క్రేజీ కాంబినేషన్ కు ఖర్చు పెరిగినా, లాభం మిగులు !

‘పవర్ స్టార్’ పవన్‌కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమాను నిర్మిస్తోంది హారిక హాసిని సంస్థ. ఈ సినిమాను ప్లాన్ చేసినప్పుడు రూ. 95 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఇందులో ఎక్కువ భాగం  హీరో పవన్, దర్శకుడు త్రివిక్రమ్‌ల పారితోషికమే. దీనికి తోడు సినిమాలోస్పెషల్ విజువల్ ఎఫెక్ట్ కోసం ఎక్కువ మొత్తాన్ని కేటాయించారు. ఇక విదేశాల్లోషూటింగ్,భారీ సినిమా సెట్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో సినిమా ప్రారంభంలోనే బడ్జెట్ ఓ ఐదు కోట్లు పెరుగుతుందని ముందే ఊహించారు.

అయితే ఇప్పుడు ఆ అంచనాలు సరిపోవడం లేదట. మొత్తం సినిమా పూర్తయ్యేసరికి రూ.120 కోట్ల మేరకు బడ్జెట్ అవుతోందని సమాచారం. ఇప్పటికే ఎక్కువ మొత్తం ఖర్చయింది. ఇంకా సినిమా చాలా ఉంది. కాబట్టి మొత్తానికి సినిమా బడ్జెట్ రూ.120 కోట్ల వ్యయం తప్పదని టాక్. అయితే,నిర్మాత అదృష్టమేమిటంటే… పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు భారీ క్రేజ్ ఉంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాలు ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ భారీ కలెక్షన్లు సాధించి అప్పట్లో సరికొత్త రికార్డులను సృష్టించాయి. అందువల్ల ఈ  చిత్రానికి అన్నీ కలిపి 150 నుంచి రూ.160 కోట్ల మేరకు బిజినెస్ జరుగుతుందని ఫిల్మ్‌మేకర్స్ ధీమాగా ఉన్నారని తెలిసింది. ఆ ధీమాతోనే ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు.