దానికి ముందే తిరిగొచ్చేయడం అదృష్టం!

“జార్జియాకు వెళ్లే ముందు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే, షూటింగ్ సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాం. జార్జియా నుంచి భారత్‌కు రాగానే ఎవరినీ కలవకుండా స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయా. లాక్‌డౌన్‌కు ముందే  తిరిగి వచ్చేయడం మా అదృష్టం. లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్లం”.. అంటూ పూజా హెగ్డే తెలిపింది. అగ్ర హీరోలందరి సరసనా టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న పూజా హెగ్డే రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రం జార్జియాలో షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి ప్రారంభమవుతున్న దశలో చిత్రబృందం జార్జియా పయనమైంది.ఈ పీరియాడిక్ లవ్‌ చిత్రం షూటింగ్ ఇటీవలె జార్జియాలో పూర్తయింది. ఆ అనుభవాలను పూజ చెప్పింది…
“సెట్‌లో ప్రభాస్ చాలా సరదాగా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా బాగుంటుంది. ప్రభాస్ ఇంతవరకు కనిపించని స్టైల్‌తో..బాడీ లాంగ్వేజ్‌తో ఈ సినిమాలో కనిపించనున్నాడు. ప్రతీ ఫ్రేమ్ ఓ విజువల్ వండర్‌గా ఉంటుంది. నాకే అలా అనిపిస్తే ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా ఫీలవుతారో ఊహించగలను. తర్వాతి షెడ్యూల్‌లో ప్రభాస్‌కు, నాకు మధ్య రొమాంటిక్ సీన్స్‌ను తెరకెక్కించనున్నార”ని పూజ చెప్పింది.
ఈ ఏడాది ఒక తమిళ సినిమా చేయాలని..
తాజాగా ఓ సినిమాతో పూజా కోలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. హీరో సూర్య నటిస్తున్న ‘అరువా’ సినిమాలో పూజా నటిస్తుందని వార్తలొచ్చాయి. ఈ మూవీలో మొదట రష్మిక మందన్నను సంప్రదించగా.. కొన్ని కారణాలతో ఆమె నో చెప్పడంతో ఈ అవకాశం పూజాను వరించినట్లు చెప్పుకున్నారు.. సింగం డైరెక్టర్‌ హరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను స్టూడియోగ్రీన్‌ సంస్థలో జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు.ఈ విషయంపై పూజా స్పందించారు. తమిళంలో ప్రస్తుతం ఏ సినిమాలో నటించడం లేదని ట్విటర్‌ ద్వారా స్పష్టం చేశారు…
‘తమిళంలో నేను సినిమా చేస్తున్నానని ఇప్పుడే క్లారిటీకి రాకండి. ఇప్పటి వరకు ఏ తమిళ సినిమాను ఒప్పుకోలేదు. ప్రస్తుతానికి కొన్ని కథలు వింటున్నాను. కానీ ఈ ఏడాది ఖచ్చితంగా ఒక తమిళ సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాను. అన్ని సవ్యంగా జరిగితే తప్పకుండా చేస్తాను’.. అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం పూజా.. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న సినిమాలో… అలాగే అక్కినేని అఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ లోనూ కనిపించనున్నారు.