‘మాకంద పద్య రామాయణం’ పుస్తకావిష్కరణ !

డా.సి.నారాయణరెడ్డి సృష్టించిన ‘మాకందం పద్యావళి’ ప్రేరణతో పెద్దాడ సూర్య నారాయణమూర్తి వాల్మీకి రామాయణాన్ని ‘మాకంద పద్య రామాయణం’గా రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో  కందాడై రామానుజాచార్య,  జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, తనికెళ్ళభరణి,  కుప్పా వాసుదేవ శర్మ,  ఇర‌గ‌వ‌ర‌పు సూర్యనారాయ‌ణ‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
కందాడై రామానుజచార్య మాట్లాడుతూ – ”వాల్మీకి రామాయణం రెండు విషయాలను చెబుతుంది. అందులో ‘పెద్దలమాట పెరుగన్నం మూట’ అనే విషయం ఒకటి. పెద్దలను పిల్లలు ఎలా గౌరవించాలో తెలియజేస్తుంది. లలితమైన చిన్నచిన్న మాటలతో మహాకావ్యాలుగా రామాయణాన్ని ఎంతో మంది రచించారు. కానీ వాల్మీకి రాసిన రామాయణంలోని కొన్ని ఘట్టాలకు అద్భుతాలను జోడించి లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు కొంత మంది రాశారు. కానీ ‘మాకంద పద్య రామాయణం’ లోని ప్రతి విషయం వాల్మీకి రామాయణంలా ఉంది. ఈనాటి యువతకు ఈ రామాయణం ఎంతో అవసరం. మనకు వీలున్నప్పుడల్లా రామాయణం గొప్పతనాన్ని యువత‌కు చెప్పాలి. దీని వల్ల వాళ్లకి మంచి చేసినవారవుతాం. ఇంతటి మహత్‌ కార్యాన్ని నిర్వహించిన పెద్దాడ సూర్య నారాయణమూర్తిగారికి అభినందనలు” అన్నారు.
తనికెళ్ళ భరణి మాట్లాడుతూ – ”త్రేతాయుగం నుండి నేటి వరకు ఎన్నోపురాణాలు, ఇతిహాసాలున్నాయి. వాటిలో అద్భుతమైనది ఈ రామాయణం. కేవలం ప్రస్తుత పరిస్థితులనే కాదు, భవిష్యత్‌లో కూడా ఎలా ఉండాలనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. జీవిత లోతులను ఆవిష్కరించే గ్రంథమిది. వాల్మీకి రామాయణం ప్రేరణతో ఎంతో మంది ఎన్నో గొప్ప రచనలు చేశారు. పెద్దాడ సూర్యనారాయణమూర్తిగారు మా కంద పద్య విధానంలో రామాయణాన్ని అద్భుతంగా రాశారు. ఆయన్ను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను” అన్నారు.
జొన్నవిత్తుల రామలింగేశ్వరావు మాట్లాడుతూ – ”రామాయణాన్ని పద్య భాగంగా రచించిన వారిలో విశ్వనాథ సత్యనారాయణగారొకరు. ఎన్ని సార్లు చదివినా రామాయణం కొత్తగానే అనిపిస్తుంటుంది. ఇటువంటి రామాయణాన్ని మాకంద పద్య విధానంలో అందించడం గొప్ప విషయం. జీవాత్మ, పరమాత్మల కలయికే రామాయణం. పెద్దాడ సూర్యనారాయణమూర్తిగారి పిల్లలు ఈ గ్రంథావిష్కరణలో కీలకపాత్ర వహించినందుకు వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను” అన్నారు.
వాసుదేవ శ‌ర్మ మాట్లాడుతూ – ”పెద్దాడ సూర్యనారాయణమూర్తిగారు రాసిన ఈ రామాయణ గ్రంథాన్ని ఆవిష్కరించడంలో ఆయన పిల్లలు ముందుండి అన్ని పనులు చేస్తున్నారు. రామాయణం గొప్పతనాన్ని చెప్పడానికి ఇంత కంటే ఏం కావాలి” అన్నారు.
పెద్దాడ సూర్య నారాయణమూర్తి మాట్లాడుతూ  – ”రామాయణం అందరికీ తెలిసిన కథే అయినా, అందులోని సూక్ష్మ ధర్మాలు ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. అందులోని వింద అనే మహాత్తర‌ ఘట్టం నన్ను బాగా ఆలోచింపచేసింది. అలాంటి సూక్ష్మ ధర్మంలోనుండే మాకంద పద్య రామాయణం పుట్టింది. దేవుడి ఆశీర్వాదం కారణంగానే నేను ఈ పుస్తకాన్ని పూర్తి చేయగలిగాను. భవిష్యత్‌లో మరిన్ని పుస్తకాలను రాయాలని కోరుకుంటున్నాను” అన్నారు.
కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథుల‌ను ర‌చ‌యిత పెద్దాడ సూర్య నారాయ‌ణ మూర్తి స‌న్మానించారు.