మంచి పాత్ర ఇస్తే… నా సత్తా ఏమిటో చూపిస్తా !

‘ఆర్‌ఎక్స్‌ 100’లో ఇందూ పాత్ర అంగీకరించేటప్పుడు కాస్త నెర్వస్‌గా ఫీలైన మాట వాస్తవం. ఇందూ క్యారెక్టర్‌ విన్నప్పుడు ‘ఓమై గాడ్‌’ అనుకున్నాను….అని  అంటోంది ‘ఆర్‌ఎక్స్‌ 100’లో నాయికగా నటించి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్న పాయల్‌ రాజ్‌పుత్‌.
 
‘ఆర్‌ఎక్స్‌ 100’లో ఇందూ పాత్ర పక్కింటి అమ్మాయి లాంటి పాత్ర కాదు. తెస్తే మంచి పేరు తేవొచ్చు.. లేదా నా పేరు చెడగొట్టొచ్చు. తెలుగులో ఆరంభ చిత్రంలోనే పూర్తిస్థాయి నెగెటివ్‌ రోల్‌ పోషించడమంటే… అది ప్రమాదకరమైన నిర్ణయం కావచ్చు. పైగా సినిమాలో శృంగార దృశ్యాలు కూడా ఆలోచింపజేశాయి. మాది సాంప్రదాయికమైన పంజాబీ ఫ్యామిలీ. దీనిపై మా అమ్మానాన్నతో కూర్చొని చర్చించాను. పాత్ర నచ్చిందని, నా మీద నమ్మకం ఉంచమని చెప్పాను. ఇప్పుడు మాత్రం ఈ క్యారెక్టర్‌ చేసినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. ఎందుకంటే పబ్లిక్‌ ఇందూని బాగా లవ్‌ చేస్తున్నారు. ఈ నెల 15న నా పంజాబీ చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిస్టర్‌ 420’ కూడా రిలీజైంది. అదీ మంచి హిట్టయింది. ఇటు ‘ఆర్‌ఎక్స్‌ 100’, అటు పంజాబీ సినిమా రెండూ హిట్‌ కావడంతో నాకు డబుల్‌ ధమాకా అన్నమాట.
అలాంటి పాత్ర నా డ్రీమ్‌ రోల్‌ !
అందరూ గుర్తించాల్సింది ఏమిటంటే… ఇక్కడకి నేను నటించడానికి వచ్చాను. మంచి పాత్ర ఇస్తే… నా సత్తా ఏమిటో చూపిస్తా. ఉత్తరాది అమ్మాయిని కాబట్టి ఇన్‌హిబిషన్స్‌ తక్కువగా ఉంటాయి. అయితే నేను పూర్తిగా ప్రొఫెషనల్‌ని అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి.ఒక అమ్మాయిగా నేను చాలా స్ట్రాంగ్‌. అందుకేనేమో… పవర్‌ఫుల్‌ రోల్స్, ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ స్టోరీస్‌ అంటే ఇష్టం. ‘హీరోయిన్‌’ బాలీవుడ్ సినిమాలో కరీనా కపూర్‌ చేసిన క్యారెక్టర్‌ లాంటివి చేయాలని ఉంది. ఒక యువతి సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొనే పరిస్థితులకు అద్దం పట్టే అలాంటి పాత్ర ప్రస్తుతానికి నా డ్రీమ్‌ రోల్‌ .
ఆఫర్స్‌ బాగా వస్తున్నాయి. అయితే నేను ఏవి పడితే అవి అంగీకరించను. ‘ఆర్‌ఎక్స్‌ 100’ హిట్టయింది కాబట్టి… అన్నీ అదే రకమైన నెగెటివ్‌ క్యారెక్టర్స్‌ చేయను. ఒకదానికి ఒకటి భిన్నమైన పాత్రలు చేయాలని ఉంది.తెలుగులో నా తర్వాతి సినిమా గురించి చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాను. అది అక్టోబరులో ప్రారంభమై డిసెంబరులో రిలీజ్‌ అవుతుందని అనుకుంటున్నాను.