పాలగుమ్మి సాయినాథ్ ‘ఆఖరి యోధులు’ పుస్తకావిష్కరణ !

విస్మృత యోధుల గాథలే ఆఖరి యోధులు
– సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు
నవతెలంగాణ బుక్ హౌస్ సంపాదకులు కె. ఆనందాచారి అధ్యక్షతన జరిగిన సభలో పాలగుమ్మి సాయినాథ్ రచించిన ‘ఆఖరి యోధులు’ పుస్తకాన్ని సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు ఆవిష్కరించారు.  తొలి ప్రతిని తెలంగాణ సాయుధపోరాటం యోధురాలు మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యురాలైన మల్లు లక్ష్మికి అందచేశారు.  సీపీఐ (ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధులను కూడా విభజిస్తుందని అన్నారు. ఈ పుస్తకంలో ఎందరో చిన్న చిన్న వ్యక్తులు కలిస్తేనే ఇంత పెద్ద స్వాతంత్ర్య పోరాటం జరిగిందని తెలిపారు. ఆ చిన్న చిన్న సమరయోధుల చరిత్ర ఈ పుస్తకంలో ఉందన్నారు. యువత చదవాల్సిన ముఖ్యమైన పుస్తకం ఆఖరియోధులు అని తెలిపారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం క్రమంగా పాఠ్య పుస్తకాల నుండి తొలగిస్తుంది. దానిని తిప్పికొట్టేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందని అన్నారు.
పాలగుమ్మి సాయినాథ్ మాట్లాడుతూ… ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 110కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక వెబ్ సైట్ నడుపుతోంది. అయితే అందులో స్వాతంత్ర్య సమరయోధుల ఫోటోలు కానీ, ఇంటర్య్వూలు కానీ లేవు.  కానీ, అందులో మోడీ ఫోటోలు, వీడియోలు పెట్టారు. ఈ పుస్తకం విడుదలైన తరువాత ఆ వెబ్ సైట్ లో కొంతమంది పేర్లు పెట్టారు. అందులోనూ వివక్షతను ప్రదర్శించారు. కమ్యూనిస్టులు విస్మరణకు గురయ్యారు. స్వాతంత్ర్య సమర యోధులంటే ఎక్కువ మంది గాంధీ, నెహ్రు, వల్లభాయ్ పటేల్ అని చెబుతారు. మరికొంతమంది భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి పేర్లు చెబుతారు. అసలు భగత్ సింగ్ ఎవరంటే ఒక జర్నలిస్టు. అనేక భాషలు వచ్చు. చాలా లోతైన విశ్లేషణలతో కధనాలు రాశారని తెలిపారు. ఆయనను ఉరి తీసే సమయంలో కూడా ఒక కొత్త భాష నేర్చుకుంటున్న విషయం ఎంత మందికి తెలుసు. ఆనాడు భగత్ సింగ్ సహచరుడు శివవర్మ మేము పుట్టుకతో నాయకులం కాలేదు. పోరాటమే మమ్మల్ని నాయకులను చేసింది. రెండేండ్ల క్రితం మల్లు స్వరాజ్యంను నేను ఇంటర్య్వూ చేసినప్పుడు ఆమె అదే విషయాన్ని తెలిపారు. ఇలాంటి వారి గురించి ప్రపంచానికి తెలియజేయాలన్న సంకల్పమే నన్ను నడిపింది.
కరోనాతో మన దేశంలో మరణించిన వారి సంఖ్య ప్రభుత్వం చెప్పే లెక్కలకు, డబ్య్లూ హెచ్ ఓ చెప్పే వివరాల్లో తేడా ఎందుకున్నాయి. ఈ తేడాలను పాలక పార్టీలకు వంత పాడే మీడియా వీటిని ప్రశ్నించదు. ఎందుకంటే ఈ మీడియా మొత్తం కార్పోరేట్ చేతిలో బందీ అయిందని తెలిపారు.‌
అధ్యక్షత వహించిన ఆనందాచారి మాట్లాడుతూ… పాలగుమ్మి సాయినాథ్ ఆంగ్లం రాసిన ‘లాస్ట్ హీరోస్ ‘ను విజయకుమార్ తెలుగు అనువాదం చేశారని తెలిపారు. ఈ పుస్తకంలో  కేవలం చరిత్రను మాత్రమే తెలిపేది కాదు. చరిత్రలో చోటు దక్కని ఎందరో యోధులను మనకు పరిచయం చేసే పనిని ఈ రోజు సాయినాథ్ తన భుజాలపై వేసుకున్నారు.  వినయకుమార్ చాలా త్వరగా తెలుగులో అనువాదం చేశారని తెలిపారు.
అనువాదకులు వినయకుమార్ మాట్లాడుతూ… ఇందులో ఉన్నది విస్మృత యోధుల చరిత్ర అని తెలిపారు. స్వేచ్ఛ కోసం చేసిన పోరాటాల చరిత్ర ఇదని తెలుపుతుందన్నారు. స్వాతంత్ర్య సమరంలో ఇంతమంది పాల్గొన్నారా అని మనకు ఆశ్చర్యం కల్గిస్తుందని తెలిపారు.  పాలగుమ్మి సాయినాథ్ గారి ఆలోచన చాలా విస్తృతమైందని అన్నారు. ఈ సభలో నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ జనరల్ మేనేజర్ ఆర్.వాసు, మేనేజర్ కృష్ణారెడ్డి, సాహితీవేత్త మోత్కూరు నరహరి, సీనియర్ నాయకులు రఘుపాల్, కొండపల్లి పవన్, నెల్లూరు నర్సింహా రావు, అనంతోజు మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.