నా ప్రతి పాత్ర తెలుగమ్మాయి కావడం వల్ల వచ్చిందే !

హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘సెవెన్’. ‘దర్శకుడు’, ‘రంగస్థలం’ సినిమాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి పూజితా పొన్నాడ ఇందులో ఒక హీరోయిన్‌గా నటించారు. జూన్ 5న సినిమా విడుదలవుతున్న సందర్భంగా పూజితా పొన్నాడతో ఇంటర్వ్యూ….
‘సెవెన్’ టైటిల్ మిస్టరీ ఏంటి?
మరో మూడు రోజుల్లో సినిమా విడుదలవుతోంది. అప్పటివరకూ ఆ సస్పెన్స్ అలాగే ఉంచుదాం.
టైటిల్ లోగోలో ‘7’ చివర ఎర్రగా డిజైన్ చేశారు. ఎందుకలా?
అది రక్తం. సినిమాలో ఎవరో మర్డర్ అవుతారనుకుంట! అందుకని అలా డిజైన్ చేసినట్టున్నారు. మరో రోజులు వెయిట్ చేయండి. మీతో పాటు ప్రేక్షకులందరికీ తెలుస్తుంది. ఎంట‌ర్‌టైనింగ్‌, డిఫ‌రెంట్ మూవీ. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్.
‘సెవెన్’లో మీ పాత్ర ఏమిటి?
నాదొక సస్పెన్స్ రోల్. ఎక్కువ రివీల్ చేయకూడదు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్లు, పాటలు చూసి ఉంటారు. ఇదొక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. కథలో కొన్ని ప్రశ్నలకు నా పాత్ర ద్వారా సమాధానం లభిస్తుంది. స్క్రీన్ ప్లే బేస్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఇది.  కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
మీరు ఇప్పటివరకూ చేసిన క్యారెక్టర్లలో ఈ సినిమాలో క్యారెక్టర్ బోల్డ్ అనుకుంట?
బోల్డ్ కాదు.. డిఫరెంట్ క్యారెక్టర్. ‘సెవెన్’లో నా క్యారెక్టర్‌కు మంచి ప్రేమకథ ఉంది. నేను నటించిన ఫస్ట్ ప్రోపర్ లవ్ స్టోరీ ఇదే అనుకుంటున్నాను.
ట్రైల‌ర్‌లో లిప్ లాక్స్‌ హాట్ టాపిక్. ఫస్ట్ టైమ్ కిస్ సీన్ చేసినట్టున్నారు?
ఈ సినిమాలో నాకు లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని ఎవరు చెప్పారు? ‘సెవెన్’లో లిప్ లాక్ లేని ఏకైక హీరోయిన్ నేనే అనుకుంటాను.
హవీష్ తో యాక్టింగ్ ఎక్స్‌పీరియ‌న్స్‌?
హవీష్ చాలా స్వీట్ పర్సన్. అతనితో పని చేయడం చాలా సులభంగా ఉంటుంది. ఈ సినిమాకు సంతకం చేయడానికి ముందే నాకు హవీష్ ఫ్రెండ్ గా తెలుసు. ఈ సినిమా షూటింగులో నటుడిగా హవీష్ గురించి తెలుసుకున్నా. తనలో డెడికేషన్ లెవల్స్ చాలా ఎక్కువ. ఫస్ట్ డే సెట్‌లో హవీష్ డెడికేషన్ చూసి ‘వావ్’ అనుకున్నాను. పని పట్ల కమిటెడ్ గా ఉన్నారు.
సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు. ఇంతమందితో నటించడం?
