర్‌ 2049’, ‘కో కో’, ‘డార్కెస్ట్‌ అవర్‌’, ‘త్రీ బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ’ చిత్రాలు రెండు పురస్కారాలతో మూడవస్థానాన్ని సొంతం చేసుకున్నాయి.
ఈ యేడాది కూడా వ్యాఖ్యాతగా జిమ్మీ కిమ్మెల్‌ వ్యవహరించారు. వరుసగా రెండుసార్లు ఆస్కార్‌ వేడుకలకు హోస్ట్‌గా నిలిచిన ఘనత జిమ్మీకే దక్కటం విశేషం. తనదైన హాస్య చతురతతో ఆహుతులను ఉత్సాహపరిచారు అంతేకాదు ఆస్కార్‌ విజేతల పేర్లు ప్రకటించగానే సెలబ్రిటీలు ఎవ్వరూ గబగబా సీట్ల నుంచి లేవకూడదనే సున్నితమైన హెచ్చరిక కూడా చేశాడు. గతేడాది ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమంలో పొరపాటుగా ‘లా లా ల్యాండ్‌’ను ఉత్తమ చిత్రంగా ప్రకటించారు. ఆ తర్వాత ‘మూన్‌లైట్‌’ అని సవరించుకున్నారు. ఈ పొరపాటు పునరావృతం కాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోస్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు అందాల కథానాయికలు ఆస్కార్‌ రెడ్‌ కార్పెట్‌పై భిన్న వస్త్రాలంకరణతో హల్‌చల్‌ చేస్తూ ఆహుతులను అలరించారు.

ప్రపంచ వ్యాప్తంగా విశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న దివంగత సినీ ప్రముఖులకు ఆస్కార్‌ వేడుకల్లో నివాళ్ళర్పించే సంప్రదాయం ఉంది. ‘ఇన్‌ మెమొరియం’ పేరుతో ఎడ్డీ వెడ్డెర్‌(పెరల్‌ జామ్‌ ఫేమ్‌) నిర్వహించిన ప్రదర్శనలో దివంగత అంతర్జాతీయ నటీనటులు ‘జేమ్స్‌బాండ్‌’ స్టార్‌ రోజర్‌ మూరే, మేరీ గోల్డ్‌బెర్గ్‌, జోహాన్‌ జోహోన్సన్‌, జాన్‌ హెర్డ్‌, శామ్‌ షెఫర్డ్‌లకు కూడా ఆస్కార్‌ వేదికగా నివాళ్ళర్పించడం ఓ విశేషమైతే, ఇందులో భాగంగా మన దేశానికి చెందిన లెజెండ్స్‌ శ్రీదేవి, శశి కపూర్‌ను కూడా గుర్తు చేసుకోవడం మరో విశేషం. 13 నామినేషన్లతో ఆస్కార్‌ బరిలో అమీతుమీ తేల్చుకునేందుకు దిగిన ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’ చిత్రం నాలుగు అవార్డులతో విజయకేతనం ఎగురవేయగా, 8 నామినేషన్లతో ‘డన్‌కిర్క్‌’ సినిమా 3, 7 నామినేషన్లతో ‘త్రి బిల్‌బోర్డ్స్‌ అవుట్‌సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ’ 6 నామినేషన్లతో ‘డార్కెస్ట్‌ అవర్‌’ చిత్రాలు 2 రెండు పురస్కారాలకు మాత్రమే పరిమితమైపోయాయి. రెండు నామినేషన్లతో ఆస్కార్‌ బరిలో దిగిన ‘ది పోస్ట్‌’ ఒక్క ఆస్కార్‌నూ దక్కించుకోకుండా విశ్లేషకుల అంచనాలను తారుమారు చేసింది.

