ఆ సినిమా నాకు చాలా పాఠాలు నేర్పింది !

“సక్సెస్‌ అన్నది ఒక్కరోజులో రాలేదు. ఈ రంగంలోకి వచ్చిన కొత్తల్లో నన్ను ఫ్లాప్‌ హీరోయిన్‌ అన్నారు. కొందరైతే పూజా ఇక ఇంటికి వెళ్ళడం బెటర్‌ అని కూడా అన్నారు…. అని అంటోంది గ్లామర్‌ హీరోయిన్‌  పూజాహెగ్డే . “నిజం చెప్పాలంటే… ఈ రంగం గురించి నాకు అస్సలు ఏమీ తెలియదు. సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌, ఫ్లాప్‌ హీరోయిన్‌ అన్న పదాలు పరిచయమే లేదు. ఏ ప్రాతిపదికన అలా గుర్తిస్తారో కూడా తెలియదు. అంతా అయోమయంగా ఉండేది. అలాంటి సమయంలో ‘మెహంజదారో’ సినిమా నాకు చాలా నేర్పింది. ఆ సినిమాలో పెద్దవారితో కలిసి పనిచేయడం వలన ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. చాలా విషయాల పట్ల అవగాహన వచ్చింది”

పనిని ఎంజాయ్‌ చేయగలగాలి !

‘‘మొహెంజొదారో’ అనుభవం నాకు చాలా పాఠాలు నేర్పింది. ఆ సినిమా చేసినపుడు రెండేళ్లు మరే సినిమాలోనూ చేయనని అంగీకరించాను. దాంతో చాలా పెద్ద దర్శకుల సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. కానీ అది హిట్‌ అవ్వలేదు. ఏ పనిచేసినా పూర్తి అంకితభావంతో చేయాలనీ, ఫలితం గురించి ఆలోచించకూడదనీ అనుభవమైంది. ఆ తర్వాత నుంచి సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. కొన్నిసార్లు సినిమా మంచి హిట్‌ అవుతుందనే చేస్తాం. కానీ ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. అందుకే సినిమా అంగీకరించే ముందు అది చేస్తున్నపుడు సెట్స్‌లో ఎంజాయ్‌ చేయగలనా లేదా అని చూస్తాను. సినిమా హిట్‌ అయితే ఆ ఆనందం వారం, పదిరోజులపాటు ఉంటుంది. కానీ షూటింగ్‌ కొన్ని నెలలు ఉంటుంది. హిట్‌, ఫ్లాప్‌తో సంబంధంలేకుండా అన్నిరోజులూ పనిని ఎంజాయ్‌ చేయగలగాలి. అప్పుడే మంచి అవుట్‌పుట్‌ వస్తుంది. అసలు సినిమా ఒప్పుకునే ముందు కథే కాదు, హీరోతో పాటు నిర్మాణ సంస్థ గురించి కూడా ఆలోచిస్తాను. తెలుగులో ఓ టాప్‌ హీరోతో సినిమా ఛాన్స్‌ వచ్చింది. కానీ కథ నచ్చక వదులుకున్నాను. ఒక్క తెలుగులోనే అని కాదు బాలీవుడ్‌లో కూడా రెండు సినిమాలు అలా వదులుకోవలసి వచ్చింది”

” ప్రస్తుతం తెలుగులో మహేష్‌బాబుగారితో, ప్రభాస్‌గారితో చేస్తున్నాను. మరో రెండు సినిమాలకి ఓకే చెప్పాల్సి ఉంది. హిందీలో ఓ సినిమా పూర్తయింది. మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాను. వచ్చేసంవత్సరం చివరి వరకూ బిజీనే!” అంటూ చెప్పింది పూజా.