ఇందులో పవన్ కల్యాణ్ నట విశ్వరూపాన్ని చూస్తారు !

‘‘నా లోపల హృదయ వైశాల్యం ఎంత ఉంటుందంటే అభిమానించే అందర్నీ గుండెల్లో పెట్టుకోవాలనుంటుంది. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఇంత అభిమానాన్ని సంపాదిస్తానని అనుకోలేదు’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పవన్‌ కల్యాణ్, కీర్తీ సురేశ్, అను ఇమ్మాన్యుయేల్‌ హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మమత సమర్పణలో ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన సినిమా ‘అజ్ఞాతవాసి’. అనిరుద్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిత్రాన్ని జనవరి 10న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘నేను సినిమాల్లోకి వస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్లు ఎన్ని సినిమాలు చేస్తావంటే 10 లేక 12 అనుకున్నా. ‘ఖుషి’ తర్వాత వెళ్లిపోదామనుకున్నా. మీ (అభిమానులు) ప్రేమ నన్ను పాతిక సినిమాల వరకూ తీసుకొచ్చింది. జీవితంలో ఓటమికి భయపడలేదు.. గెలుపుకి పొంగిపోలేదు. ‘జానీ’ ఫెయిలయ్యాక నా శ్రేయోభిలాషులు, సన్నిహితులు నాకు అండగా నిలవకున్నా నన్నింకా సినిమాల్లో ఉండనిచ్చింది మీరే . భారతీయ జెండా చూసినప్పుడల్లా నా గుండె ఉప్పొంగుతూ ఉంటుంది. ఆ జెండా, దేశం కోసం నేను రాజకీయాల్లోకి వెళ్లానే కానీ వేరే ఏదీ కాదు.

నేను నిరాశ, నిస్పృహల్లో ఉన్నప్పుడు స్నేహితులు, హితులు నాకు చేయూతగా నిలబడలేదు. ‘గోకులంలో సీత’ చిత్రంలో ఓ రచయితగా పని చేసిన త్రివిక్రమ్, మీరు నాకు తోడుగా ఉన్నారు. దర్శకుడిగా ‘జల్సా’ సినిమాతో నాకు హిట్‌ ఇచ్చారు. అందరూ అంటుంటారు. త్రివిక్రమ్‌ మీకు బ్యాక్‌ సపోర్ట్‌ అట కదా? అని. నేను, త్రివిక్రమ్‌ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినవాళ్లం. మా ఇద్దరి ఆలోచనా విధానం ఒకటే. నా రక్తం పంచుకుని పుట్టినవారిపై నేనెప్పుడూ కోప్పడలేదు. కానీ, త్రివిక్రమ్‌ని కోప్పడగలను.అంత చనువు ఉంది. ‘జల్సా’ టైమ్‌లో నేను దుఃఖంలోనే ఉన్నా. ‘నా దేశం నా ప్రజలు’ పుస్తకం తెచ్చి ఇచ్చారు త్రివిక్రమ్‌. అది నాలో స్ఫూర్తి నింపింది.

నా మీద తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటారు నిర్మాతలు. కానీ, రాధాకృష్ణగారు సినిమాకి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. మైఖేల్‌ జాక్సన్‌ తర్వాత నాకిష్టమైన సంగీత దర్శకుడు అనిరుద్‌’’ అన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ….
ముందు ఒక మాటతో మొదలెట్టి అదే మాటతో ముగిస్తాను. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. ఆ మహానుభావులలో కొందరు ఈ స్టేజ్‌పై కూడా ఉన్నారు…
మణికందన్ గారు.. సినిమా తప్ప వేరే పనే తెలియని మణికందన్ గారు.. ఆయనకి కెమెరా తప్పితే.. వేరే ప్రపంచమే తెలియదు. అదొక్కటే ప్రపంచం. ఆయన కన్నే ఆయన కెమెరా. అలాంటి వ్యక్తితో పనిచేశాను నేను. అయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను. థ్యాంక్యూ. ఆయనకి నేను కొంచమే చెప్పాను. ఆయన చాలా చూపించారు.
కళా దర్శకుడు ప్రకాష్ గారు.. ఆయనతో నా పరిచయం ‘అఆ’తో మొదలైంది. ఆయన చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ సినిమాకి నాకోసం చేశారు. ఈ సినిమాకి ఆయనెంటో చూపించారు. ప్రకాష్‌గారూ మీతో కలిసి పనిచేయడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. మీకు నా కృతజ్ఞతలు.