మనసు పొరల్ని స్పృశించే ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’..
1962లో అమెరికాలోని కోల్డ్‌వార్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. అత్యంత సెక్యూరిటీ కలిగిన బయోలాజికల్‌ ల్యాబ్‌లో ఎలిసా అనే అనాథ యువతి పనిచేస్తుంటుంది. ఆమె మాట్లాడలేని మూగ. కానీ అమితమైన ప్రతిభ ఆమె సొంతం. ఆ ల్యాబ్‌లో ఓ వింత జీవిపై ప్రయోగాలు చేస్తుంటారు. ఆ జీవి శాస్త్రవేత్త మాట వినదు, కానీ ఎలిసాకు బాగా కనెక్ట్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి అనుబంధం విడదీయలేనంతగా పెరుగుతుంది. అనంతరం చోటు చేసుకున్న ఆసక్తికర, భయానక సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం. ఈ ఫాంటసీ డ్రామా చిత్రాన్ని దర్శకులు గుల్లెర్మో డెల్‌ టోరో రూపొందించారు. గత డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అభినందనలతోపాటు విమర్శకుల ప్రశంసలందుకుంది. అంతేకాకుండా కమర్షియల్‌గానూ వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటింది. మనిషికి, మూగ జీవికి మధ్య వైరాన్ని, మనిషిలోని క్రూరత్వాన్ని, మూగజీవిలోని అమాయకత్వాన్ని ఆద్యంతం కళ్లకు కట్టినట్టు ఆవిష్కరించిందీ చిత్రం. ఇందులో వింత జీవి, ఎలీసాల అనుబంధం మనసు పొరల్ని సుతిమెత్తగా స్పృశిస్తుంది. వింత జీవి ప్రేమలో ఎలిసానే కాదు ప్రేక్షకులూ పడిపోతారంటే అతిశయోక్తి లేదు. అంత అద్భుతంగా, హృద్యంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించిన వైనానికి నాలుగు ఆస్కార్‌ అవార్డులు వరించాయి. ఇందులో ఎలీసాగా సాలీ హాక్సీన్‌ నటన అత్యద్భుతం. ఆమె పడే మానసిక వేదనకు ఎవ్వరైనా సరే కంట తడిపెట్టాల్సిందే. 20 మిలియన్‌ డాలర్లతో తెరకెక్కి ఏకంగా 114 మిలియన్‌ డాలర్లను వసూలు చేసిందీ చిత్రం.

నూతన శక్తినిచ్చింది : గ్యారీ ఓల్డ్‌ మ్యాన్‌
నాలుగు దశాబ్దాలుగా రాణిస్తున్నప్పటికీ గ్యారీ ఓల్డ్‌ మ్యాన్‌ ఉత్తమ నటుడిగా తొలిసారి అవార్డు అందుకోవడం విశేషం. ‘డార్కెస్ట్‌ అవర్‌’లో మాజీ బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ అవార్డు అందుకోగానే తన తల్లిని గుర్తు చేసుకుంటూ, ఆస్కార్‌ అవార్డును ఇంటికి తెస్తానని మా అమ్మ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోందన్నారు. ‘నాకు ఇంతటి గిఫ్ట్‌ను ఇచ్చిన అమెరికాకు థ్యాంక్స్‌. నేను అమెరికాలో ఎంతో కాలంగా నివసిస్తున్నా. నాకు ప్రేమ, ఉండటానికి ఇల్లు, ఫ్రెండ్స్‌ను ఇచ్చింది. ఇప్పుడు అంతకు మించిన వండర్‌ఫుల్‌ గిఫ్ట్‌ను ఇచ్చింది. ఈ సినిమా ఓ నూతన శక్తినిచ్చింది. సౌత్‌ లండన్‌ నుంచి వచ్చిన యువకుడికి కల నెరవేరింది’ అని గ్యారీ ఉద్వేగభరితంగా చెప్పారు.

ప్రతిభను తెలియజేసే అద్భుత అవకాశం : ఫ్రాన్సెస్‌ మెక్‌ డోర్మండ్‌
ఉత్తమ నటి విభాగంలో ఆస్కార్‌ను కైవసం చేసుకున్న ఫ్రాన్సెస్‌ మెక్‌ డోర్మండ్‌ ఈ చిత్రంలో ఓ హత్య కేసులో కూతుర్ని పోగొట్టుకుని న్యాయం కోసం పోరాడుతున్న తల్లి పాత్రలో నటించారు. ఇందులో ఆమె పలికించిన భావోద్వేగాలు, సెంటిమెంట్‌, సంఘర్షణలు ఆద్యంతం ఆకట్టుకుంటుంది. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా రాణిస్తున్న ఈ అమెరికన్‌ నటికిది రెండో ఆస్కార్‌ అవార్డు. గతంలో 1997లో వచ్చిన ‘ఫార్గో’ చిత్రానికి ఆస్కార్‌నందుకుంది. ‘మన ప్రతిభ ఏంటో తెలియజేసే అద్భుత అవకాశమిది. రాబోయే తరానికి నూతనోత్సాహాన్నిస్తుంది’ అని ఫ్రాన్సెస్‌ పేర్కొన్నారు.

