స్టార్‌ స్టేటస్‌తో కండీషన్స్‌ పెట్టే రేంజ్‌కి !

పూజా హెగ్డే అతి తక్కువ టైమ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో అగ్ర హీరోలందరి సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే వరుణ్‌ తేజ్‌, నాగచైతన్య, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, మహేష్‌బాబుల సరసన నటించి ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. ప్రస్తుతం బన్నీతో మరోసారి ‘అల వైకుంఠపురములో’, ప్రభాస్‌తో ఓ సినిమాలో, వరుణ్‌ తేజ్‌తో మరోసారి ‘వాల్మీకి’లోనూ నటిస్తోంది. స్టార్‌ స్టేటస్‌ రావడంతో ఆమె ఇప్పుడు కండీషన్స్‌ పెట్టే రేంజ్‌కి ఎదిగింది. ప్రస్తుతం తెలుగు దర్శకుల ముందు ఓ ప్రపోజల్‌ ఉంచింది. షూటింగ్‌ ముందు రోజే తన డైలాగ్స్‌ పేపర్‌ ఇవ్వాలని చెబుతోంది. ‘రేపు తీసే సన్నివేశాలు ముందు రోజు చూసుకోవడం వల్ల, నా డైలాగ్స్‌ నేర్చుకోవడం వల్ల సెట్‌లో ఈజీ అవుతుంది. ముందు రోజే ఇస్తే నేను వాటిని సన్నద్ధమవుతాను. దీని వల్ల నా తెలుగు భాష కూడా మెరుగుపడుతుంది’ అని తెలిపిందట. పూజా నటిస్తున్న చిత్రాల్లో ‘వాల్మీకి’ వచ్చే నెల 20న విడుదల కానుంది. ‘అల వైకుంఠపురములో’ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ చిత్రం ‘హౌస్‌పుల్‌ 4’ అక్టోబర్‌ 25న విడుదల కానుంది.
 
‘దేహమే ఆలయం’ అని పెద్దలు అన్నారు
‘దేహమే ఆలయం’ అంటోంది నటి పూజాహెగ్డే. మిస్‌వరల్డ్‌ అందాల పోటీలో పాల్గొని మూడో స్థానానికి పరిమితం అయిన ఈ బ్యూటీ ఆ తరువాత మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించి, ఆపై సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.మిస్కిన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముగముడి’ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది పూజ. ఆ చిత్రం నిరాశపరచడంతో పూజాహెగ్డేను తమిళ సినిమా మరచిపోయింది. దీంతో ఆ ఒక్క చిత్రంతోనే పూజాహెగ్డే తట్టాబుట్టా సర్దుకుంది. ఆ తరువాత టాలీవుడ్‌లో ఎంట్రీ అయ్యి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.అల్లుఅర్జున్, మహేశ్‌బాబు వంటి స్టార్లతో జతకట్టి హిట్స్‌ను తన ఖాతా లో వేసుకుంది. ‘రంగస్థలం’ చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌లో ఆడి దుమ్మురేపింది . ప్రస్తుతం టాలీవుడ్‌లో రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఇక హిందీలో ‘హౌస్‌పుల్‌ 4’ లో నటిస్తోంది. కోలీవుడ్‌లో పాగా వేయాలన్న ఆశ మాత్రం పోలేదట. అందులో భాగంగానే అందాలు ఆరబోస్తూ ప్రత్యేకంగా ఫొటో సెషన్‌ చేసుకుని, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది…
“దేహమే ఆలయం’ అని మన పెద్దలు అన్నారని, అదే విధంగా తన దేహాన్ని తాను ఆరాధిస్తానని పూజాహెగ్డే చెప్పింది.అందుకే అందాలను ప్రదర్శిస్తున్నాను.. ఇందులో తప్పేముంది? మీరు అంతగా ఇదైపోవాల్సిందేముంది?”..అంటూ నెటిజన్స్ కి సమాధానమిస్తోంది