అనిరుధ్ రవిచందర్.. మేము ‘అఆ’ సినిమాకి కలిసి పనిచేయాలనుకున్నాం. డేట్స్ కుదరకపోవడంతో ఆ సినిమాకి కుదరలేదు. ఈ సినిమాకి మాత్రం ఆయన మాట ఇచ్చినట్లుగానే చేశారు. అడిగినప్పుడల్లా హైద్రాబాద్ వచ్చి మరీ మ్యూజిక్ చేశారు. ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏమిటంటే.. భయం లేకపోవడం. అది మీ దగ్గర నుండి నేర్చుకున్నాను అనిరుధ్.. మీకు అందుకు కృతజ్ఞతలు.
బొమన్ ఇరానీగారు.. ఇక నాకు ఎంతో ఇష్టమైన నటులు బొమన్ ఇరానీగారు. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ఆయనతో కలిసి పనిచేశాను. ఆయనతో మళ్లీ ఎప్పుడెప్పుడు పనిచేస్తానా అని ఎదురుచూశాను. ఎందుకంటే ఆయనతో కెమెరా ముందు కంటే కెమెరా వెనుక ఉన్న పరిచయం నాకు ఎంతో విలువైంది. ఎందుకంటే నడిచే ఓ ఫిల్మ్ లైబ్రరీ.. బొమన్ ఇరానీగారు. మరియు నేను అసూయపడే రచయిత కూడా ఉన్నారయనలో. ఆయన నన్ను ప్రతి సీన్‌లోనూ పుష్ చేస్తారు. ఇంతేనా నీవు రాయగలిగింది. ఇంకేం రాయలేవా.. అని. అది కూడా నోటితో చెప్పరు. కానీ నాకు అర్ధమవుతుంది. నేను మంచి రచయితగా అవ్వడానికి ప్రోత్సహించిన బొమన్ ఇరానీ గారికి కృతజ్ఞతలు చెబుతున్నాను.
తనికెళ్ల భరణిగారు.. నాకు పెద్దన్నలాంటి వారు. నా మొదటి సినిమాలో ఆయనకి పాత్ర లేదు. కానీ ఆయనకోసమనే ఓ పాత్ర రాశాను. కానీ ఆయన వచ్చి ఆ పాత్ర చేసి వెళ్లారు. అప్పుడే ఆయన నన్ను పెద్ద దర్శకుడిగా చూశారు. ఇప్పుడు మానేశారనుకోండి. అది వేరే విషయం. నాలో ఉన్న మధ్యతరగతి మనిషి.. ఆయనని కలిసినప్పుడల్లా లేస్తాడు. నాకు అలాంటి అనుభవాన్ని ఇచ్చిన ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
మురళీ శర్మగారు.. ఈ సినిమాకి పనిచేయడానికి ఆయన దగ్గర డేట్స్ లేవు. నేను ఫోన్ చేయగానే.. నేను పగలు మీ దగ్గర పనిచేసి.. రాత్రికి మరో సినిమాకి పనిచేస్తాను..సార్. కానీ మీ సినిమాకి పనిచేస్తాను సార్ అన్నారు. ఆయన దగ్గర నుండి అంత ఒత్తిడిలో కూడా ఆనందంగా ఎలా పనిచేయాలి అనేది నేర్చుకున్నాను. థ్యాంక్యూ సార్.
రావు రమేష్‌గారు.. నాకెప్పుడు ఒక కోరిక ఉండేది. నాకు ఇష్టమైన నటులు ఎస్వీ రంగారావుగారు. ఆయనొక మహానటుడు. నట శిఖరం. నట పర్వతం. తర్వాత సావిత్రిగారు. వారిద్దరి తర్వాత నేను అంతగా అభిమానించిన నటుడు రావుగోపాలరావుగారు. నేను ఆయనతో పనిచేయలేకపోయాను. కానీ వాళ్ల అబ్బాయితో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది. దాదాపు మా ఇద్దరి ప్రయాణం ఒకేసారి మొదలుపెట్టాం. సామాన్యంగా మనం పండిత పుత్ర అనగానే సుంఠ అని అనుకుంటాం. కానీ వాళ్ల అమ్మగారు చాలా పెద్ద పండితులు. ఆవిడ పుత్రుడు నిజంగా మరొక పండితుడు. సంస్కారం, సంస్కృతం మిక్స్ చేస్తే రావు రమేష్‌గారు. ఇక్కడ ప్రతి ఒక్కరి పేరు చెప్పలేకపోవచ్చు కానీ.. అందరూ ఎంతగానో కష్టపడ్డారు.
ఖుష్బూగారు.. ఈ సినిమాకి చాలా ముఖ్యమైన వ్యక్తి. చాలా మంచి పాత్ర. నేను రాసేటప్పుడే ఈ సినిమాకి ఖుష్బూగారు తప్ప మరొకరు చేయలేరు అనుకున్నాను. ఆవిడకి కథ చెప్పడానికి మద్రాస్ వెళ్లి కథ చెబుతుండగానే.. నీవు చెప్పక్కరలేదు.. నాకు అర్ధమైంది.. నీ వెళ్లిపో..అన్నారు. 200 సినిమాలు చేసిన అనుభవం. నా బద్దకాన్ని ఆవిడ అలా భరించారు. ఆవిడకి నేను ఏ రోజు ఏం చెప్పలేదు. ఆవిడ చేశారు. నేను షూట్ చేశాను అంతే.
