రామ్‌చరణ్ తో ఐటంసాంగ్ లో పూజా హెగ్డే

రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రంగస్థలం 1985’ చిత్రంలో హీరోయిన్‌గా సమంత నటిస్తోంది. అయితే సుకుమార్ సినిమా అనగానే అందులో గ్యారంటీగా ఐటంసాంగ్ ఉంటుంది. ఐటంసాంగ్ లేకుండా సుకుమార్ సినిమాని ఊహించడం కూడా కష్టం. ఎప్పటిలానే సుకుమార్ ఈ చిత్రంలో కూడా ఓ బంపర్ ఐటం సాంగ్‌ని ప్లాన్ చేశాడని తాజాగా వార్తలు వచ్చాయి. అయితే ఈ ఐటంసాంగ్‌లో చరణ్ ‘జంజీర్’ చిత్రంలో హీరోయిన్‌గా చేసిన ప్రియాంకా చోప్రా నర్తించబోతోందని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ప్రియాంకా కాదు బాలీవుడ్‌కి చెందిన మరో భామ కరీనా కపూర్ ఈ సాంగ్‌లో చేయనుందని, దీని కోసం భారీ రెమ్యూనరేషన్ కూడా ఇచ్చారని కథనాలు వచ్చాయి.
అయితే ఈ సాంగ్‌లో చరణ్‌తో జత కట్టబోతోన్న భామ గురించి అఫీషియల్‌గా సమాచారం వచ్చేసింది. ఇందులో ఎటువంటి బాలీవుడ్ హీరోయిన్ చేయడం లేదు. ‘దువ్వాడ జగన్నాధమ్’ చిత్రంలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా నటించిన పూజా హెగ్డే ఈ ఐటంసాంగ్‌లో చేయబోతోన్నట్లుగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా తెలియజేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ విషయాన్ని తమ ట్వీట్టర్ పేజ్‌లో తెలియజేశారు. అల్లు అర్జున్‌తో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన పూజా.. ఈ ఐటం సాంగ్‌తో మెగా హీరోయిన్‌గా మెగా ఫ్యాన్స్‌కి మరింత చేరువకానుంది.