కళకి ఏ బేధం లేదు : గల్లీర్మో డెల్‌ టోరో
ఉత్తమ చిత్రం ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’కి గానూ ఉత్తమ దర్శకుడిగా మెక్సికన్‌ దర్శకుడు గల్లీర్మో డెల్‌ టోరో ఆస్కార్‌ను అందుకున్నారు. ‘ఫిల్మ్‌ మేకర్‌ అలెజాండ్రో ఇన్నారిటు, ఆల్ఫోన్సోలాగా నేను కూడా వలస వచ్చిన వాడిని. కానీ కళకి ప్రాంతం, భాష, ఇండ్రస్టీ అన్న భేదం లేదు. ఎక్కడైనా ఆదరణ, మనుగడ సాధిస్తుంది. ఇదొక గొప్ప అంశం. నన్ను, నా సినిమా కథను నమ్మిన ఫాక్స్‌కు, సపోర్ట్‌ చేసిన టీమ్‌కు, ఫ్యామిలీకి థ్యాంక్స్‌’ అని గల్లీర్మో డెల్‌ తెలిపారు.

ఆస్కార్‌ విజేతల వివరాలు..
ఉత్తమ చిత్రం: ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’
ఉత్తమ దర్శకుడు: గల్లిర్మో డెల్‌ టోరో ( ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌)
ఉత్తమ నటుడు: గ్యారీ ఓల్డ్‌మ్యాన్‌ (డార్కెస్ట్‌ అవర్‌)
ఉత్తమ నటి: ఫ్రాన్సిస్‌ మెక్‌డోర్మండ్‌
(త్రీ బిల్‌ బోర్డ్స్‌ అవుట్‌ సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ)
ఉత్తమ సహాయ నటుడు: సామ్‌ రాక్‌వెల్‌
(త్రీ బిల్‌ బోర్డ్స్‌ అవుట్‌ సైడ్‌ ఎబ్బింగ్‌, మిస్సోరీ)
ఉత్తమ సహాయ నటి: ఆల్లీసన్‌ జెన్నీ ( ఐ, టోన్యా)
ఉత్తమ విదేశీ చిత్రం: ‘ఎ ఫెంటాస్టిక్‌ ఉమెన్‌’ (చిలీ)
ఉత్తమ యానిమేటెడ్‌ చిత్రం : ‘కోకో’
ఉత్తమ యానిమేటెడ్‌ లఘు చిత్రం : ‘డియర్‌ బాస్కెట్‌బాల్‌’
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం : ‘ఐకారస్‌’
ఉత్తమ లఘు చిత్రం: ‘హెవెన్‌ ఈజ్‌ ఏ ట్రాఫిక్‌ జామ్‌ ఆన్‌ ది 405’
ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ లఘు చిత్రం: ‘ది సెలెంట్‌ చైల్డ్‌’
ఉత్తమ ఫొటోగ్రఫీ చిత్రం: ‘బ్లేడ్‌ రన్నర్‌ 2049’
ఉత్తమ ఎడిటర్‌ : లీ స్మిత్‌ (డన్‌కిర్క్‌)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : మార్క్‌ బ్రిడ్జెస్‌ (ఫాంటమ్‌ థ్రెడ్‌)
ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ : ‘ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌’ (అలెగ్జాండ్రె డెసప్టాట్‌)
ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ : ‘రిమెంబర్‌ మీ..’ (కో కో)
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ : పాల్‌ డెన్‌హామ్‌,
ఆస్టర్‌బెర్రీ (ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌)
ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌ : మార్క్‌ వీన్‌గార్డెన్‌, గ్రెడ్‌ ల్యాన్‌డార్కర్‌,
గ్యారీ ఎ.రిజ్జో (డన్‌కిర్క్‌)
ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌ : అలెక్స్‌ గిబ్సన్‌, రిచర్డ్‌ కింగ్‌ (డన్‌కిర్క్‌)
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ : జాన్‌ నీల్సన్‌, గెర్డ్‌ నెప్జర్‌, పాల్‌ లాంబర్ట్‌, రిచర్డ్‌ ఆర్‌.హూవర (బ్లేడ్‌ రన్నర్‌ 2049)
ఉత్తమ మేకప్‌, హెయిర్‌ ఆర్టిస్ట్‌ : కజుహిరో సుజి, డేవిడ్‌ మాలినోవ్‌స్కీ, లైసీ సిబ్బెక్‌ (డార్కెస్ట్‌ అవర్‌)
ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే : జేమ్స్‌ ఐవరీ (కాల్‌ మి బై యువర్‌ నేమ్‌)
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే : జోర్డన్‌ పీలే (గెటౌట్‌)