ఇక కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్.. ఆ ఇద్దరమ్మాయి వారి పాత్రలకు వారే డబ్బింగ్ చెప్పుకునేలా..మీరడగవచ్చు. ఒక హీరోయిన్ తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకోవడం అంత పెద్ద విషయమా.. ఎస్.. పెద్ద విషయమే. ఎందుకంటే ఒక హోటల్‌కి వెళితే.. ఎక్స్‌క్యూజ్‌మీ అని చెప్పే ముందు రెండు నిమిషాలు ఆలోచిస్తాం. అది కరెక్టా.. కాదా..అని. మే ఐ అనలా.. షల్ ఐ అనాలా అని. మనకి రాని భాష గురించి మనం అంత ఇబ్బంది పడతాం. ఎక్కడో వేరే దేశంలో పుట్టిన అమ్మాయి, వేరే రాష్ట్రంలో పుట్టిన మరో అమ్మాయి, అక్కడి నుండి ఇక్కడి వరకు వచ్చి, మన భాషని అర్ధం చేసుకుని, దానిలో డైలాగులు చెప్పి, దాన్ని అర్ధం చేసుకుని అభినయించి నటించారు అంటే.. వారికి మనం ఎంత గౌరవం ఇవ్వాలి. అందుకే వాళ్లద్దరినీ గౌరవిస్తున్నాను. థ్యాంక్యూ. వీరిద్దరి దగ్గర నుండి క్రమశిక్షణ నేర్చుకున్నాను. ఏ రోజు కూడా వారిద్దరూ షూటింగ్‌కి ఆలస్యంగా రాలేదు. వీరిద్దరూ ఇంకా చాలా దూరం ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రాధాకృష్ణగారు.. ఇంకా ఈ సినిమా నటించిన వారంతా సినిమాకి 1 పర్సెంట్ సక్సెస్‌ని యాడ్ చేసినవారే. ఇక ఈ సినిమాకి వెన్నెముక నిర్మాత. రూపాయి ఖర్చుపెడితే చాలు అని నేను అడిగితే.. రూపాయన్నర పెడదామా అనే రాధాకృష్ణగారు నాకు దొరికారు. ఇక మేమిద్దరం కలిస్తే ఎలా ఉంటుందనేది చెప్పనవసరం లేదు. దేవుడి దయవల్ల అంతా బాగానే నడుస్తోంది. నేను కథ చెప్పినప్పటి నుండి ఈ రోజు వరకు నా వెంటే ఉండి ముందుకు తీసుకువచ్చిన ఆయనకి, ఆయన వెంటే ఉన్న పీడీ ప్రసాద్, నాగవంశీలకు నా కృతజ్ఞతలు.
సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు.. ఈ సినిమాకి పాటలు రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు.. ఆయనంటే నాకు ఎంత ఇష్టమో.. ప్రపంచానికి చాలాసార్లు చెప్పాను. తెలుగు పాటకి శిఖరస్థాయిని తీసుకువచ్చిన వ్యక్తి. తెలుగు పాటంటే ఇలా ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి. ఒక కవిలో యువకుడు ఎప్పుడూ బ్రతికే ఉంటాడు. శరీరానికి వృద్దాప్యం రావచ్చు కానీ, మనసుకు రాదు. గాలివాలుగా పాటలో మరొక్కసారి నిరూపించారు. మరొకరు ఆరడుగుల బుల్లెట్ నుండి నాతో ప్రయాణం మొదలెట్టిన శ్రీమణి. ముందున్న భవిష్యత్తు ఆయన వేసిన టార్చ్‌లైట్ వేసుకుని నడిచివెళ్లాలని కోరుకుంటున్నాను.
