ఆమె పూజలు ఇప్పటికి ఫలించాయి !

పూజా హెగ్డే… కొన్నాళ్లుగా చిత్ర పరిశ్రమలో కథానాయికగా కొనసాగుతోన్నా..పెద్ద సినిమాలే చేసినా.. కన్నడ కస్తూరి పూజా హెగ్డేకి ఇప్పటివరకూ సరైన హిట్టే పడలేదు. తెలుగులో తొలి సినిమా ‘ఒక లైలా కోసం’ అంతగా అలరించలేదు. ఆ తర్వాతి సినిమా ‘ముకుంద’ కూడా ఈ అమెకు నిరాశనే మిగిల్చింది. ఇక సౌత్‌లో కలిసిరావడం లేదని భావించి.. బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌తో బడా ఎంట్రీ ఇచ్చిన ‘మొహెంజో దారో’ కూడా పూజా హెగ్డేకి అట్టర్ ఫ్లాప్ గానే మిగిలింది.
‘ముకుంద’ తర్వాత మెగా హీరో అయిన అల్లు అర్జున్‌తో ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలో కథానాయికగా నటించింది పూజా హెగ్డే. తొలుత హిట్ టాకే తెచ్చుకున్న ‘డీజె’  చివరకు ఫెయిల్యూర్‌గా మిగిలిపోయింది. దీంతో హిట్ కోసం ఎదురుచూసిన పూజాకి మరోసారి నిరాశ తప్పలేదు. అయితే పూజా ఐటెం నంబర్‌గా చేసిన ‘రంగస్థలం’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా.. కథానాయిక క్రెడిట్ మాత్రం సహజం గా సమంతకే దక్కింది. ఇక ఈ ఏడాది బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేసిన ‘సాక్ష్యం’ చిత్రం కూడా పరాజయాన్నే ఇచ్చింది.
‘అరవింద సమేత’ రూపంలో భారీ విజయం
హిట్ కోసం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న పూజా హెగ్డేకి తాజాగా ‘అరవింద సమేత’ రూపంలో భారీ విజయం దక్కబోతుంది. తారక్-త్రివిక్రమ్ తొలి కలయికలో రూపొందిన ఈ చిత్రం… విషయం తక్కువైనా మంచి వసూళ్లు సొంతం చేసుకుంది. దసరా సెలవుల సీజన్ కలసి రావడంతో ఈ చిత్రం కలెక్షన్ల పరంగా  మంచి విజయాన్నిసాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు . ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ వరకే పరిమితమవుతోన్న ఈ రోజుల్లో.. ఈ సినిమాలో పూజాకి మంచి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్ దక్కింది. దీంతో సోషల్ మీడియాలో తన పాత్రకు అభినందనలు వస్తుండడంతో.. ఈ సినిమాతో సక్సెస్ లభించడం తో  తెగ ఆనందపడిపోతోందట పూజా. మొత్తానికి ‘అరవింద సమేత’ తర్వాత ఇప్పుడు మహేశ్‌తో ‘మహర్షి’, ప్రభాస్-రాధాకృష్ణ లవ్ స్టోరీవంటి అగ్రహీరోల చిత్రాల్లోనూ పూజానే కథానాయికగా నటిస్తోంది.