అదే ఇప్పుడు నా మొదటి, చివరి ప్రాధాన్యం !

పూజా హెగ్డే… మంచి డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె నటనలో విభిన్నంగా ఎలా చేస్తే బాగుంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఎలా? అన్నదానిపైనే నిత్యం ఆలోచిస్తూ ఉంటుందట. నృత్య దర్శకులతో సమానంగా పూజా ఆలోచిస్తుందట. దాని కోసం నిత్యం శ్రమిస్తూనే ఉంటుందట. ఈ విషయాన్ని ఇటీవల ఓ బాలీవుడ్‌ ప్రముఖ హీరో చెప్పారు.
 
‘మీ జీవితంలో దేనికి ప్రాధాన్యమిస్తారు?’ అని పూజా హెగ్డేను అడిగితే వెనుక, ముందు ఆలోచించకుండా… “నటన తర్వాతే ఇంకేదైనా…ఇదే ఇప్పుడు నా ముందున్న మొదటి, చివరి ప్రాధాన్యం. కొత్తగా ఎలా చేస్తే బాగుంటుందన్న దానిపై నేను నిత్యం ఆలోచిస్తా” అని బదులిచ్చింది. అందుకే ఇటు టాలీవుడ్‌, అటు బాలీవుడ్‌లోనూ ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’లో చేసినా అంతగా గుర్తింపు రాలేదు కానీ, హిందీలో ‘మొహొంజో దరో’లో పూజా నటనకు ప్రేక్షకుల అభినందనలు పొందింది . తెలుగు చిత్రసీమలో తన ప్రతిభను నిరూపించుకునేందుకు ‘రంగస్థలం’లో ప్రత్యేక గీతంలో చేసి మెప్పించింది కూడా. ఇక నుంచి మాత్రం ‘ఐటెమ్‌ సాంగ్స్‌’ చేయనని చెప్పింది. తెలుగులోఅల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాధం’, ఇటీవల విడుదలైన ‘సాక్ష్యం’లో చేసింది. ఎన్టీఆర్‌ హీరోగా చేస్తున్న ‘అరవింద సమేత వీరరాఘవ’లోనూ, ప్రభాస్‌ తర్వాత చిత్రంలోనూ, మహేశ్‌ బాబు ప్రస్తుతం చేస్తున్న తన 25వ సినిమాలోనూ పూజే హీరోయిన్‌. దీంతో పాటు బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్‌ 4’ చేస్తోంది.
 
తప్పుదారి పట్టించడం నాకిష్టం లేదు !
“డబ్బు కోసం ఏది పడితే అది చేయన”ని తెగేసి చెప్పారు పూజా హెగ్డే .‘ఈ బిళ్లలు మింగండి. ఎంచక్కా సన్నబడిపోండి’ అనే యాడ్‌ చూస్తే.. లావుగా ఉన్నవాళ్లల్లో చాలామంది ఎట్రాక్ట్‌ అయిపోతారు. డబ్బు , సైడ్‌ ఎఫెక్ట్స్‌ గురించి ఆలోచించకుండా కొనేస్తారు. కానీ, వాటిని ప్రమోట్‌ చేసేవాళ్లు మంచివాళ్లైతే ఆలోచిస్తారు. పూజా హెగ్డే ఈ కేటగిరీలోకే వస్తారు. ఓ ప్రముఖ ఉత్పత్తిదారులు ‘వెయిట్‌ లాస్‌ పిల్‌’ను ప్రమోట్‌ చేయమని పూజా హెగ్డేని సంప్రదించారు. భారీ పారితోషికం ఇవ్వడానికి రెడీ అయ్యారు. కానీ, పూజా ఆ ఆఫర్‌ని తిరస్కరించారు.డబ్బు కోసం ఏది పడితే అది చేయనని తెగేసి చెప్పారు.
 
‘‘స్ట్రిక్ట్‌ డైట్, యోగ , ఎక్సర్‌సైజ్‌ చేస్తే బరువు తగ్గటం పెద్ద కష్టం కాదు. వెయిట్‌ లాస్‌కు నేచురల్‌ పద్ధతిని ఫాలో అవ్వడమే మంచిది. టాబ్లెట్స్‌ యూజ్‌ చేయడం వల్ల బరువు తగ్గుతారని తప్పుదారి పట్టించడం నాకిష్టం లేదు. ఆరోగ్యం పట్ల అందరూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఈ రోజుల్లో ‘హెల్త్‌ ఈజ్‌ వెల్త్‌’ అని గుర్తించుకోవాలి. డైలీ వ్యాయామం చేసేలా లైఫ్‌స్టైల్‌ను చేంజ్‌ చేసుకోవాలి. అప్పుడే హెల్త్‌ పరంగా మంచి ఫలితం ఉంటుంది’’ అని చెబుతోంది పూజా హెగ్డే.