పవన్ కల్యాణ్‌‌గారు.. ఇంత పెద్ద సినిమాకి, ఇన్ని కోట్ల మంది ప్రజలలోకి తీసుకుపోగలిగిన సత్తా ఉన్న వ్యక్తి ఎవడు. పవన్ కల్యాణ్‌గారికి ఈ కథని ఫోన్‌లో రెండు నిమిషాలు చెప్పాను. ఆయన అప్పుడు ఇటలీలో ఉన్నారు. రెండో నిమిషంలో.. చాలా బాగుంది. ఈ సినిమా మనం చేస్తున్నాం.. అని ఫోన్ పెట్టేశారు. ఆరోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. నేను ఏదడిగితే అది చేశారు. నాకు తెలిసి ఈ సినిమాలో కల్యాణ్‌గారి నట విశ్వరూపాన్ని చూస్తారు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ఎందుకంటే మన మనసులో ఉన్న ఇష్టాన్ని పదేపదే బయటపెట్టుకోకూడదు. అది అంత బాగోదు. మన అమ్మ అంటే మనకి ఎంతిష్టమో.. పదే పదే ఎందుకు చెప్పుకోం. స్నేహితుల గురించి ఎందుకు చెప్పుకోం. అలాగే కల్యాణ్‌గారు ఎంతిష్టమో నేను చెప్పక్కర్లేదు. మీకు తెలుసు. ఆయనతో కలిసి ప్రయాణించే రోజులు మరిన్ని రావాలని, సినిమాలపరంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీరంతా కోరుకునేలా ఉన్నతమైన స్థాయికి ఆయన వెళ్లాలని మనస్ఫూర్తిగా మన అందరి తరుపున ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.. కోరుకుంటున్నాను.
మళ్లీ మొదటికే వస్తున్నాను. ఎందరో మహానుభావులు. తెలుగు సినిమాని ఉన్నత శిఖరం మీద నిలబెట్టిన మల్లీశ్వరి బిఎన్ రెడ్డి దగ్గర నుంచి, బాహుబలి రాజమౌళి వరకు మహానుభావులు. అందరికీ నా వందనాలు. గాలిపించల నరసింహారావుగారి దగ్గర నుంచి, సుసర్ల దక్షిణామూర్తి దగ్గర నుంచి..అనిరుధ్ రవిచందర్ వరకు, తెలుగు పాటని మన ఇళ్లలోకి తీసుకువచ్చిన మహానుభావులెందరో.. వాళ్లందరికీ నా వందనాలు. మార్కస్ భాట్లే, రవికాంత్ నగాయిచ్.. నాకిష్టమైన మహా మహా దిగ్థదర్శకులు విన్సెంట్‌గారు అక్కడి నుంచి మణికన్నన్ వరకు మనకు ఎందరో మహానుభావులు… వారందరికీ వందనాలు. ఎస్వీ రంగారావు దగ్గర నుంచి.. రావు రమేష్, బొమన్ ఇరానీ, మురళీ శర్మ, తనికెళ్ల భరణి వరకు ఎందరో మహానుభావులు.. వారందరికీ వందనాలు. సావిత్రి, జమున, కాంచనమాల, కన్నాంబ దగ్గర నుంచి.. కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ వరకు ఎందరో మహానుభావులు. వారందరికీ వందనాలు. ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరావు, చిరంజీవి, పవన్ కల్యాణ్.. ఎందరో మహానుభావాలు. అందరికీ నా వందనాలు. నమస్తే.. అంటూ ముగించారు.
అనిరుథ్‌ మాట్లాడుతూ…. ‘‘తెలుగులో ఇంతకంటే మంచి స్వాగతం కోరుకోవడం లేదు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు స్పందన బాగుంది. మిగిలిన పాటలూ నచ్చుతాయన్న నమ్మకం ఉంద’’న్నారు. తెలుగులో పదేళ్ల తరవాత నటిస్తున్న చిత్రమిదని, పవన్‌ – త్రివిక్రమ్‌లతో కలసి పనిచేయడం ఆనందంగా ఉందని నటి ఖుష్బూ తెలిపారు. ‘‘పవన్‌, త్రివిక్రమ్‌ల కోసమే ఈ సినిమా ఒప్పుకొన్నా’’ అన్నారు బొమన్‌ ఇరానీ. పవన్‌ పక్కన నిలబడే అవకాశం రావడమే గొప్ప వరం.. నటించడం నా అదృష్టం అని అను ఇమ్మానియేల్‌ చెప్పింది. ‘‘అనిరుథ్‌ చూడ్డానికి పెన్సిల్‌లా కనిపిస్తారు. కానీ ఆయన సంగీతంలో ఓ మ్యాజిక్‌ ఉంది. తెరపై కథానాయకుడిగా చూసి పవన్‌ని అభిమానించా. ఆయనతో పనిచేశాక నిజ జీవితంలో ఆయన ఎలా ఉంటారో తెలిశాక ఆ అభిమానం మరింత ఎక్కువైంద’’ని కీర్తి సురేష్‌ చెప్పింది. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, సిరి వెన్నెల సీతారామశాస్త్రి, భగవాన్‌, పుల్లారావు, మురళీ శర్మ, ఆది పినిశెట్టి, ఎ.ఎం.రత్నం, తనికెళ్ల భరణి, బొమన్‌ ఇరానీ, పీడీవీ ప్రసాద్‌, కళా దర్శకుడు ప్రకాష్‌, ఉమేష్‌ గుప్తా, ఛాయాగ్రహకుడు మణికందన్‌ తదితరులు పాల్గొన్నారు.