మాకు మేలు జరగాలంటే మహిళానిర్మాతలుండాలి !

పూజాహెగ్డే… లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు బాక్సాపీస్ వద్ద 100 కోట్ల కలెక్షన్లను వసూలు చేస్తున్నాయని, హీరోయిన్లకు కూడా హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన అవసరముందని నటి పూజాహెగ్డే అభిప్రాయపడింది. ప్రస్తుతం హీరోయిన్లకు హీరోలతో సమానంగా పారితోషికం ఇచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయని పూజాహెగ్డే తెలిపింది.
 
ఈ విషయమై పూజాహెగ్డే మాట్లాడుతూ..సినీ పరిశ్రమలో ఓ సినిమా కోసం పురుషులు ఎంత కష్టపడుతున్నారో, మహిళలు కూడా అంతే కష్టపడుతున్నారు. అయితే బాధాకరమైన విషయమేమిటంటే… సినిమాల్లో మహిళలకు తక్కువ పారితోషికం ఇవ్వడం. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించేందుకు హీరోల సినిమాలైతేనే సాధ్యమవుతుందనుకునేవారు. కానీ ఇపుడు పరిస్థితి అలా లేదు. ప్రస్తుతం వస్తున్న సినిమాలను గమనిస్తే మహిళాప్రధాన చిత్రాలు కూడా బాక్సాపీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతున్నాయి. ‘రాజీ’, ‘వీరే ది వెడ్డింగ్’ చిత్రాలే ఇందుకు నిదర్శనం. లేడీఓరియెంటెడ్ సినిమాలు కూడా ఇపుడు 100 కోట్ల మార్కును సాధిస్తున్నాయి. ఆ సినిమాలకు మంచి పారితోషికం కూడా ఇచ్చారనుకుంటున్నా. సినీ పరిశ్రమలో ప్రస్తుతం మహిళా నిర్మాతల అవసరం ఎంతైనా ఉంది. హీరోయిన్లకు మేలు జరగాలంటే మహిళానిర్మాతలుండాలి. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా మంచి వసూళ్లు తెస్తున్నాయని నిర్మాతలు కూడా అంగీకరిస్తున్నారు. 2018 సంవత్సరం మహిళాచిత్రాలకు అనుకూలమైంది. ఈ ఏడాది కూడా లేడీఓరియెంటెడ్ సినిమాలు బాగా ఉంటాయని ఆశిస్తున్నానని చెప్పింది పూజాహెగ్డే.
ఎక్కడా తగ్గడం లేదు !
పూజాహెగ్డేకు టాలీవుడ్‌లో సరైన హిట్టు ఇంత వరకూ రాలేదు. ‘దువ్వాడ జగన్నాధం’, ‘అరవింద సమేత’లు ఓ మోస్తరు విజయం సాధించినా, ఆ క్రెడిట్‌ ఆమెది కాదు. ఈ సంగతి అందరికీ తెలిసిందే! అయినా కూడా ఆమె రెమ్యునరేషన్‌ విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. తాజాగా తన కొత్త సినిమాకి పూజా కోటి 75 లక్షలు తీసుకుంటోందట! ఓ ఫ్లాప్‌ హీరోయిన్‌కి అంత మొత్తం ఇవ్వడం విడ్డూరమంటున్నారు సినీ జనాలు.ప్రస్తుతం ఆమె చేతిలో మహేశ్‌ ‘మహర్షి’, ప్రభాస్‌ ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలున్నాయి.ఇప్పుడు త్రివిక్రమ్,అల్లు అర్జున్ తాజా చిత్రం లో ఆమెను తీసుకున్నారు.