ప్రేక్షకులను హింసించిన….. ‘అజ్ఞాతవాసి’ చిత్ర సమీక్ష

                                                 సినీవినోదం రేటింగ్ : 2/5
హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌ బ్యానర్ పై త‌్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ రచన దర్శకత్వం లో ఎస్‌.రాధాకృష్ణ‌ ఈ చిత్రాన్ని నిర్మించారు
 
ఏబీ గ్రూప్ అథినేత గోవింద భార్గవ్ తో(బొమన్ ఇరానీ) పాటుగా అతడి వారసుడిని కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేస్తారు. దీంతో గోవింద భార్గవ్ భార్య ఇంద్రాణీ (ఖుష్బూ)అజ్ఞాతంలో ఉన్న తమ పెద్ద కుమారుడు అభిషిక్త్ భార్గవ్ (పవన్ కళ్యాణ్) ను కంపెనీని కాపాడమని, తండ్రిని చంపిన వాళ్ళను కనిపెట్టమని అస్సాం నుంచి వెనక్కి పిలుస్తుంది. ఏబీ గ్రూప్ లో బాలసుబ్రహ్మణ్యం పేరుతో మేనేజర్ గా జాయిన్ అభిషిక్త్ భార్గవ్ … గోవింద భార్గవ్ వారసుడి హత్యకు కారణాలను అన్వేషించటం మొదలు పెడతాడు.ఈ ప్రయత్నంలో బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించాడా..? అసలు ఈ హత్య చేసింది శర్మా? వర్మా ఎవరు..? గోవింద్ భార్గవ్, సీతారామ్‌ (ఆది పినిశెట్టి)లకు సంబంధం ఏంటి..? అన్నది సినిమాలో తెలుసుకోవాలి …..
 
ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ ల కలయికలో వ‌చ్చిన హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇంతవరకు దర్శకుడిగా ఎప్పుడూ పూర్తిగా నిరాశ పరచని త్రివిక్రమ్‌ తాను కూడా ఒక ‘అర్ధం లేని సినిమా’ తీయగలను అని నిరూపించడానికే ఈ చిత్రం చేసాడా ? అనే అనుమానం కలిగించేలా వుంది అజ్ఞాతవాసి.ఈ చిత్రం చూస్తున్నపుడు ‘అత్తారింటికి దారేది’ ఛాయలు బలంగా కనిపిస్తూనే వుంటాయి.’లార్గో వించ్‌’ అనే ఫ్రెంచ్‌ సినిమా కథ ఇన్స్పిరేషన్ తో , ‘అత్తారింటికి దారేది’ టచ్‌తో ఈ చిత్రం చేసారు .తమ కుటుంబాన్ని వదిలిపోయిన మేనత్త పంతాన్ని విడిపించి, తాతయ్య కోరిక తీర్చాలని వచ్చే మేనల్లుడు కథ ‘అత్తారింటికి దారేది’ . కానీ ఇక్కడ తన తండ్రిని , సోదరుడిని చంపేసి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని కాజేయాలని చూస్తున్నవారి బారి నుండి కాపాడటానికి వచ్చే కొడుకు కథ ‘అజ్ఞాతవాసి’.త్రివిక్రమ్ ఈ సినిమాలో పూర్తిగా అలసత్వాన్ని ప్రదర్శించారు. ముఖ్యమైన అన్ని పాత్రల్ని తక్కువ స్థాయిలో రూపొందించి, సినిమాను బోర్ కొట్టించేశాడు. దాంతో పవన్ కళ్యాణ్ ఛరీష్మా కూడా సినిమాను కాపాడలేకపోయింది. త్రివిక్ర‌మ్ అక్కడక్కడా డైలాగ్స్‌లో త‌న మార్కును చూపించాడు . పంచ్ డైలాగ్స్ తో పాటు.. ఆలోచింపచేసే మాటల ప్రయోగాలు చేసాడు .అయితే సినిమాలో విషయం లేకపోవడం తో అవి అంతగా పండలేదు . నిజానికి త్రివిక్ర‌మ్ క‌థ, క‌థ‌నంపై పూర్తి శ్రద్ధ పెట్టి ఉంటే బావుండేద‌నిపించింది.
 