విచిత్రం ఏంటంటే… ఎవరికీ ఎవరితో సంబంధం ఉండదు. ఎవరి కథ వాళ్ళది. చివర్లో అందరి కథలు కలుస్తాయి. ప్రతి ఒక్కరి కథలో హవీష్ హీరో. నేను కాకుండా ఐదుగురు హీరోయిన్లు ఉన్నప్పటికీ… వాళ్ళతో ఇంటరాక్షన్ లేదు. రెజీనాగారితో మాత్రమే కాంబినేషన్ సీన్లు ఉన్నాయి. ఆమెతో నటించడం మంచి అనుభూతి. ప్రతి హీరోయిన్ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆరుగురిలో ఏ ఒక్కరు లేకపోయినా కథకు ముగింపు ఉండదు. రమేష్ వర్మగారు అంత పకడ్బందీగా కథ, స్క్రీన్ ప్లే రాశారు.
నిజార్ షఫీ దర్శకత్వం గురించి?
నేను నటించిన ‘రాజుగాడు’కి నిజార్ షఫీ గారు వర్క్ చేశారు. ఆయన టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ అని తెలుసు. ఈ సినిమాతో మంచి దర్శకుడు అని నిజార్ షఫీ గారు నిరూపించుకున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీశారు. తమిళంలో నటించడం ఎలా ఉంది?
నా స్కూలింగ్, కాలేజీ ఎడ్యుకేషన్ అంతా చెన్నైలో సాగింది. అందువల్ల, నాకు తమిళం బాగా వచ్చు. దాంతో తమిళ షూటింగ్ ఇబ్బందిగా అనిపించలేదు. ఈజీగా చేశా. తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం కావాలని కొంతకాలంగా అనుకుంటున్నా. ఈ సినిమాతో యాక్సిడెంటల్‌గా పరిచయం అవుతున్నా. ముందు బైలింగ్వల్ చేస్తున్నారని నాకు తెలియదు.
సినిమాలో పాటలు అన్నీ హిట్టయ్యాయి. మీకు నచ్చిన పాట?
‘ఆర్.ఎక్స్. 100’కి సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో నా పాట ‘సంపొద్దే’ నాకు చాలా ఇష్టం.
ప్రస్తుతం తెలుగమ్మాయిలకు అవకాశాలు ఎలా వస్తున్నాయి?
ఎవరి ప్రయాణం వాళ్ళది. ఒక హీరోయిన్ కెరీర్‌తో మ‌రో హీరోయిన్ కెరీర్‌ని కంపేర్ చేయ‌కూడ‌దు. నా వరకూ మంచి అవకాశాలు వస్తున్నాయి. దర్శక, నిర్మాతలు తెలుగమ్మాయిలు కావాలని మరీ తీసుకుంటున్నారు. మా ఇంట్లో సినిమా నేపథ్యం ఉన్నవాళ్లు ఎవరూ లేరు. నటనపై ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ చేశా. ఇంట్లో అవి చూపిస్తే ఎంకరేజ్ చేశారు. సుకుమార్ గారు నేను నటించిన షార్ట్ ఫిలిమ్స్ చూసి ‘దర్శకుడు’కి ఎంపిక చేశారు. ఆ సినిమా కాస్టింగ్ పర్సన్ కి నా పాత్రకు తెలుగమ్మాయే కావాలని సుకుమార్ గారు చెప్పారట. అదొక్కటే కాదు… ఇప్పటివరకూ నేను నటించిన ప్రతి పాత్ర తెలుగమ్మాయి కావడం వల్ల వచ్చినదే.
మీ తదుపరి సినిమాలు?
రాజశేఖర్ గారి ‘కల్కి’ విడుదలకు సిద్ధమైంది. అందులో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేను గిరిజన యువతిగా నటిస్తున్నాను. నా లుక్ నుంచి ప్రతి విషయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ గారు డిటైల్డ్ గా వర్క్ చేసి, క్యారెక్టర్ డిజైన్ చేశారు. నా రోల్ కి మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది. కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ‘కల్కి’ కాకుండా కీర్తీ సురేష్ గారితో ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నా. తమిళంలో ఒక సినిమాకు సంతకం చేశా.