హీరో ఏబీ ఆఫీస్‌లో ఉద్యోగం సాధించే ప్రహసనం, హీరోయిన్లతో సాగించే ప్రేమాయణం ఏదీ కూడా ఆకట్టుకోదు. విలన్‌ని ఎంటర్‌ చేసినా, బ్యాక్‌గ్రౌండ్‌లో ‘యాక్షన్‌’ నడుస్తున్నా కానీ ఎక్కడా ఉత్కంఠ రేకెత్తదు, ఆసక్తి కలగదు . అప్పటికే చల్లబడిపోయిన ప్రేక్షకులకు ఇంటర్వెల్‌ సీన్లో కుష్బూ చెప్పే డైలాగులు వేడి పుట్టించలేకపోయాయి . ఇంటర్వెల్‌ తర్వాత అయినా కథ సీరియస్‌ మూడ్‌లోకి షిఫ్ట్‌ అవుతుందని అనుకుంటే…. హీరో బలవంతపు కామెడీ కోసం రకరకాల విన్యాసాలతో విఫలయత్నం చేస్తుంటాడు . కుష్బూ-పవన్‌ల మధ్య క్లైమాక్ సన్నివేశం చూస్తే.. ఎమోషన్‌ని పండించే వృధా ప్రయాసగానే అనిపిస్తుంది తప్ప, ఏమాత్రం ప్రభావం కలిగించలేకపోతుంది.అద్భుతమైన నిర్మాణ విలువలు, అందమైన దృశ్యాలు, కనువిందైన కెమెరా పనితీరు, అక్కడక్కడా కొన్నిపాటలు మినహాయిస్తే ఈ చిత్రం లో ప్లస్‌ పాయింట్లంటూ ఏమీలేవు .
 
బాల‌సుబ్ర‌మ‌ణ్యం, అభిషిక్త భార్గ‌వ అనే రెండు షేడ్స్‌లో ప‌వ‌న్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది . సినిమా మొత్తాన్ని త‌న భుజాల‌పై ముందుకు తీసుకెళ్లాడు. త‌న‌దైన మార్కు డైలాగ్స్‌, యాక్ష‌న్స్ సీక్వెన్స్‌, న‌ట‌న‌తో ప‌వ‌న్ అభిమానులను ఆకట్టుకుంటాడు . ఇక సినిమాలో చెప్పుకోవాల్సిన మ‌రో పాత్ర ఖుష్బూ.. ఇంద్రాణి పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయింది. ‘స్టాలిన్’ త‌ర్వాత మ‌రోసారి తెలుగులో మంచి పాత్ర‌లో క‌న‌ప‌డింది ఖుష్బూ. క్లైమాక్స్‌లో ఖుష్బూ న‌ట‌న మెప్పిస్తుంది. ఇక సినిమాలో భాగ‌మైన కీర్తిసురేష్‌, అను ఇమాన్యుయేల్ పాత్ర‌లు గ్లామ‌ర్‌కే ప‌రిమిత‌మయ్యాయి. ఇక స్టైలిష్ విల‌న్‌గా న‌టించిన ఆది పినిశెట్టి మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతని పాత్రను ఇంకా బ‌లంగా ప్రోజెక్ట్ చేసుంటే హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఎలివేట్ అయ్యుండేది. శర్మ (మురళీ శర్మ), వర్మ (రావు రమేష్) పాత్రల పై నడిచే కామెడీ కొంతలో కొంత రిలీఫ్ కలిగించింది.బోమ‌న్ ఇరానీ, తనికెళ్ళ భరణి,జయప్రకాష్,ప్రరాగ్ త్యాగి, వెన్నెల కిషోర్‌, అజ‌య్, శ్రీనివాసరెడ్డి త‌దిత‌రులు ఇతరపాత్రలు పోషించారు
 
ఈ సినిమా ద్వారా తెలుగులోకి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్ త‌న‌దైన స్టైల్లో సంగీతాన్ని అందించాడు. అతని సంగీతం మనకు అలవాటైన విధానానికి భిన్నంగా ఉండటం తో, సినిమాకు పెద్దగా ఉపయోగపడలేకపోయింది. మూడు పాట‌లు, నేప‌థ్య సంగీతం బాగున్నాయి . ముఖ్యంగా ప‌వ‌న్ పాడిన ‘కొడ‌కా కోటేశ్వ‌ర‌రావా’ పాట ఆక‌ట్టుకుంటుంది. సినిమాకు మరో పస్ల్‌ పాయింట్ మణికందన్ సినిమాటోగ్రఫి. ఫారిన్ లోకేషన్స్ తో పాటు ప్ర‌తి స‌న్నివేశాన్ని చ‌క్క‌గా చిత్రీక‌రించాడు. యాక్షన్ సీన్స్ లో మణికందన్ పనితనం చాలా బాగుంది   -ధరణి